నకిలీ సర్టిఫికేట్‌తో సర్కారు కొలువు..!
ఆధారాలతో ఫిర్యాదు చేసినా కదలని ఫైళ్లు..
నిమ్మకు నీరెత్తిన యంత్రాంగం..!
అర్హులైన దివ్యాంగుల నోరుకొట్టి అక్రమ పదవుల అనుభవం..
అధికారుల మౌనం వెనుక మర్మమేమిటి..?
Mask’ magic at MGM..!? నిరుద్యోగ దివ్యాంగుల ఆశలతో చెలగాటమాడుతూ నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాన్ని దక్కించుకున్న ఒక అక్రమార్కుడి ‘ముసుగు’ మాయాజాలం వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పక్కా ఆధారాలతో జిల్లా కలెక్టరేట్ గడప తొక్కినా, అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్న ఉదాసీనత అనేక అనుమానాలకు తావిస్తోంది. తప్పు చేసిన వ్యక్తిని రక్షించేందుకు తెరవెనుక ‘అదృశ్య’ శక్తులు గట్టిగానే పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Mask’ magic at MGM..!?
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ముసుకు కృష్ణ (తండ్రి: వీరమల్లు) అనే వ్యక్తి 2010లో జారీ అయిన ఒక సదరం (SADAREM) సర్టిఫికేట్‌ను అడ్డం పెట్టుకుని, తాను దివ్యాంగుడినని నమ్మించి బ్యాక్లాగ్ కోటాలో కొలువులో చేరాడు. ప్రస్తుతం ఇతడు సీనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే, ఇతనికి ఎలాంటి శారీరక వైకల్యం లేదని, కేవలం నకిలీ పత్రాలతోనే అసలైన దివ్యాంగుల పొట్ట కొట్టాడని ఎంఆర్పీఎస్ (MRPS), ఎంఎస్పీ (MSP), వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) నేతలు సాక్ష్యాధారాలతో కలెక్టర్‌కు విన్నవించారు.
Mask’ magic at MGM..!?
ఈ అక్రమ నియామకంపై గతంలోనే ఫిర్యాదులు అందినప్పటికీ, విచారణలో పురోగతి లేకపోవడం జిల్లా యంత్రాంగం పనితీరుపై మాయని మచ్చగా మారింది. అధికారులు కేవలం లేఖలకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో ముసుకు కృష్ణకు ‘ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష’ ఎందుకు నిర్వహించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు అక్రమ నియామకంపై ఆరోపణలు వెల్లువెత్తుతుంటే, మరోవైపు సదరు వ్యక్తి పదోన్నతుల కోసం ప్రయత్నిస్తుండటం అధికారుల పక్షపాత వైఖరికి నిదర్శనమని పలు సంఘాల నేతలు మండిపడుతున్నారు.
Mask’ magic at MGM..!?
”అక్రమార్కుడు కళ్లముందే తిరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. అసలైన దివ్యాంగులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోం. తక్షణమే ప్రత్యేక వైద్య బృందంతో అతని శారీరక స్థితిని తనిఖీ చేయాలి.”
అని దివ్యాంగ సంఘాల నేతలు అంటున్నారు.
Mask’ magic at MGM..!?
ఈ ‘ముసుగు’ బాగోతంపై కలెక్టర్ తక్షణమే స్పందించి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడిని సర్వీసు నుండి తొలగించి, అతను ఇప్పటివరకు పొందిన జీతభత్యాలను రికవరీ చేయాలని స్పష్టం చేశాయి. తక్షణమే స్పష్టమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.
Mask’ magic at MGM..!?
జిల్లా కలెక్టర్ గారు.. ఇప్పటికైనా ఈ ‘ముసుగు’ తొలగిస్తారా..? ప్రమోషన్ లిస్టును నిలిపివేస్తారా..?లేక అక్రమార్కులకే అండగా నిలుస్తారా..? అనేది వేచి చూడాలి..!
