కుర్చీ మార్పిడి కాదు… గుణ మార్పిడే అసలైన ప్రజాస్వామ్యం
A reflection on Bikshapati’s ‘psychodynamic inquiry’ సమాజంలో మార్పు కోసం, హక్కుల కోసం జరిగే ఏ రాజకీయ ఉద్యమమైనా మొదట ఒకే ఒక్క నినాదంతో ప్రజా క్షేత్రంలోకి వస్తుంది.”మాకు అధికారం కావాలి, మా వాటా మాకు దక్కాలి.” శతాబ్దాలుగా నిర్ణయాధికార పదవులకు దూరంగా నెట్టబడిన బహుజన వర్గాలు ఈరోజు రాజ్యాధికారం కోసం ఆరాటపడటం ఒక చారిత్రక అవసరం. మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి బాబాసాహెబ్ అంబేడ్కర్ వరకు మనకు నేర్పిన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి ఇది మొదటి అడుగు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
అయితే, ఇటీవల ‘వుదయం దినపత్రిక’లో (29 మే, 2026) ఐరబోయిన బిక్షపతి (అగల్ జోయా) గారు రాసిన “వడ్డించేవాడు మనవాడా..? మంచివాడా..?” అనే ‘సైకోడైనమిక్ విచారణ’ వ్యాసం మనల్ని ఒక కొత్త కోణంలో ఆలోచింపజేస్తోంది. కేవలం మన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కుర్చీ ఎక్కితేనే అంతా అయిపోయినట్టేనా? ఆ కుర్చీ ఎక్కిన వ్యక్తి మనస్సు ఎలాంటిది? అనే ఒక నిశితమైన ప్రశ్నను ఆయన మన ముందుకు తెచ్చారు. ఈ వ్యాసంలోని లోతును కాస్తా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.
సాధారణంగా ఒక సామాన్య మనిషి ఎదిగే క్రమంలో సమాజంలో ఎన్నో అవమానాలను, వివక్షను ఎదుర్కొంటాడు. ముఖ్యంగా అణచివేతకు గురైన వర్గాల నుండి వచ్చే నాయకులకు ఈ జీవిత గాయాలు చాలా ఎక్కువ. అయితే, ఒక వ్యక్తి ఎన్నో పోరాటాలు చేసి అధికార పీఠం ఎక్కినప్పుడు… అతను తనతో పాటు తన చిన్ననాటి కష్టాలను, లోపల పేరుకుపోయిన కోపాన్ని కూడా ఆ కుర్చీలోకి తీసుకెళ్తాడు. ఇక్కడే అసలైన పరీక్ష మొదలవుతుంది. ఆ పాత గాయాల నుండి పుట్టిన కోపం ‘ప్రతీకారం’ వైపు దారితీస్తుందా..? లేక ‘కరుణ’ వైపు నడిపిస్తుందా..?
మానసిక శాస్త్రంలో దీనినే ‘పీడకుడితో గుర్తింపు’ అంటారు. అంటే, ఎవరినైతే మనం పీడకులుగా భావించి వ్యతిరేకించామో… తెలియకుండానే అదే పాత పాలకుల దుర్గుణాలను, అదే అహంకారాన్ని కొత్త పాలకులు కూడా కాపీ కొట్టడం. అనాడు ఒక సామాన్యుడిని ఆఫీసుల చుట్టూ తిప్పించిన పాత పాలక వర్గాల లాగే, నేడు అధికారం వచ్చిన కొత్త నాయకులు కూడా ప్రవర్తిస్తే… అక్కడ కేవలం ముఖాలు మారినట్టే తప్ప వ్యవస్థ మారనట్టే.
ఇక్కడ బిక్షపతి గారి ‘సైకోడైనమిక్ విచారణ’ను మరింత లోతుగా, శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. వ్యవస్థ అనేది ఆకాశం నుండి ఊడిపడదు, అది వ్యక్తుల ఆలోచనల సముదాయమే కాబట్టి… వ్యవస్థ మారాలన్నా చివరకు ‘వ్యక్తి మార్పు’తోనే అది సాధ్యమవుతుంది. బిక్షపతి గారు కూడా ఇదే సూత్రంతో పాలకుడి మనస్తత్వం మారాలని ఆశపడ్డారు. కానీ, ఇక్కడే ఒక విస్మరించరాని లోటు ఉంది.
అధికార కుర్చీలో కూర్చునే ఒక్క ‘వ్యక్తి’ (పాలకుడు) మారితేనే వ్యవస్థ మారిపోతుందా? బిక్షపతి గారు చెప్పినట్లు వడ్డించేవాడు మంచివాడైతే సరిపోతుందా? కచ్చితంగా మారదు, సరిపోదు. ఎందుకంటే, ఆ కుర్చీ చుట్టూ ఉండే లంచగొండి యంత్రాంగం, బ్యూరోక్రసీ మాత్రమే కాదు… ఆ నాయకుడికి ఓట్లు వేసి గెలిపించిన “సమాజం” కూడా అదే పాత మనస్తత్వంతోనే ఉంటుంది.
ఒక నాయకుడు వ్యక్తిగతంగా ఎంత మంచివాడైనా, తన లోపలి గాయాలను కరుణగా మార్చుకుని న్యాయం చేయాలని అనుకున్నా… సమాజం మాత్రం “ఆయన మనవాడే కదా, మనకు తప్పు పనైనా చేసి పెట్టాలి” అని ఒత్తిడి తెస్తుంది. కులం పేరుతో, బంధుత్వం పేరుతో పాలకుడి నైతికతను సామాన్యులే దెబ్బతీస్తుంటారు. అంటే, కేవలం పాలకుడి గుణం మారితే సరిపోదు… పాలకుడిని నడిపించే సమాజం గుణం కూడా మారాలి. బిక్షపతి గారు పాలకుడి మనస్తత్వ విచారణ చేశారు కానీ, ఆ పాలకుడిని కలుషితం చేసే ‘సామాజిక మనస్తత్వాన్ని’ కూడా స్పృశించాల్సింది. ఒంటరి వ్యక్తి మార్పు ఎప్పుడూ తాత్కాలికమే… సమాజ మార్పుతో కూడిన వ్యక్తి మార్పే శాశ్వతమైనది.
ప్రజాస్వామ్యం అంటే కేవలం ఐదేళ్లకు ఒకసారి ఓట్లు వేసి, పాలకులను మార్చే ఒక చట్టపరమైన యంత్రాంగం కాదు. అది ఒక “సహజీవన విధానం” అని బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్లు మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం. అంటే సమాజంలో ఒక మనిషిని ఇంకొక మనిషి గౌరవించడం, తోటివాడి బాధను తన బాధగా భావించడం. మనం పాత పాలకుల దర్పపు పోకడలను వ్యతిరేకించి ఉద్యమాలు చేస్తాం. కానీ, అధికారం చేతికి రాగానే మన నాయకులు కూడా అదే పాత పాలకుల లాగా ప్రవర్తిస్తూ, సామాన్యులను కలవడానికి నిరాకరిస్తే ఆ పోరాటాల ఆశయమే దెబ్బతింటుంది. సంఖ్యాబలంతో ఎన్నికలు గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ సమాజంలోని చివరి మనిషి కన్నీరు తుడవాలనే గుణంతో పాటు, కుళ్లిన పాత సమాజ పోకడలను ఢీకొట్టే నైతిక శక్తి పాలకుడికి ఉన్నప్పుడే ఆ పాలనకు సార్థకత లభిస్తుంది.
బిక్షపతి గారు తమ వ్యాసంలో చెప్పినట్టు “ప్రాతినిధ్యం మారితే ముఖాలు మాత్రమే మారతాయి… కానీ మనస్తత్వం మారితేనే చరిత్ర మారుతుంది”. వడ్డించేవాడు మనవాడు కావడం మొదటి అడుగు అయితే, వాడు మనస్సాక్షి ఉన్న ‘మంచివాడు’ కావడం రెండవ అడుగు. కానీ, ఆ మంచివాడి చేతిలో ఉన్న గరిటె, వడ్డించే పాత్ర, ఆ వంటశాల నియమాలు (వ్యవస్థ) కూడా మారనంత కాలం అందరికీ సమన్యాయం జరగదు. అంతేకాదు… ఆ మంచివాడు వడ్డిస్తున్నప్పుడు కంచాలు పట్టుకుని కూర్చున్న సమాజం కూడా క్రమశిక్షణతో, స్వార్థం లేకుండా న్యాయాన్ని ఆశించినప్పుడే ఆ పంక్తిలో అందరికీ సమన్యాయం జరుగుతుంది. అధికార పీఠం ఎక్కే వ్యక్తి తనలోని భయాన్ని అధిగమించి, శతాబ్దాల కోపాన్ని ప్రతీకారంగా మార్చకుండా ‘న్యాయం’గా మార్చుకోవాలి. ఆ వ్యక్తిగత మార్పుకు తోడుగా సమాజంలో కూడా నైతిక చైతన్యం రావాలి. పాలకులుగా మన గుణం మారాలి… ప్రజలుగా మన మనస్తత్వమూ మారాలి. ఆ రెండు మార్పుల సంగమమే నిజమైన ప్రజాస్వామ్యం. ఈ దిశగా సాగే ఆత్మపరిశీలనలు మన ఉద్యమాలను బలహీనపరచవు, మరింత శవంతమైన, పరిణతి చెందిన శక్తులుగా మారుస్తాయి.
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
