If questioning is a crime… why have democracy..? ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకోసారి ఓటు వేయడం మాత్రమే కాదు. పాలకులను ప్రశ్నించడం, తప్పులను ఎత్తిచూపడం, తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలపడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. ప్రజలు ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన తమ హక్కులను వదులుకున్నట్లు కాదు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నదే ప్రజాస్వామ్య స్ఫూర్తి.
భారత రాజ్యాంగం పౌరులకు భావప్రకటనా స్వేచ్ఛను, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కల్పించింది. ఈ హక్కులు అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడినవి కావు. అయితే ఈ స్వేచ్ఛకు చట్టబద్ధమైన పరిమితులున్నాయి. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా, హింసకు తావులేకుండా నిరసన తెలపడం పౌరుల బాధ్యత. అదే సమయంలో ఆ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. కానీ ప్రజలు తమ సమస్యలపై గొంతెత్తినప్పుడల్లా శాంతిభద్రతల సమస్యగా చూడటం సరైన పాలనా విధానం కాదు. నిరసన వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవాలి. డిమాండ్లపై చర్చించాలి. అభ్యంతరాలుంటే వాస్తవాలతో సమాధానం చెప్పాలి. సమస్యను పరిష్కరించకుండా గొంతును అణచివేస్తే అసంతృప్తి తగ్గదు.. మరింత పెరుగుతుంది.
ప్రజల భద్రత కోసం ఆంక్షలు అవసరమయ్యే సందర్భాలు ఉండవచ్చు. కానీ వాటి పేరుతో పౌరుల స్వేచ్ఛను ఇష్టానుసారంగా కట్టడి చేయకూడదు. నిరసనకు అనుమతి నిరాకరించినా, ఎవరినైనా అదుపులోకి తీసుకున్నా చట్టబద్ధమైన కారణాలు ఉండాలి. శాంతియుతంగా నిరసన తెలిపేవారిని, హింసకు పాల్పడేవారిని ఒకే గాటన కట్టకూడదు. చట్టాన్ని అమలు చేసే అధికారుల చర్యలు కూడా జవాబుదారీతనానికి లోబడి ఉండాలి. ప్రభుత్వాన్ని విమర్శించడం దేశాన్ని వ్యతిరేకించడం కాదు. పాలకుల నిర్ణయాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యానికి ముప్పు కాదు. విమర్శలను సహించలేని పాలనలోనే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుంది. ప్రజల అసమ్మతిని వినడం పాలకుల బలహీనత కాదు, ప్రజాస్వామ్యంపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. ప్రజలు ప్రశ్నించకుండా ఉండటమే శాంతి కాదు. తమ సమస్యలను నిర్భయంగా చెప్పగలగడమే నిజమైన ప్రజాస్వామ్యానికి గుర్తు. అధికారం శాశ్వతం కాదు. కానీ ప్రజల హక్కులు ప్రభుత్వాల మార్పుతో మారకూడదు. నిరసనకారుల ప్రతి డిమాండ్‌ను అంగీకరించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేకపోవచ్చు. అయితే వారి మాట వినాల్సిన బాధ్యత మాత్రం తప్పదు. ప్రజాస్వామ్యంలో అసలైన ప్రశ్న నిరసనలు ఎందుకు జరుగుతున్నాయన్నది మాత్రమే కాదు.. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునే పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయన్నది కూడా. ఆ ప్రశ్నకు సమాధానం వెతకకుండా నిరసనలను అడ్డుకోవడమే పరిష్కారంగా భావిస్తే, అది సమస్యను పక్కదారి పట్టించడమే. ప్రజల గొంతును మూయడం పాలనా పరిష్కారం కాదు. ఆ గొంతు ఎందుకు వినిపిస్తోందో తెలుసుకోవడమే ప్రజాస్వామ్య బాధ్యత.
– దారా
జర్నలిస్ట్
rajenderdamera@gmail.com
