- దళిత జర్నలిస్టు పుల్ల రవితేజపై దాడికి ఖండన
- బాధితుల గొంతును వినిపించినందుకు దాడి జరిగితే.. అది ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతమే…
Do they attack if a news story is covered..? : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలో దళిత జర్నలిస్టు పుల్ల రవితేజపై జరిగిన దాడి కలచివేసే ఘటన. ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా దీనిని పరిమితం చేయడం సరైంది కాదు. ప్రజల సమస్యలను కవర్ చేస్తున్న ఒక జర్నలిస్టుపై దాడి చేయడం అంటే.. ఆ సమస్యను సమాజం ముందుకు తీసుకువచ్చిన ప్రశ్నించే గొంతుపై దాడి చేయడమే.
భూ సమస్యలో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు ధర్నా, నిరసన దీక్ష చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని ఓ న్యూస్ ఛానల్ లో రవితేజ తన వృత్తి ధర్మంలో భాగంగా కవర్ చేశారు. బాధితుల ఆవేదనను వార్తగా ప్రజల ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ నిరసన తెలుపుతున్న బాధితులది న్యాయబద్దమా కాదా అనేది కాసేపు పక్కనపెడితే రొడ్డెక్కిన బాధితుల ఘటన కార్యక్రమాన్ని న్యూస్ కవర్ చేయటం వృత్తి ధర్మం. కానీ ఇది గిట్టనివారు కొందరు మూకలు ఆ తర్వాత రాత్రి సమయంలో ఆయన ఇంటికి వెళ్లి భౌతికదాడికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.
వార్తను కవర్ చేయడం విలేఖరి బాధ్యత. వార్త నచ్చకపోతే సమాధానం ఇవ్వడం సంబంధిత వ్యక్తుల హక్కు. కానీ జర్నలిస్టుపై చేయి చేసుకోవడం ఎవరికీ హక్కు కాదు. రవితేజ ఒక్కడు కాదు.. అతని వెనుక ఒక వృత్తి ఉంది. రవితేజపై దాడిని ఖండించడం అంటే ఒక వ్యక్తికి మాత్రమే మద్దతు ఇవ్వడం కాదు. ప్రజల సమస్యలను రాసే ప్రతి చిన్న జర్నలిస్టుకు అండగా నిలవడం. జిల్లా కేంద్రాల్లో పెద్ద సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకే కాదు.. మండల స్థాయిలో, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న రిపోర్టర్లకు కూడా జర్నలిజం స్వేచ్ఛ, భద్రత సమానంగా ఉండాలి. గ్రామంలో రైతు సమస్య వచ్చినా, భూ వివాదం వచ్చినా, పేదవాడి సమస్య వచ్చినా, ప్రభుత్వ కార్యాలయంలో అన్యాయం జరిగినా.. ముందుగా అక్కడికి వెళ్లేది స్థానిక విలేఖరే. వారి కళ్లతో చూసినదాన్ని, ప్రజల మాటలను, బాధితుల ఆవేదనను సమాజం ముందుకు తీసుకెళ్లేది వారే. అలాంటి రిపోర్టర్‌పై దాడి జరిగితే.. రేపు మరో విలేఖరి బాధితుడి సమస్యను కవర్ చేయడానికి వెనుకడుగు వేసే పరిస్థితి వస్తుంది. దళిత జర్నలిస్టు కావడం వల్ల ఈ ఘటనకు మరో కోణం ఉందనేది గమనించక తప్పదు. రవితేజ ఒక దళిత జర్నలిస్టు. ఈ గుర్తింపును పక్కన పెట్టి ఘటనను చూడటం కూడా పూర్తి చిత్రాన్ని చూడకపోవడమే అవుతుంది. సామాజికంగా అణగారిన వర్గాల నుంచి వచ్చిన యువకుడు జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకుని, తన చుట్టూ ఉన్న ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం చిన్న విషయం కాదు. అలాంటి వ్యక్తి తన సొంత మండలంలోనే దాడికి గురయ్యాడనే ఆరోపణలు రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దళితుడిగా పుట్టడం నేరం కాదు. దళితుడిగా జర్నలిస్టుగా నిలబడటం తప్పు కాదు. ప్రశ్నించడం నేరం కాదు. బాధితుడి తరఫున వార్త రాయడం నేరం కాదు. అందుకే ఈ ఘటనలో సామాజిక కోణాన్ని కూడా పోలీసులు, అధికారులు పరిగణనలోకి తీసుకుని విచారణ జరపాల్సిన అవసరం ఉంది.
ఒక విలేఖరి కలం మీద దాడి చేయవచ్చు. అతని శరీరాన్ని గాయపరచవచ్చు. భయపెట్టడానికి ప్రయత్నించవచ్చు. కానీ ప్రజల సమస్యను అంతమొందించలేరు. రవితేజ కవర్ చేసిన భూ సమస్యపై బాధితులు ఎందుకు ధర్నా చేశారు..? వారి సమస్య ఏమిటి..? వారికి న్యాయం జరిగిందా..? జరగలేదా..? అనే అసలు ప్రశ్నలు ఇంకా అక్కడే ఉన్నాయి. ఒక వార్తను కవర్ చేసిన విలేఖరిపై దాడి జరిగిందనే ఆరోపణలతో ఆ అసలు సమస్య మరుగునపడకూడదు.
నిరసనలకు అర్థం ఉంది.. కానీ న్యాయం మరింత అవసరం.
రవితేజ ఘటనపై చిట్యాల నుంచి భూపాలపల్లి వరకు జర్నలిస్టులు, ప్రజాసంఘాలు స్పందించడం స్వాగతించాల్సిన విషయం. ఒక జర్నలిస్టుపై దాడి జరిగినప్పుడు తోటి జర్నలిస్టులు మౌనంగా ఉంటే అది ప్రమాదకరమైన సంకేతం. అలాగే దళిత సంఘాలు, మేధావులు, యువత, ప్రజాస్వామిక వర్గాలు కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలి. అయితే నిరసనలతో పాటు చట్టపరమైన న్యాయం కూడా జరగాలి. దాడికి సంబంధించి వాస్తవాలను నిష్పక్షపాతంగా వెలికితీయాలి. ఆధారాల ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాధిత జర్నలిస్టుకు భద్రత కల్పించాలి. ఇది రవితేజకు మాత్రమే సంబంధించిన పోరాటం కాదు, ఈరోజు రవితేజ. రేపు మరొకరు కావచ్చు. ఈరోజు ఒక భూ సమస్యను కవర్ చేసినందుకు, రేపు మరో ప్రజా సమస్యను రిపోర్ట్ చేసినందుకు కావచ్చు.
జర్నలిస్టులు ప్రశ్నించడానికి భయపడే వాతావరణం ఏర్పడకూడదు. ముఖ్యంగా గ్రామీణ, మండల స్థాయిలో పనిచేసే జర్నలిస్టులు తమ వృత్తి నిర్వహణలో భద్రతగా ఉన్నామనే నమ్మకంతో పనిచేయగలగాలి. ప్రజల సమస్యను రాసే జర్నలిస్టు పక్షాన నిలబడటం అంటే ప్రజాస్వామ్యం పక్షాన నిలబడటమే.
అందుకే పుల్ల రవితేజపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. రవితేజకు న్యాయం జరిగే వరకు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలి. బాధ్యులు ఎవరైనా చట్టం ముందు నిలబడక తప్పదని రుజువు చేయాలి. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అధికారం బలం, రాజకీయపలుకుబడి ఉన్నా సరే చట్టం ముందు అందరూ సమనమే అని పోలీసులు తమ విచారణను కొనసాగించాలి. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలి. ప్రజలు, ప్రజాసంఘాలు, దళిత సంఘాలు, జర్నలిస్ట్ యూనియన్లు ఇలాంటి ఘటనలను ఖండించాలి. దాడులకు, దౌర్జన్యాలకు, బెదిరింపులకు, వివక్షతకు గురయ్యే రిపోర్టర్లకు మద్దతుగా నిలువాల్సిన అవసరం ఉంది.
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ పెఢరేషన్
(TWJF )హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు
rajenderdamera@gmail.com
