పరకాలలో నాణ్యత లేని డ్రైనేజీల నిర్మాణం..!?
Quality is ‘air’.. ‘festival’ for the contractor..!? పరకాల పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో చేపట్టిన డ్రైనేజీ సైడ్ కాలువల నిర్మాణం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి చేపడుతున్న ఈ పనులు నాణ్యతకు తిలోదకాలిస్తున్నాయని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి.. నిర్మాణం జరుగుతున్న తరుణంలోనే కాలువలు బీటలు వారుతుండటం పనుల తీరుకు అద్దం పడుతోంది.
Quality is ‘air’.. ‘festival’ for the contractor..!?
నాణ్యత ‘గాలి’కి.. కాంట్రాక్టర్ కు ‘పండుగ’..!
పట్టణంలోని పలు వీధుల్లో చేపడుతున్న ఈ సైడ్ కాలువల నిర్మాణంలో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిమెంట్, ఇసుక, కంకర వాడకంలో ఉండాల్సిన సరైన నిష్పత్తిని పాటించడం లేదని, నాసిరకం ఇసుకను వాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పనులు జరుగుతున్న సమయంలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి నాణ్యతను పరిశీలించాల్సి ఉండగా, వారు కార్యాలయాలకే పరిమితమవ్వడం కాంట్రాక్టర్లకు వరంగా మారింది. నిర్మాణం పూర్తికాకముందే చాలా చోట్ల కాలువ గోడలు పగుళ్లు ఇస్తుండటం నిర్మాణ లోపానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
Quality is ‘air’.. ‘festival’ for the contractor..!?
నిరాశలో జనం
ముఖ్యంగా పట్టణంలో కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు తమ వార్డుల్లో జరుగుతున్న పనులపై కనీసం దృష్టి సారించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర నిరుత్సాహం వ్యక్తమవుతోంది. ఓట్ల కోసం అభ్యర్థించినప్పుడు ‘అభివృద్ధి చేస్తాం’ అని హామీలు ఇచ్చిన నాయకులు, ఇప్పుడు కళ్ల ముందే నాసిరకం పనులు జరుగుతున్నా నోరు మెదపకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Quality is ‘air’.. ‘festival’ for the contractor..!?
”కోట్ల రూపాయల నిధులు మంజూరైనప్పుడు అవి ప్రజల సౌకర్యార్థం సక్రమంగా వినియోగపడాలి. కానీ ఇక్కడ కాంట్రాక్టర్ల లాభమే పరమావధిగా పనులు సాగుతున్నాయి. అడిగే నాథుడే లేకపోవడం దురదృష్టకరం.”

– ఏకు రఘుపతి BRS 18వ డివిజన్ అధ్యక్షులు
Quality is ‘air’.. ‘festival’ for the contractor..!?
అధికారులు స్పందించాలి
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరకాలలో జరుగుతున్న డ్రైనేజీ పనులపై విచారణ జరిపించాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యత లేని పనులను అడ్డుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ప్రజాధనం వృధా అవ్వడమే కాకుండా, వర్షాకాలంలో ఈ కాలువలు కూలిపోయి మురుగు సమస్య మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు.
