I want my mom….అమ్మ ఒడి తప్పా, మరో ప్రపంచం తెలియని ఈ పసివాడి పేరు – చంద్రశేఖర్ ఆజాద్. వయసు మూడు సంవత్సరాలు. తల్లిదండ్రులు స్వప్న – దేవేందర్. నివాసము హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రము.
పాలు గారే ఈ పసివాడు ఏం పాపం చేసాడు? ఏం నేరం చేసాడు? తల్లి ఒడికి ఎందుకు దూరం అయ్యాడు? ఎవరు దూరం చేసారు? ఈ అంశానికి సంబంధించి, లోతైన చర్చ జరగాలి.
గతనెల జూలై 23, 2026 న తీవ్రవాద కుట్ర కేసులో, విశాఖపట్నంలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం.. ‘చైతన్య మహిళా సంఘం’ సభ్యులైన దేవేంద్ర, శిల్ప, స్వప్న లను దోషులుగా నిర్ధారించి, వారికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వారిలో స్వప్న, ఈ పసివాడి తల్లి. అమ్మ ఒడిలో హాయిగా ఉండాల్సిన ఈ పసివాడు, తల్లి ప్రేమకు దూరమై తీవ్ర మనోవేదనకు గురౌతున్నాడు. అమ్మకోసం రాత్రి పూట, గుక్కపెట్టి ఏడుస్తున్నాడు! ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఆ తల్లి చేసిన నేరమేమి? ఆమె సాయుధ మావోయిస్టు పార్టీ సభ్యురాలు కాదు! ఆయుధం పట్టింది లేదు, ఎవరినీ హతమార్చింది లేదు! మరి ఎందుకీ శిక్షా? ఇప్పుడున్నదీ ‘మావోయిస్టు రహిత భారతదేశం’ అని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత.. మావోయిస్టు పార్టీ సభ్యులపై ఉన్న కేసులనే మానవీయంగా ఎత్తేయాల్సింది పోయీ.. చట్టబద్ధంగా జీవిస్తున్న ప్రజాసంఘం కార్యకర్తలపై, ఈ అక్రమ కేసులు పెట్టి జైల్ల పాలు చేయడం.. ప్రజాస్వామ్య ప్రభుత్వం చేయవలసిన పనేనా? సాయుధ బాట వీడిన వాళ్ళకు, చట్టబద్ధంగా పనిచేసే అవకాశం కల్పించడం అంటే ఇదేనా? ప్రభుత్వ నేతలారా ఆలోచించండి!
మార్క్సిస్టు ఐడియాలజీ ఉన్న ‘చైతన్య మహిళా సంఘం’లో, క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తలు – దేవేంద్ర, శిల్ప, స్వప్న లు! అయితే ప్రభుత్వం దృష్టిలో, పోలీసుల దృష్టిలో ఈ సంఘం.. మావోయిస్టు పార్టీకి అనుబంధ సంఘం అనే ఆరోపణ ఉంది! సీఎంఎస్ తో పాటు, ఇంకా అనేక ప్రజాసంఘాల పట్ల, వాటి కార్యకలాపాల పట్ల కూడా, పోలీసులు చేస్తున్న ఆరోపణలు బలంగానే ఉన్నాయి! ఏదిఏమైనా సీఎంఎస్, మావోయిస్టు పార్టీకి అనుబంధ సంఘమా కాదా? అన్న చర్చను పక్కన పెడితే.. ప్రజలను సాయుధ విప్లవ పార్టీలలోకి వెళ్ళండి అని, ఏ ప్రజా సంఘం కార్యకర్తలు చెప్పరు! వీళ్లే కాదు, ప్రపంచంలో జరిగిన అనేక సాయుధ పోరాటాలలో.. సాయుధ విప్లవ పార్టీల పట్ల, సానుకూల వైఖరి ఉన్న ఏ ప్రజాసంఘాల నాయకులు కూడా, సాయుధ విప్లవోద్యమంలోకి ప్రజలను వెళ్ళమని చెప్పరు! అట్లా ఎవరైనా ఎక్కడైనా చెప్పితే.. అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది, చట్ట ప్రకారం నేరమే అవుతుంది! నిజానికి సాయుధ పోరాటంలోకి వెళ్లాలా వద్దా అన్నది, ఆ ప్రజల చైతన్య స్థితిని, వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది! ఈ కేసులో కీలక వ్యక్తి అయిన రాధ చైతన్య స్థితే, ఆమె మానసిక సంసిద్ధతే, ఆమె సాయుధ మావోయిస్టుగా మారడానికి కారణమైందే తప్పా.. ఈ మహిళా సంఘం కార్యకర్తల వల్ల ఆమె వెళ్లలేదు’ అన్నది నిజం!
నేడు ఈ సమస్య ఇంత జటిలం కావడానికి పార్టీ అవలంభించిన చర్యలు కూడా ప్రధాన కారణమే!
గతంలో చాలా చోట్ల అనేకమంది ఆడబిడ్డలు, మగ బిడ్డలు విప్లవోద్యమం లోకి వెళ్ళినప్పుడు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై, మళ్లీ వారు వెనక్కి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తుండేవారు. తెలిసిన వాళ్ల ద్వారా చెప్పంపే వారు. అంతే తప్పా, పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చే పని చేయలేదు! ఎందుకంటే నిన్నటి వరకు, ఇంటికి వచ్చిన సంఘ సభ్యులకు అన్నం పెట్టి ఆదరించారు కాబట్టి! అయితే ఈ తల్లిదండ్రుల ఆందోళనను గమనించిన పోలీసులు, కొన్ని చోట్ల ఆ పని చేస్తూ ఉంటారు. మరికొన్ని చోట్ల బలవంతంగా బెదిరించి కూడా, కంప్లైంట్ చేయిస్తుంటారు. ఇది విప్లవద్యమాన్ని బలహీనపరచడానికి, నిర్మూలించడానికి, పోలీసులు వేసే అనేక ఎత్తుగడల్లో ఇది ఒక పని. ఒక రకంగా ఈ పనులు, వారి విధి నిర్వహణలో భాగం కూడా! ఆ విధంగా 2017 లో, రాధ అనే అమ్మాయి మావోయిస్టు పార్టీలో చేరిన తర్వాత, వారి తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా, ఆనాడే ఎన్ఐఏ పోలీసులు ఈ ముగ్గురి మీదే కేసు ఫైల్ చేసి, కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ ముగ్గురిలో ఇద్దరికీ, విచారణ పేరుతో బెయిలు రాకపోవడం వల్ల, కొంతకాలం జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత వీళ్లంతా, సంఘం కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, పూర్తిగా తమ కుటుంబానికే పరిమితమై జీవిస్తున్నారు. ఈ విధంగా కొనసాగుతున్న ఈ కేసులో, ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకొని, ఈ సమస్య మరింత జటిలం కావడానికి.. పార్టీ నాయకత్వం అవలంబించిన చర్యలు కూడా, ఇక్కడ ప్రధాన కారణాలు అయ్యాయి!
2023 లో రాధ పోలీసులకు కోవర్టుగా మారిందని ఆధారాలు చూపిస్తూ, మావోయిస్టు పార్టీ రాధను చంపి ఘోరమైన తప్పు చేసింది! ఆ సంఘటనా ప్రభావం వల్లనే, ఒక సాధారణ కేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకుని, ఇప్పుడు ఈ ముగ్గురికీ, ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడేలా చేసింది. ఇది ఎవరూ కాదనలేని బహిరంగ వాస్తవం! బిడ్డ కోసం అప్పటికే పోలీసు కంప్లైంట్ ఇచ్చిన తల్లిదండ్రుల ఇంటికి, ఆ బిడ్డ పార్టీ చేతుల్లోనే హత్యకు గురికాబడితే, ఆ కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? పార్టీ నాయకుల మీద వచ్చే ఆగ్రహం, కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ ముగ్గురు కార్యకర్తల మీద వచ్చింది. వీళ్లకు కచ్చితంగా శిక్ష పడాలని, రాధ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని మరింత గట్టిగా డిమాండ్ చేశారు.
ఏదిఏమైనా, విప్లవోద్యమంలో ప్రజా సంఘాల కార్యకర్తల పాత్ర ఎంత మేరకు ఉంటుందో, వివరంగా తెలిసిన ప్రభుత్వానికి.. ముందుచూపు లేకుండా, ఈ కేసులో ఉన్న కీలక వ్యక్తిని చంపిన పార్టీ నాయకత్వానికి మధ్య.. ఈ మహిళా సంఘం కార్యకర్తలు, ఒకరకంగా సమిధలు అయ్యారు! కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి! ఆ బాలుడు తల్లి లేనివాయ్యాడు! ఈ వాస్తవ విశ్లేషణ కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఇప్పుడైనా నిజాలు మాట్లాడుకోవాలి. ఈ నిజాలు కొందరికి చేదుగానే ఉంటాయి, నిష్ఠూరంగానే ఉంటాయి. కానీ ఈ నిజాలే అంతిమంగా, మనందరి కళ్ళు తెరిపిస్తాయి! ఈ సమయంలో కూడా, “ఈ మొత్తం పరిస్థితికి రాజ్యమే కారణం అనీ, భూమి దద్దరిల్లేలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ల వల్ల ఉపయోగం లేదు! మన తప్పిదాలను కూడా స్వయం విమర్శ చేసుకున్నప్పుడే, మంచి ఫలితాలు ఉంటాయి!
“రాధ విషయంలో మావోయిస్టు పార్టీ అవలంభించిన చర్యలను..
ఆనాడు ఈనాడు సమర్థించే వారిని, ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను!”
స్వయం విమర్శే, సామాజిక విప్లవోద్యమాలకు దిక్సూచి వంటిదని వీళ్ళు ఎందుకు భావించరు? సరళ సంఘటనను సీరియస్ గా స్వయం విమర్శ చేసుకోకపోవడం వల్ల, సరియైన గుణపాఠాలు తీసుకోక పోవడం వల్ల, ఇప్పుడు రాధ సంఘటన పునరావృతం అయింది! దీని ఫలితం, ఈరోజు నాలుగు కుటుంబాలు బలై పోయాయి! ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ‘త్యాగం లేనిది, విప్లవం లేదు’ అనే సమాధానాలు, వాస్తవాలను మరుగున పరచడం కోసం కాదు!
“మానవ సంబంధాలన్నీ, ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న ఈ సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ సమాజంలో.. రక్తబంధాలు, బంధుత్వాలు, ఆస్తులు, ఉద్యోగాలు అన్నీ వదులుకొని.. ఒక స్పష్టమైన రాజకీయ విప్లవ లక్ష్యంతో.. శ్రమను గౌరవించే, ఒక సమానత్వమైన నూతన సమాజాన్ని నిర్మాణం చేయాలనీ, పార్టీ నాయకత్వం చూపిన మార్గంలో ఉద్యమించడానికి వచ్చిన సహచరుల పట్ల, వర్గ సంబంధ ప్రేమ కలిగి ఉండాలి! వారిలో వర్గ చైతన్యాన్ని పెంపొందించాలి! రాజ్యం కుట్రలను ఎదిరించలేని సహచరులను దూరం చేసుకోకుండా, వారిని మరింతగా ఎదిగించుకోవాలి! కోవర్టులుగా మారి తోటి సహచరులకు ప్రాణనష్టం కలిగించినప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో సమిష్టి నిర్ణయంతో వారికి శిక్షలు అమలు పరచాలి! నష్ట తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు, వాళ్ళను వద్దనుకుంటే ఇంటికి పంపించాలి! వారితో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ రద్దు చేసుకోవాలి! అంతేగానీ, వర్గ శత్రువులకు శిక్షలు విధించినట్లుగానే, సహచరులకు కూడా మరణశిక్షలు విధించడం, కౄరమైన రాజ్యసంస్కృతే అవుతుంది తప్పా, అది మానవీయ విప్లవ సంస్కృతి కాదు! ఎందుకంటే, ఆ తప్పుడు ధోరణులన్నీ వ్యవస్థీకృతమై ఉన్న నేరాలు కాబట్టి.. అవి వ్యవస్థను మార్చడం ద్వారానే, పరిష్కరించబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి!”
అడవి నుండి బయటకు వచ్చిన మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం, ఎందుకు ప్రేక్షకపాత్ర వహిస్తుంది?
భారత రాజ్యాంగ ప్రకారం, సాయుధ పోరాట మార్గం తప్పే అయినా, అది భారతదేశ చరిత్రలోనే చెరగని ముద్ర వేసింది! ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యాలు, పాలకుల ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా, ప్రజలు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవాలనుకున్నారు. తమ అమూల్యమైన ప్రాణత్యాగాలతో చివరి నిమిషం వరకూ, మావోయిస్టు పార్టీకి అండగా ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ లేదు, సాయుధ విప్లవోద్యమము లేదు. భారత ప్రభుత్వం ఉక్కుపాదంతో వాటిని అణచివేసింది. రక్తం ఏరులై పారింది. బతికి ఉన్న వారంతా, అడవి నుండి బయటికి వచ్చేసారు. కేంద్ర నాయకత్వం కూడా వచ్చింది. కానీ నమ్ముకున్న ప్రజలకు వాళ్ళు బరోసా ఇచ్చింది లేదు. ఆరు నెలల కాలం గడిచిపోయినా కూడా, ఉలుకూపలుకు లేదు! అందుకే ఈ సందర్భంగా నేను, మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ మాజీ నాయకత్వానికి, కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను!
1. ప్రజలు తమ అసమాన త్యాగాలతో, ఈ దేశంలో విప్లవ పార్టీని నిర్మించుకున్నారు. మరొకవైపు శ్రామికవర్గ ప్రజల విముక్తి కోసం, శాస్త్రీయమైన ‘మార్క్సిస్టు సిద్ధాంతం’ గైడ్ లైన్ గా తోడుగా ఉంది. ఇంతటి అనుకూలమైన పరిస్థితులు కళ్ళ ముందు ఉన్నా కూడా, ఈ దేశంలో కమ్యూనిస్టు విప్లవోద్యమం ఎందుకు కనుమరుగై పోయింది? ఇందులో ప్రధానంగా నాయకత్వాల వైఫల్యాలు ఏమిటి? వంటి మొత్తం ఈ పరిస్థితి పైన, మీరు ఎప్పుడైనా సమీక్ష చేసుకున్నారా? స్వయం విమర్శ చేసుకున్నారా? ఒకవేళ చేసుకుంటే, ఆ కార్యాచరణ బహిర్గతం అవ్వాలి కదా? కనీసం ఉద్యమ సహచరులంతా ఎవరెవరు ఎక్కడ ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నాలు చేసారా?
2. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విఫలమైన తరువాత కూడా, దాన్ని సమీక్షించుకోకుండా, అందులో నుండి గుణపాఠాలు నేర్చుకోకుండా.. మళ్లీ సాయుధ పోరాట మార్గాలు ఎన్నుకోవడం నాయకత్వం చేసిన అతి పెద్ద తప్పిదమనీ.. ఈ దేశంలో శ్రామిక వర్గ ప్రజల జీవన వికాసం కోసం, వారిని సామాజిక రాజకీయ చైతన్యంతో ఎదిగించుకోవడం కోసం.. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక పోరాటాలే శరణ్యమని, ఇప్పటికైనా గ్రహించారా? సాయుధ పోరాటం వల్ల నిర్బంధాలు నిషేధాలు పెరిగి, ఇంతకాలం ప్రజలకు దూరమయ్యాము. ఇప్పుడైనా ఒక ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక వేదికను నిర్మించాలి. మళ్లీ ప్రజలతో మమేకం అవ్వాలి. నమ్ముకున్న ప్రజలకు అండగా ఉండాలి అని, ఎందుకు ఆలోచించడం లేదు? ప్రజలంటే కేవలం, ఆదివాసులు మాత్రమే కాదు కదా? మనది త్యాగాల పార్టీ. అమరుల త్యాగాలు వృధా పోకూడదు. మనం నిరంతరం ప్రజల సమస్యల మీద ఉద్యమిస్తూ ప్రజలకు అండగా ఉన్నప్పుడే, ఆ త్యాగాలకు గౌరవం ఉంటుందనీ, మీరు ఎందుకు భావించడం లేదు! మనది వర్గ సమాజం అని, శాస్త్రీయంగా మనం భావిస్తున్నప్పుడు.. మీరు ఇప్పుడు సైలెంట్ గా ఉండడం అంటే, ఆ వర్గాలు రద్దయి, అసమానతలు పోయి సమానత్వం వచ్చిందా?
3. కగార్ ఆపరేషన్ లోనూ, అంతకు ముందుగానూ.. జైల్లో ఉన్న మావోయిస్టు పార్టీ సభ్యుల విడుదల గురించి; మావోయిస్టు పార్టీ సానుభూతిపరుల పేరుతో, అక్రమ కేసుల్లో విచారణకు కూడా నోచుకోకుండా, ఏళ్ల తరబడి జైల్లో మగ్గిపోతున్న వాళ్ళ విడుదల గురించి; ప్రజా సంఘాల కార్యకర్తలపై మోపబడిన అక్రమ కేసుల విచారణ గురించి – వారి విడుదల గురించి.. ఇప్పటివరకు మీరు, ఈ అంశం గురించి సీరియస్ గా ఎందుకు ఆలోచించడం లేదు! ప్రభుత్వాలతో ఎందుకు చర్చలు జరపడం లేదు? మీ సొంత బిడ్డలు కనబడకుండా తప్పిపోయినా, లేదా జైల్లో ఉన్నా, మీరు ఇట్లాగే వ్యవహరిస్తారా? నమ్ముకున్న ప్రజలను, ఉద్యమ సానుభూతిపరులను విస్మరించడం వర్గదృక్పథం అవుతుందా?
కామ్రేడ్ దేవ్ జీ, ముఖ్యంగా తల్లికి దూరమైన ఆ పసివాడ్ని చూడండి. ఐదు సంవత్సరాల పాటు కన్నతల్లి ప్రేమకు దూరంగా, ఆ పసిబిడ్డ ఈ నరకయాతన పడాల్సిందేనా? ఏమిటీ ఘోరం? ఆ పసివాడికి ప్రశ్నించే వయసే ఉంటే, పార్టీ నాయకత్వాన్ని – భారత ప్రభుత్వాన్ని ఈ విధంగా అడుగుతాడు..
“నాకు మా అమ్మ కావాలి! Where is my mother? మావోయిస్టు పార్టీ నిర్మాణంలో లేని మా అమ్మను, మావోయిస్టు అని మీరు ఎట్లా అంటారు? ఆమెపై కేసు ఎట్లా పెడతారు? ఆమెకు జైలుశిక్ష ఎట్లా వేస్తారు? ఇది ప్రజాస్వామిక దేశమేనా? పార్టీ నేతలు ఏం చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు బలి పశువులను చేసారు? నాకు మా అమ్మ కావాలి?” అని అడుగుతాడు. ఇలాంటి సంఘటనలప్పుడైనా కళ్ళు తెరవండి, స్పందించండి! జైల్లో మగ్గిపోతున్న ఉద్యమకారుల విడుదలకు, ఉద్యమ సానుభూతిపరుల విడుదలకు, కేంద్ర కమిటీ మాజీ నాయకులంతా ఐక్యమై, ప్రజలతో కలిసి ఉద్యమించాలి!
ముగింపు :
మూడు దశాబ్దాల కాలం సిపిఐ (మావోయిస్టు) పార్టీలో పనిచేసి, తెలంగాణ రాష్ట్ర మాజీ డిజిపి శివధర్ రెడ్డి గారి సమక్షంలో చట్టబద్దమైన జీవితంలోకి వచ్చి, అత్యంత బాధ్యతాయుతంగా జీవిస్తున్న ‘మాజీ మావోయిస్టు’ నైన నేను.. ప్రస్తుత పరిస్థితి’ గురించి, భారత ప్రభుత్వానికి, ఎన్ఐఏ అధికారులకు ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను!
మావోయిస్టు పార్టీలో పని చేసిన వాళ్లంతా, వాళ్ళ పట్ల సానుభూతి ఉన్నవాళ్లంతా, ఈ దేశ పౌరులే. ఇప్పటికీ ప్రజల ఆదరణ ఉన్నవాళ్లే. వాళ్ళంతా మీకు శత్రువులు కారు! మీరంతా ఆయుధాలు వదిలి చట్టబద్ధమైన జీవితంలోకి రండి! రాజ్యాంగ పరిధిలోనే, ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేయండి అని, భారత ప్రభుత్వం పిలుపిస్తే.. కొంత ఆలస్యంగానైనా సరే, అందరూ అడవి బాట వీడి, ప్రభుత్వం దగ్గరికి వచ్చి లొంగిపోయారు! వ్యక్తులుగానే కాదు, వందలాది మంది కామ్రేడ్స్, అధునాతన ఆయుధాలు పట్టుకుని వచ్చి, ప్రభుత్వం ముందు సరెండరయ్యారు! ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు విలువనిచ్చారు! మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్వహించాల్సిన పాత్ర, అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి. జైల్లో శిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల పట్ల, వారి సానుభూతిపరుల పట్ల మానవీయ దృక్పథంతో, వారిని జైలు జీవితం నుండి విముక్తి చేయాలి. కానీ అట్లా చేయడం లేదు. ప్రభుత్వం మావోయిస్టుల విషయంలో మాట తప్పిందనీ, పూర్తిగా కక్ష సాధింపు దిశగా వెళ్తోందనీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే, స్పష్టంగా అర్థం అవుతుంది. సిఎంఎస్ కార్యకర్తలైన దేవేంద్ర, శిల్ప, స్వప్న లకు ఎన్ఐఏ కోర్టు ఐదు సంవత్సరాల పాటు శిక్ష విధించడం, అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడున్నది ‘మావోయిస్టు రహిత భారతదేశం’ అనీ, భారత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, ఈ మహిళా సంఘం కార్యకర్తలకు ఐదు సంవత్సరాల జైలుశిక్ష వేయడం, కక్ష సాధింపు కాక మరేమిటి? ఈ ముగ్గురి మీద వచ్చిన ప్రధాన ఆరోపణ.. రాధ మిస్సింగ్ కేసు, మరియు మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కదా! ఇప్పుడు ఆ రాధ లేదు, మావోయిస్టు పార్టీ కూడా లేదు! అలాంటప్పుడు ఆ భావజాల వ్యాప్తి పేరుమీద, ఈ ముగ్గురికీ ఐదు సంవత్సరాల శిక్ష వేయడం ఎంత అన్యాయం? ఇది నూటికి నూరు శాతం కక్షసాధింపు ధోరణి కాదా? ఇలాంటి చర్యల వల్ల లొంగిపోయిన మాజీ మావోయిస్టుల్లో.. ఒక అలజడిని, భయాన్ని, అభద్రతా భావాన్ని కలుగజేయడం కాదా? ఆలోచించండి..
ఓట్ల కోసం కోట్ల రూపాయలు కుమ్మరించి, పదవులు పొంది, అందిన కాడికి దోచుకుని, ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్న రాజకీయ నాయకుల పాలనలో.. ఆ ప్రజల వైపు నిలబడి, వారి హక్కుల కోసం పోరాడుతున్నది ఎవరు? ఆనాటి నుండి ఈనాటి వరకు వామపక్ష కమ్యూనిస్టులు, విప్లవకారులే అన్నది జగమెరిగిన సత్యం! ఒక్క మాటలో చెప్పాలంటే, దేశంలో రాజ్యాంగబద్ధమైన పాలన జరుగనప్పుడు, అప్పుడప్పుడు రాజ్యాంగేతర ఉద్యమాలు కూడా పుడుతూ ఉంటాయి. కనుమరుగవుతూ ఉంటాయి. ఇప్పుడు మావోయిస్టు పార్టీ కొనసాగించిన సాయుధ పోరాటం అంటే, అది గత చరిత్రే అవుతుంది తప్పా, వర్తమానం కాదు! ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక ఉద్యమాల ద్వారానే, ప్రజలను చైతన్యవంతం చేయాలి తప్పా, సాయుధ పోరాటాలకు ఈ దేశంలో ఇక తావు లేదు అనీ, మనకు గత వర్తమాన చరిత్ర తెలియజేస్తుంది. కాబట్టి, మాజీ మావోయిస్టుల పట్ల కక్ష సాధింపు ధోరణి కాకుండా, వారిని మానవీయ కోణంలో చూడాలని మనవి చేస్తున్నాను.
ఇక చివరిగా ప్రభుత్వానికి మరోసారి చేస్తున్న నా విజ్ఞప్తి.. పై ఫోటోలో ఉన్న ఆ పసివాడు, నా మనవడు. ఆ పసివాడి తల్లి స్వప్న, నా కూతురు (అన్న కూతురు). ప్రతిరోజు ఆ పసివాడు రాత్రి పూట నిద్రపోకుండా తల్లి కోసం ఏడుస్తూ ఉన్నాడు. అమ్మ కావాలి అంటున్నాడు. అటు జైల్లో ఉన్న మా కూతురు కూడా, కొడుకు కోసం దుఃఖిస్తూ ఉంది! మానసిక వేదనతో కుమిలిపోతోంది! దయచేసి ప్రభుత్వ నేతలు, పెద్ద మనసుతో ఆలోచించండి. నా మనవడికి తల్లి ప్రేమను దూరం చేయకండి! మా కూతురు మీద ఉన్న కేసు కొట్టేసి, జైలు నుండి విడుదల చేయండి! అట్లాగే నా కూతురితో పాటు, ఉద్యమ సహచరులందరికీ కూడా, జైలు జీవితం నుండి విముక్తులను చేయండి! ప్రభుత్వాన్ని నమ్మి వచ్చిన మాజీ మావోయిస్టుల పట్ల, మానవీయ ప్రేమను చూపండి!
(‘రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక’ ఆధ్వర్యంలో, తేది. 29.08.2026 న
ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ..)
– ముద్దగౌని సుభాష్ (రవి)
సామాజిక ఉద్యమ రచయిత
ఫోన్: 9000904284
తేది: 29.08.2026

