A new party? A new front? A new alliance? : తెలంగాణ రాజకీయాల్లో వామపక్ష రాజకీయాల భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఒకవైపు ఇప్పటికే ఉన్న పార్లమెంటరీ వామపక్ష పార్టీలు ఐక్యత, సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు మాజీ మావోయిస్టులలో కొందరు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల బహిరంగ రాజకీయ జీవితంలోకి వచ్చిన కొందరు మాజీ మావోయిస్టు నేతలు మాత్రం ఆ ప్రతిపాదిత పార్టీతో తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తూ, వామపక్ష, ప్రజాస్వామిక, దళిత, ఆదివాసీ, బహుజన, మైనారిటీ శక్తులతో కలిసి ఐక్య ఫ్రంట్ నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు. ఈ మూడు పరిణామాలు వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ, ఒకే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. తెలంగాణలో వామపక్ష, ప్రజాతంత్ర రాజకీయాలకు కొత్త రాజకీయ సమీకరణ అవసరమా..? అవసరమైతే దాని రూపం ఎలా ఉండాలి..? అయితే సమాధానం కేవలం కొత్త పార్టీ వస్తుందా, కొత్త ఫ్రంట్ ఏర్పడుతుందా అన్నదానిలో లేదు. భిన్న వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు తమ సిద్ధాంత భేదాలను కొనసాగిస్తూనే ప్రజా సమస్యలపై కలిసి పనిచేయగలవా అన్నదే అసలు ప్రశ్న.
ఐక్యత గురించి మాట్లాడటం సులభం. ఆచరణలో నిలబెట్టడం అంత సులభం కాదు. సిద్ధాంత భేదాలతో పాటు చరిత్ర, గత రాజకీయ విభేదాలు, సంస్థాగత ప్రయోజనాలు, నాయకత్వంపై అనుమానాలు, రాజకీయ గుర్తింపులు కూడా అడ్డుగా నిలుస్తాయి. ఒక కార్యకర్తకు పార్టీ కేవలం ఒక కార్యాలయం లేదా జెండా కాదు. అతని పోరాటాలు, త్యాగాలు, విజయాలు, ఓటములు, జ్ఞాపకాలతో ముడిపడిన రాజకీయ జీవితం. అందుకే మరో సంస్థపై విమర్శను కొన్నిసార్లు సిద్ధాంతపరమైన విమర్శగా కాకుండా తన రాజకీయ జీవితంపైనే దాడిగా భావించే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడి నుంచే “వాళ్లు – మనం” అనే భావన బలపడుతుంది.
ఇక్కడే వామపక్ష రాజకీయాలకు ఆత్మపరిశీలన అవసరం. ఐక్యత కోసం ప్రతి పార్టీ తన చరిత్రను వదులుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సిద్ధాంత భేదాన్ని వెంటనే తొలగించాల్సిన అవసరం కూడా లేదు. కానీ భిన్నాభిప్రాయాలతో కలిసి పనిచేయగల రాజకీయ సంస్కృతిని నిర్మించాల్సిన అవసరం ఉంది. కె. బాలగోపాల్ ఆలోచన ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన మేధోపరమైన ప్రమాణాన్ని గుర్తు చేస్తుంది. ఒక ఉద్యమాన్ని దాని ప్రకటిత లక్ష్యాలతో మాత్రమే అంచనా వేయకూడదు. ఆ లక్ష్యాలను సాధించడానికి అనుసరించే పద్ధతులు, మానవ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, విమర్శ, రాజకీయ బాధ్యతలతో దాని సంబంధాన్ని కూడా పరిశీలించాలి. లక్ష్యం ఎంత గొప్పదో మాత్రమే కాదు.. దానికి వెళ్లే మార్గం కూడా అంతే ముఖ్యం. ఈ ప్రమాణాన్ని ఐక్యతకు అన్వయిస్తే, భిన్నాభిప్రాయాన్ని శత్రుత్వంగా చూసే చోట ఐక్యత నిలబడదు. విమర్శను అవిశ్వాసంగా భావించే చోట సమన్వయం పెరగదు. గత తప్పులపై చర్చించడాన్ని సంస్థపై దాడిగా భావించే చోట రాజకీయ పరిపక్వత ఏర్పడదు. అందువల్ల వామపక్ష ఐక్యతకు మొదటి అవసరం సంస్థల విలీనం కాదు, భిన్నత్వాన్ని ప్రజాస్వామికంగా నిర్వహించే రాజకీయ సంస్కృతి. ఇదే సమయంలో వామపక్ష రాజకీయాలు పనిచేయాల్సిన సమాజం కూడా మారిపోయింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, అసంఘటిత, గిగ్ పనులు వంటి కొత్త ఉపాధి రూపాలు పెరిగాయి. కులం, వర్గం, లింగం, సామాజిక గౌరవం, పర్యావరణం, ప్రజాస్వామిక హక్కుల ప్రశ్నలు పరస్పరం ముడిపడ్డాయి. యువత రాజకీయ అనుభవం కూడా గత తరాల కంటే భిన్నంగా ఉంది. ఈ కొత్త వాస్తవాన్ని పాత రాజకీయ భాషతోనే పూర్తిగా వివరించగలమా..? ఈ ప్రశ్నను మాత్రం తప్పించుకోలేం.
ఇటీవల మాజీ మావోయిస్టులలో కొందరు బహిరంగ రాజకీయ జీవితంలోకి రావడం ఈ చర్చకు మరో కోణాన్ని తెచ్చింది. దీన్ని కేవలం కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పరిణామంగా చూడటం సరిపోదు. అండర్‌గ్రౌండ్ రాజకీయాల నుంచి బహిరంగ ప్రజాస్వామిక రాజకీయాల వైపు వచ్చిన వారు తమ గత అనుభవాలను కొత్త రాజకీయ వాస్తవికతతో ఎలా అనుసంధానించుకుంటారన్నదీ ముఖ్యమైన ప్రశ్న. అయితే స్పష్టత అవసరం. బహిరంగ రాజకీయ జీవితంలోకి వచ్చిన మాజీ మావోయిస్టుల రాజకీయ ప్రయాణాన్ని, ఇంకా అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టు ఉద్యమాన్ని, పార్లమెంటరీ వామపక్ష రాజకీయాలను ఒకే రాజకీయ ప్రవాహంగా చూడటం సరైంది కాదు. వాటి రాజకీయ పద్ధతులు, సంస్థాగత నిర్మాణాలు, పరిస్థితులు వేర్వేరు. కానీ వీటన్నింటి మధ్య ముందుకొచ్చే పెద్ద ప్రశ్న మాత్రం ఒకటే వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు తమ మధ్య ఉన్న భేదాలను ఎలా నిర్వహించుకోగలవు..? దీనికి ఆచరణాత్మక మార్గం ఉంది. ముందుగా సంస్థల విలీనం కాకుండా ఉమ్మడి కార్యాచరణ మొదలవ్వాలి. కార్మికులు, రైతులు, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక హక్కులు, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రజా సమస్యలపై కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి కలిసి పనిచేయవచ్చు. ఆచరణలో ఏర్పడే అనుభవం పరస్పర అవగాహనను, విశ్వాసాన్ని పెంచుతుంది. ఆ తర్వాత అవసరమైతే సంస్థాగత ఐక్యత గురించి ఆలోచించవచ్చు. అంటే విలీనం మొదటి అడుగు కాకుండా చివరి ఫలితం కావాలి. అయితే ఇక్కడ మరో కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఎవరు నాయకత్వం వహిస్తారు..? ఎవరి ప్రాతినిధ్యం ఎంత..? నిర్ణయాలు ఎలా తీసుకుంటారు..? చిన్న సంస్థకు, పెద్ద సంస్థకు సమాన గౌరవం ఉంటుందా..? విమర్శించే హక్కు ఉంటుందా..? భిన్నాభిప్రాయానికి స్థానం ఉంటుందా..?
ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా ‘ఐక్యత’ ప్రకటిస్తే అది మరో సంస్థాగత ప్రయోగంగా మాత్రమే మిగిలిపోవచ్చు. అందుకే ఇప్పుడు ముందున్న ప్రశ్నలు కొత్త పార్టీనా..? కొత్త ఫ్రంటా..? కొత్త ఐక్యతా..? వీటన్నింటికంటే ముందు మరో ప్రశ్నను అడగాలి. కొత్త రాజకీయ సంస్కృతిని నిర్మించగలమా..? ప్రజా సమస్యలపై కలిసి నిలబడగలరా..?భిన్నాభిప్రాయాలతో కలిసి పనిచేయగలరా..? తమ సొంత తప్పులను కూడా విమర్శించుకోగలరా..? రాజకీయ ప్రత్యర్థిని మాత్రమే కాదు, తమ రాజకీయ పద్ధతులను కూడా ప్రశ్నించుకోగలరా..? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే కొత్త పార్టీ అయినా, కొత్త ఫ్రంట్ అయినా అర్థవంతమవుతుంది. లేకపోతే కొత్త పేరు వస్తుంది. కొత్త జెండా వస్తుంది. కొత్త వేదిక వస్తుంది. కానీ పాత విభజనల రాజకీయ సంస్కృతి మరో రూపంలో తిరిగి రావచ్చు.
కాబట్టి ఇప్పుడు వామపక్ష రాజకీయాలకు కావాల్సింది మరో పేరు కాదు. ప్రజల మధ్య కలిసి పనిచేసే కొత్త రాజకీయ సంస్కృతి. ఐక్యతను ముందుగా ప్రకటించటం కంటే ముందుగా ఆచరణలో నిర్మించాలి. కలిసి నడవాలి. కలిసి పనిచేయాలి. కలిసి నేర్చుకోవాలి. విమర్శలను స్వీకరించాలి. ఆ అనుభవం చెప్పిన రూపంలోనే తరువాత ఐక్యతను నిర్ణయించాలి. అప్పుడు ఐక్యత ఒక నినాదం కాదు. ప్రజల మధ్య పరీక్షించబడిన రాజకీయ అనుభవం అవుతుంది.
దారా
rajenderdamera@gmail.com
