Is silence from Warangal ‘MGM’ the answer : ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి ఏ స్థాయికి చేరిందంటే, శారీరక వైకల్యం లేని వ్యక్తి కూడా ‘దివ్యాంగుడి’ ముసుగు వేసుకుని ఏళ్ల తరబడి కొలువును వెలగబెట్టేంతగా..! వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వెలుగుచూసిన ‘ముస్కు’ వ్యవహారం కేవలం ఒక వ్యక్తి చేసిన ఫోర్జరీ మాత్రమే కాదు.. అది నియామక ప్రక్రియలో ఉన్న లొసుగులకు, పర్యవేక్షణ లోపాలకు నిలువుటద్దం. సాక్ష్యాధారాలు కళ్లముందు కనిపిస్తున్నా, జిల్లా యంత్రాంగం, ఎంజీఎం సూపరింటెండెంట్ ప్రదర్శిస్తున్న ‘మౌనం’ వెనుక అర్థమేమిటి..? ఈ వ్యవహారంలో అత్యంత విడ్డూరమైన అంశం సదరు వ్యక్తి సమర్పించిన ‘సదరం’ సర్టిఫికేట్ తేదీ. డిసెంబర్ 25, 2010. దేశమంతా క్రిస్మస్ సెలవులో ఉన్న రోజున, ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడిన వేళ, ఒక వ్యక్తికి వైకల్య ధ్రువీకరణ పత్రం ఎలా జారీ అయ్యింది..? ఇది ఏ స్థాయి మాయాజాలం..? అసాధ్యమైన దానిని సుసాధ్యం చేశారంటే, దీని వెనుక ఎంతటి వ్యవస్థీకృత నిర్లక్ష్యం దాగి ఉందో ఇట్టే అర్థమవుతోంది. సెలవు రోజున సర్టిఫికేట్ పుట్టుకొచ్చిందన్న ఒక్క ఆధారమే ఆ ఉద్యోగిని ఇంటికి పంపడానికి సరిపోతుంది. కానీ, అధికారులు ఫైళ్లను కదిలించకపోవడం వెనుక ఉన్న ‘అదృశ్య హస్తం’ ఎవరిది..? ఎంజీఎం సూపరింటెండెంట్ పాత్ర కూడా ఇక్కడ తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఆసుపత్రికి అడ్మినిస్ట్రేషన్ బాధ్యత వహిస్తున్న వ్యక్తిగా, తన పరిధిలోని ఉద్యోగిపై ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు తక్షణమే నిగ్గుతేల్చాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అయితే, విచారణను వేగవంతం చేయాల్సింది పోయి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పేరును పదోన్నతుల జాబితాలో చేర్చడం ‘అగ్నికి ఆజ్యం పోయడమే’. ఇది అర్హులైన దివ్యాంగులను అవమానించడమే కాదు, నీతిగా పనిచేసే ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుందని అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Is silence from Warangal ‘MGM’ the answer
ఒక నకిలీ సర్టిఫికేట్ వల్ల ఒక నిజమైన దివ్యాంగుడి అవకాశం హరించుకుపోయింది. పదేళ్లుగా ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా జీతభత్యాలు చెల్లించబడ్డాయి. ఇది ప్రజల సొమ్మును దోచుకోవడమే. కేవలం విచారణల పేరుతో కాలయాపన చేయడం వల్ల వ్యవస్థపై సామాన్యులకు ఉన్న నమ్మకం సడలిపోతుంది. ఇప్పటికైనా కేవలం నివేదికలకే పరిమితం కాకుండా, స్వయంగా జోక్యం చేసుకోవాలి. సదరు వ్యక్తికి తక్షణమే ‘ఫిజికల్ ఫిట్నెస్’ పరీక్ష నిర్వహించి, నకిలీ అని తేలితే ఆ ఉద్యోగిని బర్తరఫ్ చేయడమే కాకుండా, సెలవు రోజున సర్టిఫికేట్ ఇచ్చిన నాటి అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవస్థలో పేరుకుపోయిన ఈ ‘ముస్కు’ను తొలగించకపోతే, అర్హులైన నిరుద్యోగులు ప్రభుత్వ కొలువుల మీద ఆశ వదులుకోవాల్సి వస్తుంది. పారదర్శకతకు మారుపేరుగా నిలవాల్సిన అధికార యంత్రాంగం, అక్రమార్కులకు రక్షణ కవచంగా మారడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఎంజీఎం ‘ముస్కు’ బాగోతంపై నిర్ణయాత్మక చర్యలే ఈ అక్రమ పరంపరకు ముగింపు పలకగలవని పలువురు భావిస్తున్నారు.
