- లెంకలపల్లె పంచాయతీలో సర్పంచ్ భర్త అధికారిక హోదాపై ఆరోపణలు..
- తీర్మానం లేకుండా రోడ్లకు మట్టి.. చినుకు పడితే ఆ రోడ్లన్నీ బురదమయమే..!
- వాటర్ ప్లాంట్ ఖాతాలో పేరు.. సీసీ కెమెరాలకు కనెక్షన్లు కరువు…
- ఆగస్టు 15న జాతీయ జెండాను సైతం సర్పంచ్ భర్తనే అధికారికంగా ఎగరవేసిన వైనం…
- సర్పంచ్ భర్త అనధికారిక హోదాపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్
The Sarpanch post is hers… but is he the one calling the shots..? నల్లబెల్లి మండలం లెంకలపెల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ భర్త అధికారిక కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. మహిళా సర్పంచ్ ఉన్నప్పటికీ ఆమె భర్త పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని ఏడు రోడ్లకు ఎలాంటి గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే మట్టి పోశారని, ఆ మట్టి సక్రమంగా చదును చేయకపోవడం, సరైన మట్టి పోయకపోవటంతో చినుకు పడితే రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు.
ఇక ఓ దాత విరాళంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ఆదాయానికి సంబంధించిన పోస్టాఫీస్ ఖాతాలో సర్పంచ్ భర్త, ఉపసర్పంచ్ పేర్లు ఉండటంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సర్పంచ్ భర్త పేరు ఖాతాలో ఎలా వచ్చిందనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు కనెక్షన్లు ఇవ్వకపోవడంతో అవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేకపోతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రజా భద్రతకు సంబంధించిన కెమెరాలకు కనెక్షన్లు ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా ఆగస్టు 15న జాతీయ జెండాను సర్పంచ్ భర్తే అధికారికంగా ఎగురవేయటం కూడా చర్చానీయాంశంగా మారుతోంది. దీంతో సర్పంచ్ భర్తకు పంచాయతీలో ఏమైనా అధికారిక హోదా ఉందా..? ఉంటే దానికి సంబంధించిన ఉత్తర్వులు ఏమిటి..? అనే అంశాలపై విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
రోడ్లకు మట్టి, వాటర్ ప్లాంట్ ఖాతా, సీసీ కెమెరాలు, అధికారిక కార్యక్రమాల్లో సర్పంచ్ భర్త పాత్ర తదితర అంశాలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని వారు కోరుతున్నారు.
