Voices are indeed loud… but where are the steps ? : ప్రశ్నించడం మంచిదే. ప్రశ్నించే గొంతు అవసరమే. పాడటం అవసరమే. రాయడం అవసరమే. అన్యాయాన్ని ఎండగట్టడం అవసరమే. కానీ… మనం ఏం చేస్తున్నాం..? ఎక్కడ ఉన్నాం..? ఎవరితో ఉన్నాం..? ఎవరిని కదిలిస్తున్నాం..? మన మాటకు, పాటకు క్షేత్రంలో ఎంత బలం ఉంది..? ఇవే ఇప్పుడు మనల్ని మనమే అడగాల్సిన అసౌకర్యమైన ప్రశ్నలు.
సోషల్ మీడియా తెరిస్తే కవిత్వం ఉంది. పాట ఉంది. ఆవేశం ఉంది. నిరసన ఉంది. అధికారాన్ని ప్రశ్నించే పోస్టులు ఉన్నాయి. వ్యవస్థను నిలదీసే వ్యాఖ్యలు ఉన్నాయి. సమాజం కోసం పోరాడుతున్నామని చెప్పుకునే స్వరాలు ఉన్నాయి. అభ్యుదయం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, విప్లవం… అన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఈ మొత్తం శబ్దం మధ్య ఒక ప్రశ్న మాత్రం వినిపించడం లేదు. ఈ గొంతుల ప్రభావం ప్రజల జీవితాల్లో ఎంత..? అది అడిగితే మనకు కొంత అసౌకర్యం కలుగుతుంది.
ఎందుకంటే మనం ఒక విచిత్రమైన కాలంలోకి వచ్చేశాం. పోరాటం పోస్టుగా మారింది. నిరసన స్టేటస్‌గా మారింది. ఆవేదన రీల్‌గా మారింది. విప్లవం హ్యాష్ట్యాగ్గా మారింది. అయితే సోషల్ మీడియాను తక్కువ చేసి చూడటం నా ఉద్దేశం ఏమాత్రం కాదు. అది ఒక శక్తివంతమైన వేదిక అనటంలో సందేహం లేదు. నాకెలాంటి భిన్నాభిప్రాయం కూడా లేదు. కానీ ఒకప్పుడు ఒక కవి, ఒక కళాకారుడు, ఒక రచయిత తన మాటను వంద మందికి వినిపించాలంటే సభ కావాలి. వేదిక కావాలి. పత్రిక కావాలి. ఇప్పుడు ఒక పోస్టుతో లక్షల మందికి చేరవచ్చు. ఒక పాటతో వేలమందిని ఆలోచింపజేయవచ్చు. ఒక వీడియోతో ఒక సమస్యను రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తీసుకురావచ్చు. అది గొప్ప అవకాశమే. కానీ అవకాశాన్ని ఉపయోగించడం ఒకటి… ఆ అవకాశంతో మార్పు తీసుకురావడం మరొకటి.
అక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. గొంతు ఉంది… కానీ అడుగు..? కవి సమాజాన్ని ప్రశ్నిస్తాడు. రచయిత సమాజపు చీకటి మూలలను వెలుగులోకి తెస్తాడు. కళాకారుడు ప్రజల బాధను పాటగా మారుస్తాడు. అభ్యుదయవాది అన్యాయాన్ని ఎదిరిస్తాడు.
ఇవన్నీ సమాజానికి అవసరమైనవే. కానీ ఒక రైతు సమస్యపై మనం రాసిన కవితను చదివిన రైతు తర్వాత ఏం చేశాడు..? ఒక కార్మికుడి బాధపై పాడిన పాట విన్న కార్మికుడి జీవితంలో ఏ మార్పు వచ్చింది..? ఒక ఆదివాసీ యోధిడిపై రాజధాని వేదికల మీద గళం విప్పితే ఆదివాసీలకు ఏమేరకు చేరువైంది. ఒక దళితుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ పెట్టిన పోస్టు తర్వాత మనం అతని పక్కన ఎంతసేపు నిలబడ్డాం..? ఒక ఆదివాసీ భూమి కోసం గొంతెత్తినప్పుడు మన గొంతు సోషల్ మీడియా దాటి అతని గ్రామానికి వెళ్లిందా.. పర్యావరణాన్ని కాపాడాలని మాట్లాడిన మన మాట… ఆ గుట్ట వద్దకు, ఆ చెరువు వద్దకు, ఆ అడవి అంచుకు వెళ్లిందా..? ఇవే అసలు లెక్కలు. లైకులు కాదు. షేర్లు కాదు. వ్యూ కౌంటర్లు కాదు. క్షేత్రంలో మన అడుగుల సంఖ్యే అసలు కొలమానం. మనం ఎక్కడికి వచ్చాం..?
ఒకప్పుడు ప్రజా కళాకారుడు ప్రజల మధ్య ఉండేవాడు. రచయిత ప్రజల జీవితాలను తడిమి తెలుసుకునేవాడు. కవి ఉద్యమాల మధ్య కూర్చునేవాడు. పాట ఉద్యమానికి ఆయుధమయ్యేది. సాహిత్యం ప్రజా జీవితంతో సంభాషించేది. ఇప్పుడు పరిస్థితి కొంత మారింది. ప్రజల మధ్యకు వెళ్లే ముందు మొబైల్ కెమెరా ముందు నిలబడుతున్నాం. ఒక సంఘటన జరిగితే అక్కడికి వెళ్లే ముందు పోస్టు రాస్తున్నాం. ప్రజల బాధను అర్థం చేసుకునే ముందు దానిపై అభిప్రాయం చెబుతున్నాం. మనకు ప్రజల సమస్యల కంటే ప్రజల సమస్యలపై మన అభిప్రాయమే ముఖ్యమైపోయిందా..? ఇది కఠినమైన ప్రశ్నే… అయినా అడగాల్సిందే. ఎందుకంటే అభ్యుదయ భావజాలం అంటే కొన్ని మంచి పదాలను పలకడం కాదు. విప్లవం అంటే విప్లవం అనే పదాన్ని పదేపదే రాయడం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల తరఫున మాట్లాడటం మాత్రమే కాదు. ప్రజలతో కలిసి నిలబడటం. వారి బాధను భరించడం. వారి పోరాటంలో భాగం కావడం. అవసరమైతే మన సౌకర్యాన్ని వదులుకోవడం. అక్కడే ఆలోచనకు ఆచరణకు మధ్య తేడా తెలుస్తుంది. సోషల్ మీడియా వీరులా..? లేక సామాజిక మార్పు భాగస్వాములా..? ఈ ప్రశ్నను ప్రత్యేకంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అభ్యుదయవాదులు తమను తాము అడుక్కోవాలి. ఒక పోస్టు పెట్టాం. వంద మంది మెచ్చుకున్నారు. వెయ్యి మంది షేర్ చేశారు. పది వేల మంది చూశారు. అంతేనా..? ఆ పోస్టు తర్వాత ఎవరైనా ఒక సమస్యపై మాట్లాడారా..? ఒక బాధితుడికి న్యాయం దొరికిందా..? ఒక గ్రామంలో చైతన్యం పెరిగిందా..? ఒక కార్మికుడు తన హక్కు గురించి తెలుసుకున్నాడా..? ఒక విద్యార్థి తన ప్రశ్నను ధైర్యంగా అడగగలిగాడా..? ఏమీ జరగకపోతే మనం చేసినది కేవలం డిజిటల్ శబ్దం మాత్రమే కావచ్చు. శబ్దం అవసరమే. కానీ శబ్దం తర్వాత చర్య రావాలి.
మరి ఏం చేయాలి..? ముందుగా మనం మన పాత్రను తిరిగి నిర్వచించుకోవాలి. కవి కేవలం కవిత రాయడం దగ్గర ఆగకూడదు. ఆ కవిత ఎవరిని చేరాలి..? ఎవరిని కదిలించాలి..? అనే ప్రశ్న కూడా ఉండాలి. కళాకారుడు కేవలం వేదికపై పాడకూడదు. తన పాట పుట్టిన నేల మీద, ఆ పాటకు కారణమైన ప్రజల మధ్య కూడా ఉండాలి. రచయిత కేవలం సమస్యను విశ్లేషించకూడదు. సమస్య వెనుక ఉన్న మనిషిని కూడా చూడాలి. సోషల్ మీడియా వేదికను వదిలేయాల్సిన అవసరం లేదు. దాన్ని మరింత సమర్థంగా ఉపయోగించాలి.
పోస్టును క్షేత్రానికి తీసుకెళ్లాలి. పాటను ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి. కవితను ఉద్యమంతో కలపాలి. రచనను కార్యాచరణతో అనుసంధానించాలి. ఒక సమస్యపై పోస్ట్ పెట్టిన తర్వాత అక్కడి ప్రజలతో మాట్లాడాలి. వారి సమస్యను అర్థం చేసుకోవాలి. అవసరమైతే ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేయాలి. సమాచారాన్ని సేకరించాలి. అధికారులను ప్రశ్నించాలి. ప్రజలకు న్యాయపరమైన, సామాజికమైన మార్గాలను తెలియజేయాలి. ఉద్యమం జరుగుతున్న చోటికి వెళ్లాలి. అప్పుడే మాటకు కాళ్లు వస్తాయి.
అయితే ఇక్కడ మరో కఠినమైన ప్రశ్న ఉంది. మనం ఎవరిని మోసం చేస్తున్నాం..? మన పోస్టులతో ప్రజలను మోసం చేస్తున్నామా..? లేక మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామా..? “నేను స్పందించాను.” “నేను ఖండించాను.” “నేను ప్రశ్నించాను.” “నేను రాశాను.” అని చెప్పుకోవడం ద్వారా మన బాధ్యత పూర్తయిందని అనుకుంటే… అది అభ్యుదయం కాదు. అది ఆత్మసంతృప్తి. ప్రజల కోసం మాట్లాడుతున్నామనే భావన మనలో ఒక నైతిక సంతృప్తిని కలిగిస్తుంది. కానీ ఆ సంతృప్తి క్షేత్రస్థాయి మార్పుగా మారకపోతే అది మనకు మనమే ఇచ్చుకున్న ప్రశంస మాత్రమే. అందుకే ఇకపై మనం “నేను ఏం రాశాను..?” అని అడగడం కంటే… “నేను రాసినది ఏం మార్చింది ?” అని అడగాలి. “నా పాట ఎంతమంది విన్నారు..?” కాదు… “నా పాట విన్నవాళ్లలో ఎంతమంది నిలబడ్డారు..?” “నా పోస్టుకు ఎన్ని లైకులు వచ్చాయి..?” కాదు… “నా పోస్టు తర్వాత ఎన్ని అడుగులు ముందుకు పడ్డాయి..?” ఇదే అసలు కొలమానం. మాటకు విలువ రావాలంటే… ఈ కాలంలో ప్రజలకు మరో కొత్త రకం నాయకత్వం అవసరం లేదు. వారికి నమ్మదగిన భాగస్వామ్యం కావాలి.
మాట్లాడేవాళ్లు చాలామంది ఉన్నారు. రాసేవాళ్లు చాలామంది ఉన్నారు. పాడేవాళ్లు చాలామంది ఉన్నారు. నిలబడేవాళ్లు ఎంతమంది..? అదే ప్రశ్న. ప్రజల కన్నీళ్లను కవితగా మార్చడం గొప్పదే. కానీ ఆ కన్నీళ్లు ఆగే వరకు వారి పక్కన కూర్చోవడం ఇంకా గొప్పది. అన్యాయాన్ని పాటగా మార్చడం గొప్పదే. కానీ అన్యాయం చేసే వ్యవస్థ ఎదుట బాధితుడితో కలిసి నిలబడటం ఇంకా గొప్పది. ప్రశ్నను వైరల్ చేయడం గొప్పదే.
కానీ ఆ ప్రశ్నకు సమాధానం వచ్చే వరకు పోరాడటం అసలైన బాధ్యత. గొంతులు మనకు ఉన్నాయి. మాటలు మనకు ఉన్నాయి. కలాలు మనకు ఉన్నాయి. కెమెరాలు మన చేతుల్లో ఉన్నాయి. వేదికలు మన ముందున్నాయి. ఇక కావాల్సింది ఒక్కటే… అడుగు. ఆ అడుగు ప్రజల వైపు పడాలి. ఆ అడుగు క్షేత్రం వైపు పడాలి. ఆ అడుగు సమస్య వైపు పడాలి. ఆ అడుగు పోరాటం వైపు పడాలి. లేకపోతే మన గొంతులు ఎంత గట్టిగా ఉన్నా… అవి గాలిలో కలిసిపోయే ప్రతిధ్వనులే. అందుకే ఈరోజు కవి తనను తాను అడగాలి. కళాకారుడు తనను తాను అడగాలి. రచయిత తనను తాను అడగాలి. అభ్యుదయవాది తనను తాను అడగాలి. సోషల్ మీడియా యోధుడు తనను తాను అడగాలి. నేను మాట్లాడుతున్నానా…?
లేక మార్పులో భాగమవుతున్నానా…? నేను ప్రశ్నిస్తున్నానా…? లేక ప్రశ్నను జీవిస్తున్నానా…? నేను ప్రజల గురించి రాస్తున్నానా…? లేక ప్రజలతో కలిసి నడుస్తున్నానా…? ఈ ప్రశ్నలకు మన దగ్గర నిజాయితీగా సమాధానం లేకపోతే… మన గొంతులు గట్టిగానే ఉండొచ్చు. కానీ…అడుగులు ఎక్కడ..?
— రాజేందర్ దామెర (దారా)
జర్నలిస్ట్
rajenderdamera@gmail.com
