ఏఫ్రిల్ 22, భూమి దినోత్సవం సందర్బంగా ‘సహజ వనరుల పరిరక్షణ వేదిక’ పిలుపు
Let the earth breathe : నేడు ఏప్రిల్ 22. ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుకునే రోజు. కానీ మన కళ్ల ముందే మన ఊపిరిని ఆపేసే ఒక మహా విధ్వంసం నిశ్శబ్దంగా జరిగిపోతోంది. అదే ‘నేల తల్లి గుండెపై మైనింగ్ గొడ్డలి దెబ్బ’. అభివృద్ధి అనే ముసుగులో ప్రకృతి సంపదను, ముఖ్యంగా కొండలను, గుట్టలను కరిగించేస్తున్న తీరును చూస్తుంటే.. మనం భూమికి ఊపిరి పోస్తున్నామా..? లేక భూమి గొంతు నులుముతున్నామా..? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ నేపథ్యంలో సహజ వనరుల పరిరక్షణ వేదిక ఈ భీభత్సాన్ని సమాజం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.
Let the earth breathe
కొండలు, గుట్టలు అంటే కేవలం రాళ్ల కుప్పలు కావు. అవి భూమికి రక్షణ కవచాలు, నదుల జన్మస్థానాలు, వన్యప్రాణుల ఆవాసాలు. కానీ నేడు నగరీకరణ పేరుతో, అక్రమ మైనింగ్, స్టోన్ క్రషర్ల అరుపుల మధ్య ఈ ప్రకృతి సంపద కనుమరుగవుతోంది. పచ్చని పల్లెల మధ్య వెలుస్తున్న స్టోన్ క్రషర్లు వెదజల్లుతున్న ధూళి పల్లేరు గాయాలవుతోంది. ఆ పొగ, ఆ దుమ్ము మనుషుల ఊపిరితిత్తులను కుళ్ళింపజేయడమే కాక, చుట్టుపక్కల పంట పొలాలను బూడిద కుప్పలుగా మారుస్తున్నాయి. గుట్టలను పిండి చేసి ముడి సరుకుగా మార్చే క్రమంలో మనం కోట్లాది ఏళ్ల భూగర్భ చరిత్రను తుడిచిపెట్టేస్తున్నాం. డైనమైట్ల పేలుళ్లతో భూమి కంపించేలా చేస్తున్న విధ్వంసం.. రేపటి భూకంపాలకు, ప్రకృతి వైపరీత్యాలకు ఆహ్వానం పలుకుతోందని మర్చిపోవద్దు. కొండలు సహజ సిద్ధమైన నీటి వడపోత కేంద్రాలు. వర్షపు నీటిని ఒడిసి పట్టి, భూగర్భ జల మట్టాన్ని పెంచడంలో వీటి పాత్ర వెలకట్టలేనిది. ఎప్పుడైతే మనం గుట్టలను పిండి చేస్తున్నామో, అప్పుడే మన జల వనరులను కూడా నాశనం చేసుకుంటున్నాం. గుట్టలు లేని నేల ఎడారిగా మారడానికి ఎంతో కాలం పట్టదు. మనం గుట్టలను కరిగించే కొద్దీ, మన దాహాన్ని తీర్చే బావులు ఎండిపోతున్నట్లే అనేది గుర్తించాలి. రోడ్లు, భవనాలు అవసరమే. కానీ ఆ నిర్మాణం ప్రకృతిని సమాధి చేస్తూ జరగకూడదు. మైనింగ్ చట్టాలను తుంగలో తొక్కి, అనుమతులు ఉన్న దానికంటే రెట్టింపు లోతుకు తవ్వి, ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్న శక్తులను మనం అడ్డుకోకపోతే.. వచ్చే తరానికి మనం మిగిల్చేది కేవలం రాళ్ల కుప్పలు, విషపూరితమైన గాలి మాత్రమే.
Let the earth breathe
ఇలాంటి విధ్వంసం చేస్తూ పర్యావరణ నిబంధనలను అతిక్రమించే స్టోన్ క్రషర్లను, మైనింగ్ క్వారీలను తక్షణమే రద్దు చేయాలి. ప్రతి ఊరిలో ఉన్న స్థానిక గుట్టలను ‘సామాజిక ఆస్తి’గా ప్రకటించి, వాటిని పరిరక్షించే బాధ్యతను గ్రామ సభలకు అప్పగించాలి. మైనింగ్ జరిగిన ప్రాంతాల్లో తిరిగి పచ్చదనాన్ని నింపే బాధ్యతను ఆయా సంస్థలకే అప్పగించి, కఠినంగా అమలు చేయాలి. భూమికి ఊపిరి పోయడం అంటే కేవలం ఒక మొక్కను నాటడం మాత్రమే కాదు.. ఉన్న అడవిని, ఉన్న గుట్టను, ఉన్న నదిని కాపాడుకోవడం. గుట్టలు కరిగిపోతే మనిషి గుండె ఆగిపోవడానికి ఎంతో సమయం లేదు. రండి..! డైనమైట్ల పేలుళ్లతో వణుకుతున్న భూమి తల్లికి అభయమిద్దాం. స్వార్థపూరిత మైనింగ్‌ను ఎదిరిద్దాం. మన ప్రకృతిని, మన మనుగడను కాపాడుకుందాం.
రాజేందర్ దామెర (దారా)
సహజ వనరుల పరిరక్షణ వేదిక
వ్యవస్థాపక అధ్యక్షులు
