- ఆత్మకూరు మండలంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పర్యటన
- సేంద్రియ ఎరువు తయారీ, అంగన్వాడీ కేంద్రం పరిశీలన
జన నిర్ణయం / ఆత్మకూరు :
Every village should be green and clean : ప్రతి గ్రామం పచ్చదనం, పరిశుభ్రతతో ఆదర్శంగా నిలవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. గురువారం ఆమె ఆత్మకూరు మండలంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా కొత్తగట్టు గ్రామంలో సెగ్రీగేషన్ షెడ్ ద్వారా చేపడుతున్న సేంద్రియ ఎరువు తయారీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు ఎంతమేర ఎరువు తయారైందో, దానిని విక్రయించారా లేదా, విక్రయాల ద్వారా ఎంత ఆదాయం సమకూరిందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు వాటిని ఆదాయ వనరులుగా మార్చుకునే విధానాలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అక్కడ పిల్లలకు అందుతున్న సేవలు, వంట తయారీ విధానం తదితర అంశాలను పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని, కేంద్రాల నిర్వహణలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
