- చనిపోయిన ‘రంగనాయకమ్మ’ డిజిటల్ సంతకం ఎలా చేసింది..?
- ఆనాటి తహసీల్దార్‌కు నోటీసుల రంగం సిద్ధం..!?
- చిన్నకోడెపాక భూదందాపై విచారణ వేగవంతం..
- దొంగ సంతకాలు, అక్రమ పట్టాల క్లియరెన్స్‌పై వివరణ కోరనున్న ఉన్నతాధికారులు..!
- Developments regarding the illegal ‘land patta’ in Chinnakodepaka జయశంకల్ భూపాలపల్లి జిల్లా గొరి కొత్తపల్లి మండలం చిన్నకోడెపాక గ్రామంలో మరణించిన రంగనాయకమ్మ పేరిట జరిగిన ప్రభుత్వ భూమి బదలాయింపు అక్రమాలపై జిల్లా యంత్రాంగంలో ఎట్టకేలకు కదిలికలు మొదలయ్యాయి.
అక్రమార్కులు కలిసి ఆడిన నాటకంలో అసలైన లబ్ధిదారుల పేర్లనే మార్చేశారు. చిన్నకోడెపాక గ్రామానికి చెందిన అసలైన లబ్ధిదారు ఐతరాజు రంగనాయకమ్మ భర్త పేరు రామారావు. కానీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ‘పోతురాజు రంగనాయకమ్మ భర్త ‘సంప’ అని సృష్టించారు.
విస్తుపోయే విషయం ఏమిటంటే, ఈ ‘సంప’ అనే పేరు గల వ్యక్తులు అసలు చిన్నకోడెపాక గ్రామంలోనే ఎవరూ లేకపోవడం గమనార్హం. సర్వే నంబర్ 268, 269, 270, 271 లోని 5.24 ఎకరాల భూమిని ఆ ఊరి వ్యక్తి కాని మరో వ్యక్తి పేరు మీదకు అక్రమంగా మార్చేసి పట్టా చేసేశారనేది ప్రస్తుతం బహిరంగ రహస్యంగా మారిన విషయం తెలిసిందే.
Developments regarding the illegal ‘land patta’ in Chinnakodepaka
చనిపోయిన వ్యక్తి 18 ఏళ్ల తర్వాత వచ్చి డిజిటల్ సంతకం చేయడం, ఉనికిలో లేని వ్యక్తుల పేర్ల రికార్డులతో ఫైళ్లు క్లియర్ చేయడం వంటి బరితెగింపులపై జిల్లా ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ పట్టాల వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఆనాటి తహసీల్దార్‌కు సంజాయిషీ నోటీసులు జారీ చేయడానికి జిల్లా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నెలలు గడుస్తున్నా ఆర్డీఓ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, రికార్డుల్లో పచ్చి అక్రమాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ విభాగం ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత మే 17న ఆర్డీఓ జరిపిన క్షేత్రస్థాయి విచారణ వివరాలు, స్థానికులు సమర్పించిన ఆధారాలను ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. చట్టబద్ధమైన ‘ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్’ లేకుండా, కనీస వేలిముద్ర కూడా తీసుకోకుండా ఫైళ్లను ఏ ప్రాతిపదికన క్లియర్ చేశారనే అంశంపై ఆనాటి తహసీల్దార్‌ను వివరణ కోరనున్నారు.
ఒకవేళ నోటీసులకు సరైన సమాధానం రాకుంటే, సదరు అధికారిని సస్పెండ్ చేయడంతో పాటు దొంగ సంతకాలు, తప్పుడు రికార్డుల సృష్టిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.
Developments regarding the illegal ‘land patta’ in Chinnakodepaka
అసలైన లబ్ధిదారు ఐతరాజు రంగనాయకమ్మ భర్త పేరు ‘రామారావు’ అయితే, రికార్డుల్లో ‘సంప’ అని మార్చడం వెనుక ఉన్న అసలు కబ్జాదారుల బంధాన్ని చేధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఊరు కాని వ్యక్తికి 5.24 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలపై కూడా అంతర్గత విచారణ మొదలైనట్లు సమాచారం. జిల్లా అధికారులు కదులుతుండటంతో చిన్నకోడెపాక గ్రామస్థుల్లో న్యాయం జరుగుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చేసిన అక్రమ పట్టాను తక్షణమే రద్దు చేయాలని, పేదల స్థలాలుగా ఉన్న ఈ ప్రభుత్వ భూములను కాపాడి శాశ్వత హద్దులు నిర్ణయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
