Development of Dalit Christians only through constitutional protection భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల రక్షణతోనే దళిత క్రైస్తవుల సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రగతిశీల ఐక్యత కేంద్రం రాష్ట్ర కన్వీనర్ బొజ్జ బిక్షమయ్య ఉద్ఘాటించారు. మంగళవారం వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్లో, పాస్టర్లు, దళిత క్రైస్తవుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాస్టర్ మంద కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, నాయకులందరూ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి బొజ్జ బిక్షమయ్య ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Development of Dalit Christians only through constitutional protection
దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపాలంటే ఆధ్యాత్మిక బలంతో పాటు చట్టబద్ధమైన పోరాటం అవసరమని ఆయన పేర్కొన్నారు. “దళిత క్రైస్తవులు ఒక చేత్తో పవిత్ర బైబిల్ పట్టుకుని దైవ చింతన కలిగి ఉండాలి, అలాగే మరో చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని తమ హక్కుల కోసం పోరాడాలి” అని పిలుపునిచ్చారు. హిందూ మతంలో ఉన్నప్పుడు వర్తించే రిజర్వేషన్లు, క్రైస్తవంలోకి మారగానే రద్దు చేయడం దళిత క్రైస్తవుల పట్ల జరుగుతున్న రాజ్యాంగ విరుద్ధమైన వివక్ష అని ఆయన మండిపడ్డారు. పాస్టర్లు కేవలం ప్రార్థనా మందిరాలకే పరిమితం కాకుండా, సమాజంలో ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నా అక్కడకు వెళ్లి బాధితులకు అండగా నిలబడాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకోవడానికి అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని, ఐక్యతతోనే విజయం సాధ్యమని స్పష్టం చేశారు.
Development of Dalit Christians only through constitutional protection
ఈ కార్యక్రమంలో మిషన్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ రెవరెండ్ ప్రేమ్ జిత్ కుమార్, దేవతి శ్రీనివాస్, మట్టి ప్రసాద్, జగదీశ్, పాస్టర్ ఐక్య వేదిక అధ్యక్షులు ఇసంపెల్లి అబ్రహం పాల్గొన్నారు. అలాగే క్రిస్టియన్ సొసైటీ నాయకులు గంధం అరుణ్ జేమ్స్, నలగంటి విల్సన్, దళిత క్రైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్ల కుమార్ మాదిగ, డాక్టర్ సింగరాపు సునీల్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఇంతియాజ్, అంబేద్కర్ వాది కొమ్ము కుమార్, బుర్రి సాగర్ తదితరులు పాల్గొని అంబేడ్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటామని ప్రతినబూనారు.
