Shadows of coal on the soil of ‘Ramappa’..! అభివృద్ధి పేరుతో ప్రకృతిని ఎంతకాలం బలిచేస్తాం..? తక్షణ ఆర్థిక ప్రయోజనాల కోసం తరతరాల జీవనాధారాలను ప్రమాదంలోకి నెట్టడం పురోగతి ఎలా అవుతుంది..? ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ప్రాంతంలో ఓపెన్‌కాస్ట్ బొగ్గు మైనింగ్ ప్రతిపాదనలపై వ్యక్తమవుతున్న ఆందోళనలు ఈ ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి. ఇది కేవలం బొగ్గు తవ్వకాల అంశం కాదు.. చరిత్రను, ప్రకృతిని, రైతుల భవిష్యత్తును కాపాడుకోవాలనే సమాజ బాధ్యతకు సంబంధించిన ప్రశ్న. రామప్ప దేవాలయం మన చారిత్రక వైభవానికి ప్రతీక. దాని పరిసరాల్లోని చెరువులు, పంట పొలాలు, జీవవైవిధ్యం స్థానిక ప్రజల జీవనానికి ఆధారం. ముఖ్యంగా రామప్ప చెరువు సాగునీటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుంటే, మైనింగ్ వల్ల భూగర్భ జలాలు, నీటి ప్రవాహాలు, వ్యవసాయ భూములపై పడే ప్రభావాలను నిర్లక్ష్యం చేయలేం. పర్యావరణ ప్రభావాలపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనం జరగాలి. దాని ఫలితాలను ప్రజలకు వెల్లడించాలి. నష్టాలు సంభవించే అవకాశాలను ముందుగానే అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
బొగ్గు ద్వారా ఆదాయం రావచ్చు. ఉపాధి అవకాశాలు ఏర్పడవచ్చు. కానీ ఆ ప్రయోజనాల కోసం రైతుల జీవనాధారాలు, నీటి వనరులు, ప్రకృతి సంపద ప్రమాదంలో పడితే ఆ నష్టానికి బాధ్యత ఎవరిది..? అభివృద్ధి ప్రయోజనాలు కొందరికి దక్కి, పర్యావరణ భారం స్థానిక ప్రజలపై పడే పరిస్థితి ఏర్పడకూడదు. ప్రకృతి విలువను కేవలం ఆర్థిక లెక్కల్లో కొలవలేం. ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్పను కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యత. అందుకోసమే మైనింగ్ ప్రతిపాదనలపై స్థానిక ప్రజలు, రైతులు, పర్యావరణ నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వర్తించే పర్యావరణ, వారసత్వ పరిరక్షణ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. తీవ్రమైన, నివారించలేని నష్టానికి ప్రమాదం ఉందని అధ్యయనాల్లో తేలితే, ప్రాజెక్టును నిలిపివేయడం లేదా ప్రత్యామ్నాయాలను పరిశీలించడం వంటి నిర్ణయాలకు ప్రభుత్వం వెనుకాడకూడదు. బొగ్గు వెలికితీతకంటే జీవనాధారాల పరిరక్షణ ముఖ్యం. రామప్పను కాపాడటం అంటే ఒక చారిత్రక కట్టడాన్ని మాత్రమే కాదు.. నీటిని, నేలను, రైతుల భవిష్యత్తును కాపాడటం. ప్రకృతిని బలిపీఠంపై ఎక్కించే అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు. రామప్ప విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఖనిజ సంపదకు ఎంత విలువ ఇస్తుందో మాత్రమే కాదు.. ప్రజల జీవనానికి, ప్రకృతికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో కూడా నిరూపించాలి..!
దారా
rajenderdamera@gmail.com
