My connection with Malayashree : 1982-1989 మధ్యకాలంలో నేను హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో పిడిసి నుంచి ఎం. ఏ (ఎల్) దాకా చదువుకొని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. అనంతర కాలంలో మాసబ్ ట్యాంక్ లో నెలకొని ఉన్న ప్రభుత్వ విద్యాతత్వ కళాశాలలో తెలుగు పండిత శిక్షణను పూర్తిచేసుకుని 1991లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జవహర్ నవోదయ విద్యాలయ లో తెలుగు ఉపాధ్యాయుడిగా చేరాను. ప్రాచ్య కళాశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థిగా అక్కడ జరిగే సభలు సమావేశాలలో పండితుల ప్రసంగాలను వారి విశ్లేషణలను గమనించే అవకాశం కలిగింది. అలాగే కళాశాలలో మాకు ఉద్దండులైన పండితులు పాఠాలు చెప్పేవారు. ఇవన్నీ సహజంగానే నాలో భాష సాహిత్యాల అధ్యయనం పట్ల అవగాహన పెంచాయి. ఈ నేపథ్యంలో నాకు నచ్చిన అంశాల పట్ల వివిధ పత్రికలలో వ్యాసాలు రాస్తుండే వాడిని. ఉద్యోగంలో చేరిన తర్వాత బాధ్యతల భారం ఉన్నానా ప్రవృత్తికి సంబంధించిన అధ్యయనాన్ని, రచనా వ్యాసంగాన్ని మానలేదు.
My connection with Malayashree
1991లో కరీంనగర్ జిల్లా చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయలో తెలుగు అధ్యాపకుడిగా చేరిన తర్వాత విద్యార్థులలో రచన వ్యాసంగాన్ని ప్రోత్సహిస్తూ ఏటా ఉగాది పర్వదినానికి “భారతి” పేరుతో లిఖిత వార్షిక పత్రికను తెచ్చేవాళ్లం. విద్యార్థులలో భాషా సంస్కృతుల పట్ల విస్తృత అవగాహన కలిగించేందుకు ప్రముఖులను ఆహ్వానించి ఉపన్యాసాలు చేయించే వాళ్ళం. ఈ సందర్భంలోనే నవోదయ విద్యాలయ సమితి నో యువర్ డిస్ట్రిక్ట్ Know your District పేరుతో ఒక ప్రాజెక్టును చేపట్టింది. అందులో జిల్లా సాహిత్య సాంస్కృతిక రంగాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించే పనిలో ఉండగా మా మిత్రులు నేడు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె చంద్రశేఖర్ గారితో మాట్లాడుతున్నప్పుడు కరీంనగర్ కు చెందిన మలయశ్రీ తమ నాన్నగారైన డాక్టర్ కె.రాజన్న శాస్త్రి గారి పర్యవేక్షణలో కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్యాన్ని పరిశోధించి డాక్టరేట్ పట్టాన్ని పొందారని అందులో కావలసినంత సమాచారం ఉందని ఆ లిఖిత ప్రతిని నాకు అందించారు. అందులో నాకు కరీంనగర్ జిల్లా సాహిత్య విశ్వరూపం కనిపించింది. ఇదే సమయంలో మలయశ్రీ గారు మిత్రులు చంద్రశేఖర్ గారి వద్ద ఉన్న ప్రతిని తీసుకోవడానికి వచ్చిన సందర్భంలో వారితో నాకు పరిచయం కలిగింది. అప్పటికే నేను ఆ గ్రంధాన్ని కొంత చదివాను కాబట్టి “మీ థీసిస్ చదివానండి. చాలా బాగుంది” అనడం ఆ తర్వాత నా సాహిత్యాసక్తిని గమనించి రెండు మూడుసార్లు నవ్య సాహిత్య పరిషత్ నిర్వహించిన సభలకు ఆహ్వానించారు. నవోదయలో మా మిత్రులు చంద్రశేఖర్, కృష్ణ, అనిల్ కుమార్లు నా రచన వ్యాసంగాన్ని గమనించి మీరు పరిశోధన చేస్తే బాగుంటుంది అంటూ ప్రోత్సహించేవారు. ఆ తర్వాత చెప్పే విషయానికి సిద్ధాంతపరంగా బలం సమకూరాలంటే పరిశోధన అవసరమని భావించి 2001లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్. డి ప్రవేశం కోసం తొలిసారిగా నిర్వహించిన పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించాను. నా ఉద్యోగ పని భారాన్ని, పరిస్థితులను మనసులో పెట్టుకొని ఈ పరిశోధనా అంశాన్ని ఎంచుకోవడంలో నాకు నేనుగా కొన్ని పరిమితుల్ని విధించుకున్నాను. అవి 1. కవి తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడై ఉండాలి 2. ప్రగతిశీల అభ్యుదయ భావజాలం కలిగి ఉండాలి 3. కవి రచనలు అందుబాటులో ఉండాలి 4. క్షేత్ర పర్యటనల వంటివి పరిమితంగా ఉండాలి. మలయశ్రీ గారి రచనలపై అప్పటివరకు ఎవరు ఆయన పై పరిశోధన చేయకపోవడం మూలాన ఇదే అదనుగా భావించి కరీంనగర్ జిల్లాతో ఉద్యోగాను బంధాన్ని కాదు సాహిత్య అనుబంధాన్ని దృఢతరం చేసుకోవాలన్న సంకల్పంతో పరిశోధన ప్రారంభించాను. తెలంగాణ జిల్లాల్లో కరీంనగర్ లో మంచి సాహిత్య వాతావరణం ఉంది.
My connection with Malayashree
పి.వి.నరసింహారావు, డాక్టర్ సి. నారాయణ రెడ్డి, వెలిచాల కొండలరావు, బాపురెడ్డి, పి. యశోదా రెడ్డి, ముద్దసాని రామ్ రెడ్డి, అనుమాండ్ల భూమయ్య, గండ్ర లక్ష్మణరావు, జై శెట్టి రమణయ్య, జూకంటి జగన్నాథం, కాలువ మల్లయ్య, పెద్దింటి అశోక్ కుమార్, నలిమెల భాస్కర్, అన్నవరం దేవేందర్, సంగనభట్ల నరసయ్య, డింగరి నరహరి ఆచార్య, గోపులింగారెడ్డి ప్రభృతుల సాహిత్య సేవ కనిపిస్తుంది. రేఖామాత్రంగానే ఇందులో కొందరిని మాత్రమే వ్యాస విస్తరణ భీతి చేత పేర్కొన్నాను. ఇతరులు చాలామంది ఉన్నారు. దిగితే గాని లోతు తెలియదు అన్నట్లు మలయశ్రీ సృజనాత్మకమైన రచనా వ్యాసంగాన్ని గమనించినప్పుడు ఆయన
కవిత్వం, నాటకం, నవల, చరిత్ర, కథ, వ్యాసం, అనువాదం, తదితర వస్తు, ప్రక్రియా వైవిధ్యంతో సృజన జరిగింది. నాకు ప్రాథమికంగా కవిత్వం అంటే ఇష్టం కనుక “మలయశ్రీ కావ్యాలు-పరిశీలన”అనే శీర్షికతో పరిశోధన చేశాను. ఈ సందర్భంలో మలయశ్రీ గారిని కలిసి నప్పుడల్లా పరిశోధనపరమైన ప్రగతిని, గురించి చర్చించె వారు . ఉద్యోగరీత్యా నాకు అక్కడ నుండి బదిలీ అయిన తర్వాత కరీంనగర్ కు వెళ్ళినప్పుడు వారి ఇంట్లో రెండు మూడు సార్లు ఆతిథ్యాన్ని కూడా స్వీకరించాను. మా మధ్య తులనాత్మకమైన మంచి సాహిత్య చర్చ జరిగేది. అప్పటికి మలయశ్రీ సాహిత్యం పై నాదే మొదటి పరిశోధన కనుక విషయ విశ్లేషణకు గాను నా పరిశోధనా అంశాన్ని ఏడు అంశాలుగా విభజించాను. మొదటి అధ్యాయంలో మలయ శ్రీ జీవన రేఖలను గురించి వివరించగా రెండో అధ్యాయంలో ఆయన పద్య కావ్యాలను మూడో అధ్యాయంలో గేయకావ్యాలను నాలుగో అధ్యాయంలో వచన కవిత్వాన్ని ఐదో అధ్యాయంలో బాలసాహిత్యాన్ని ఆరో అధ్యాయంలో అనువాద రచనల్ని ఏడవ అధ్యాయంలో మలయ శ్రీ సాహిత్య వ్యక్తిత్వాన్ని ఆయన ప్రత్యేకతను గురించి వివరించాను. పరీక్షకులుగా ఉన్న ఆచార్యులు నా పరిశోధనను ప్రణాళికను విశ్లేషణను అభినందించారు. ఫలితంగా 2006లో నాకు పిహెచ్.డి పట్టం లభించింది. కాగా ఎంతో శ్రద్ధాసక్తులు, అధ్యయన పరిశ్రమతో కూడి చేసిన ఈ సిద్ధాంత వ్యాసాన్ని అచ్చు చేయటానికి నాకు తగిన ఆర్థిక వనరులు లేని కారణంగా స్తబ్దంగా ఉండిపోయాను. ఒకసారి మలయ శ్రీ పురస్కార ప్రదాన ఉత్సవంలో పాల్గొన్నప్పుడు నా పరిశోధన గురించి తెలుసుకున్న మలయశ్రీ గారి ఆత్మీయులు డాక్టర్ కె. శ్యాంసుందర్ గారు సిద్ధార్థ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున ప్రచురించడానికి పూనుకొన్నారు. వారి సహృదయానికి స్పందించి నా పరిశోధన గ్రంథాన్ని వారికే అంకితం ఇచ్చాను. తేదీ 10.6.2009న మానస ఆర్ట్స్ థియేటర్స్ తరఫున హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు గ్రంథాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చుక్కా రామయ్య విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులు ప్రొఫెసర్ ననుమాస స్వామి అధ్యక్షతన జరిగిన సదస్సులో పర్యవేక్షకులు డాక్టర్ అప్పం పాండయ్య, మలయ శ్రీ, పల్లెర్ల రామమోహనరావు ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సిద్ధాంత గ్రంధాన్ని పరిచయం చేస్తూ వెల్దండ నిత్యానంద రావు, అన్నవరం దేవేందర్, డాక్టర్ ద్వానా శాస్త్రి సమీక్షలు రాశారు. కరీంనగర్ కు చెందిన దాస్యం సేనాధిపతి గారు నేటి నిజం పత్రికలో నా పరిశోధన గ్రంథాన్ని గురించి విపులంగా రాశారు. మలయశ్రీ నవలలు, నాటకాలపై ఇంకా పరిశోధనలు జరగవలసిన అవసరం ఉంది. తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయమైనది.
డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్
సెల్ : 9989148305
