- వ్యూహం అత్తది.. వేగం కోడలిది
- నియోజకవర్గంలో నవశకం..!
Palakurti’s ‘Shakti’ duo రాజకీయ క్షేత్రంలో కొన్ని గెలుపులు కేవలం అధికార మార్పిడికే పరిమితం అవుతాయి. కానీ కొన్ని గెలుపులు ఒక సామాజిక చైతన్యాన్ని, పాత వ్యవస్థల పతనాన్ని శాసిస్తాయి. పాలకుర్తి గడ్డపై ఇప్పుడు జరుగుతున్నది సరిగ్గా ఇదే. దశాబ్దాల కాలంగా పాతుకుపోయిన పాత రాజకీయ శిఖరాలను పడగొట్టి, సరికొత్త ‘రాజకీయ సంస్కృతిని’ పరిచయం చేసిన ఘనత అత్తాకోడళ్లైన హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డిలదే. ఒకరకంగా పాలకుర్తి నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రంపై హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, ఆమె కోడలు మామిడాల యశస్విని రెడ్డి ఒక నూతన శకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాజకీయాల్లో అత్తాకోడళ్లు ఇలా ఒకే లక్ష్యం కోసం కలిసి పోరాడి, అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేయడం ఒక అరుదైన ఘట్టం.
Palakurti’s ‘Shakti’ duo
ఈ అత్తాకోడళ్ల ప్రస్థానం ఒక ఆసక్తికరమైన మలుపు. అమెరికాలో స్థిరపడి, ఎంతో వైభోగంగా గడిపే అవకాశం ఉన్నా.. ‘కన్నగడ్డ కష్టాల్లో ఉంది’ అన్న పిలుపు ఝాన్సీ రెడ్డిని పాలకుర్తి వైపు నడిపించింది. నిశ్శబ్ద విప్లవకర్తగా ఝాన్సీ రెడ్డి పాలకుర్తి గడ్డపై అడుగు పెట్టింది. ఆమె నేరుగా రాజకీయాల్లోకి దూకలేదు. ‘హనుమాండ్ల ఫౌండేషన్’ పేరుతో ఒక నిశ్శబ్ద సేవాయజ్ఞాన్ని మొదలుపెట్టారు. గత కొన్నేండ్లుగా ఆమె వేసిన సేవా పునాదులే నేడు కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో రక్షణ కవచంగా మారాయి. సాంకేతిక కారణాల వల్ల ఆమె పోటీకి దూరమైనా, తన ప్రతిరూపంగా కోడలు యశస్విని రెడ్డిని రంగంలోకి దించి.. అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశారు. యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం వెనుక ఝాన్సీ రెడ్డి దశాబ్ద కాలపు సేవా నిబద్ధత, పట్టుదల దాగి ఉన్నాయి.
Palakurti’s ‘Shakti’ duo
రాజకీయాల్లో వ్యూహం ప్రాణవాయువు వంటిది. ఝాన్సీ రెడ్డి ఆలోచనలు పక్కాగా ఉన్నాయి. ఒకప్పుడు పాలకుర్తిలో ఒక రకమైన రాజకీయ భయం ఉండేది. ఆ భయాన్ని తొలగించి, సామాన్యుడికి ‘మేమున్నామన్న’ భరోసా ఇవ్వడంలో ఝాన్సీ రెడ్డి సఫలీకృతమయ్యారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమాయత్తం చేయడంలో ఆమె ఒక సీనియర్ వ్యూహకర్తలా వ్యవహరించారు. ఎన్నికల రణక్షేత్రంలో ఆమె గీసిన గీత దాటి ప్రత్యర్థులు లోపలికి రాలేకపోయారు.
Palakurti’s ‘Shakti’ duo
ఇక తన కోడలు యశస్విని రెడ్డి శాసనసభ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పాలకుర్తిలో ఒక కొత్త వేగం కనిపిస్తోందని ఆ ప్రాంత ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. అసెంబ్లీలో తడబడకుండా ప్రజా సమస్యలను వినిపించడం ఆమె పరిణతికి నిదర్శనం.
యశస్విని రెడ్డి తన చదువు, ఆధునిక ఆలోచనలు, చిరునవ్వుతో ప్రజలను ఆకట్టుకున్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రజల మనిషిగా గుర్తింపు పొందుతున్నారు.
ఏసీ గదులకే పరిమితం కాకుండా, ఎండనక వాననక పల్లె పల్లెను చుడుతూ ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుంటున్న ఆమె శైలి ప్రజలను అమితంగా ఆకట్టుకుంటోంది. అత్త అనుభవం.. కోడలి ఉత్సాహం.. వెరసి పాలకుర్తికి ఒక ‘డబుల్ ఇంజిన్’ శక్తి లభించింది. పురుషాధిక్య రాజకీయం రాజ్యమేలే చోట, ఇద్దరు మహిళలు సమన్వయంతో ఒక నియోజకవర్గాన్ని నడిపించటం తెలంగాణ రాజకీయాల్లోనే ఒక గొప్ప మలుపుగా చెప్పక తప్పదని రాజకీయ విశ్లేషణ. ఇచ్చిన మాట ప్రకారం ఇద్దరూ కలిసి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతుండటం వల్ల ప్రజల్లో వీరి పట్ల నమ్మకం రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రజా గొంతుకను వినిపిస్తుంటే, ఝాన్సీ రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారు.
రాజకీయాల్లో వారసత్వం ఉంటుంది కానీ, ఇలా అత్తాకోడళ్లు పరస్పరం సహకరించుకుంటూ ప్రజా సేవలో పోటీ పడటం అరుదు. ఇలాంటి అరుదైన ఘట్టం పాలకుర్తిలో ప్రతిబింబిస్తున్నది.
Palakurti’s ‘Shakti’ duo
పాలకుర్తి అంటే ఇప్పుడు కేవలం ఒక నియోజకవర్గం కాదు.. అది ఒక మార్పుకు చిరునామా. ఝాన్సీ రెడ్డి మార్గదర్శకత్వంలో యశస్విని రెడ్డి దూసుకుపోతుంటే, పాలకుర్తి ప్రజలు తమ భవిష్యత్తుపై ధీమాగా ఉన్నారు. కోటలు కూలిపోయాయి.. అహకారాలు మట్టిలో కలిసిపోయాయి.. ఇప్పుడు వినిపిస్తున్నది కేవలం అభివృద్ధి నినాదం మాత్రమే. ఈ అత్తాకోడళ్ల ద్వయం పాలకుర్తి చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించడం ఖాయంగా కనిపిస్తున్నదని పలువురు భావిస్తున్నారు.
Palakurti’s ‘Shakti’ duo
అయితే రాజకీయాల్లో శత్రువు ఎప్పుడూ పొంచి ఉంటాడు. గత పాలకుల వైఫల్యాలే వీరికి పెట్టుబడిగా మారాయి. కానీ ఇప్పుడు వీరు పాలకులు. రేపు వీళ్ళ వైఫల్యాలే ప్రత్యర్థులకు ఆయుధాలు అవుతాయి. అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఝాన్సీ రెడ్డి కుటుంబం పైనా ఉందనేది గుర్తించాలి. ‘అధికార గర్వం’ దరిచేరకుండా, సామాన్యుడి ఆత్మగౌరవాన్ని కాపాడినప్పుడే ఈ ‘శక్తి ద్వయం’ చరిత్రలో నిలుస్తుంది అనే సత్యాన్ని మరువకుండా ముందుకు సాగుతారని ఆశీద్దాం…
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
jananirnayam2022@gmail.com
