Does ‘transformation’ mean giving a new name to the old authority…? మనిషి కొత్త మాటలు నేర్చుకోవచ్చు. కానీ కొత్త మనస్తత్వం సంపాదించడం వేరు. వేదిక మారవచ్చు. రాజకీయ భాష మారవచ్చు. నినాదాలు మారవచ్చు. కానీ ఆ మార్పుతో పాటు మనిషి తననుతాను, ఇతరులను చూసే దృష్టి మారిందా? ఇక్కడే మార్పుకు పరివర్తనకు మధ్య అసలు తేడా మొదలవుతుంది. ఆ తేడాను అర్థం చేసుకోవడానికి మనిషి తన గతంతో ఎలా సంబంధం ఏర్పడుకుంటాడో చూడాలి. మనో విజ్ఞాన శాస్త్రవేత్త కార్లు రోజర్స్ ఆలోచనలో ఒక ముఖ్యమైన భావన కనిపిస్తుంది. మనిషి తన గతాన్ని పూర్తిగా వదిలేసి కొత్తగా మొదలుపెట్టడు.పాత అనుభవాలకు కొత్త అర్థం ఇచ్చుకుంటూ తనను తాను మార్చుకుంటాడు. పరివర్తన అనేది పాతదాన్ని వదిలి కొత్తదాన్ని పలకడం మాత్రమే కాదు. పాత స్థితిని కదిలించి కొత్త విలువలను ఆచరణలోకి తీసుకువచ్చి, అది మళ్లీ పాత రూపంలోకి జారిపోకుండా ఒక కొత్త స్థితిని నిర్మించడం. రాజకీయాల్లో ఇది మరింత కఠినమైన ప్రక్రియ. ఈ ప్రమాణంతో తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ అడుగులను కూడా అర్థం చేసుకోవచ్చు. గత రాజకీయ పరిధి నుంచి బయటికి వచ్చి, కొత్త రాజకీయ వేదికను నిర్మించి ఆమె సామాజిక న్యాయం రాజకీయ పరివర్తన వంటి అంశాలను ముందుకు తీస్తున్నారు. ఇక్కడ ఆమెను గతంతోనే కొలవడం సరిపోదు. గతాన్ని పూర్తిగా పక్కన పెట్టడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి కొత్త ఆలోచనను అర్థం చేసుకోవాలంటే ఆమె ఏ రాజకీయ అనుభవం నుంచి బయటకు వచ్చారో కూడా తెలుసుకోవాలి. కొత్త మాటకు విలువ రావాలంటే అది పాత అనుభవంతో ఎలా సంభాషిస్తుందో చూడాలి.ఆ సంభాషణలో ఆమె ఎలాంటి ఆలోచన వారసత్వాన్ని తన కొత్త రాజకీయ దృష్టితో కలుపుతున్నారో గమనించడం కూడా అంతే ముఖ్యం. అదే నేపథ్యంలో చూస్తే అందులో కామ్రేడ్ మారోజు వీరన్న ఆలోచన ధోరణి కవిత ప్రస్తావించడం ఒక ముఖ్యమైన సంకేతంగా కనిపిస్తుంది. అది కేవలం ఒక వ్యక్తిని గుర్తు చేసుకోవడం కాదు. సామాజిక న్యాయం అనే ప్రశ్నకు ఉన్న ఒక దీర్ఘ రాజకీయ నేపథ్యాన్ని తన కొత్త ప్రయాణంతో అనుసంధానించే ప్రయత్నంగా కూడా చూడొచ్చు. సామాజిక న్యాయం, రాజకీయ భాగస్వామ్యం వేరువేరు అంశాలు కావు. సమాజంలో అణచివేయబడిన వర్గాలకు గౌరవం రావాలంటే వారి జీవితం గురించి మాట్లాడే స్థాయి కూడా అవసరం. అందుకే వీరన్న ఆలోచనను గుర్తుచేయడం ద్వారా కవిత తన కొత్త రాజకీయ భాషకు ఒక సామాజిక రాజకీయ స్మృతిని జోడించినట్టవుతుంది.
అయితే సామాజిక న్యాయం అనే భావన భారత రాజకీయాల్లో నిన్న పుట్టింది కాదు. దళిత బహుజన వర్గాల రాజకీయ భాగస్వామ్యాలపై అనేక రాజకీయ ప్రవాహాలు తమదైన రీతిలో ఆలోచించాయి. ముఖ్యంగా వర్గ అసమానతను అర్థం చేసుకునే మార్క్సిస్టు దృష్టికి, సామాజిక అసమానతలను కుల వ్యవస్థలో గుర్తించిన అంబేద్కర్ దృష్టికి మధ్య సంబంధాలు నిర్మించాలనే ప్రయత్నాలు వివిధ దశలలో జరిగాయి. ఈ ఆలోచన సాంప్రదాయాల మధ్య భేదాలు ఉన్నప్పటికీ, సామాజిక ఆధిపత్యాన్ని ప్రశ్నించాలనే అవసరం వాటి మధ్య సంభాషణకు కారణమైంది. కాబట్టి ఈరోజు సామాజిక న్యాయాన్ని కొత్తగా పలకడం దాని ఆవిర్భావం కాదు. అయితే ఒక భావన పాతదా కొత్తదా అన్నదానికంటే అది రాజకీయ అధికారాన్ని తాకినప్పుడు ఏ రూపం తీసుకుంటుందన్నదే ముఖ్యమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు రాజకీయ చరిత్రలోనే కొన్ని అనుభవాలు సమాధానాలుగా, మరికొన్ని హెచ్చరికలుగా మన ముందున్నాయి.
భారత సామాజిక రాజకీయ అనుభవం ఈ ప్రశ్నకు కొన్ని ముఖ్యమైన పాఠాలను మనం ముందు ఉంచుతుంది. స్వాతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ రాజకీయ స్వాతంత్రంతో పాటు సామాజిక అసమానత్వాన్ని ప్రశ్నించారు. అయినప్పటికీ “ముందు స్వాతంత్రం తర్వాత సామాజిక న్యాయం” అనే తర్కం చాలా కాలం రాజకీయ ప్రాధాన్యతను నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమంలోనూ “ముందు రాష్ట్రం తర్వాత సామాజిక న్యాయం” అనే ఆకాంక్ష ఒక తరం రాజకీయ ప్రయాణాన్ని నడిపించింది. లక్ష్యాలు వేర్వేరైనా అనుభవం మాత్రం ఒక్కటే. ప్రజల ఆశను ఒక పెద్ద రాజకీయ లక్ష్యం కోసం ముందుకు నెట్టడం. ఆ తర్వాత మిగిలిన ప్రశ్నలను వెనక్కి నెట్టడం. చరిత్రలో ఈ వాయిదా ఒకసారి జరిగితే అది అనుభవం. అదే వాయిదా ఒక రాజకీయ పద్ధతిగా మారితే అది సంస్కృతిగా మారుతుంది.
ఇప్పుడు ఇదే అనుభవం కొత్త రూపంలో మన ముందుకు వస్తుందా అన్నది అసలు ప్రశ్న. కల్వకుంట్ల కవిత సామాజిక న్యాయాన్ని రాజకీయ కేంద్రంగా ప్రకటిస్తూ కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపిన రాజకీయ అనుభవం ఆమెకు అత్యంత దగ్గరగా ఉన్న రాజకీయ నేపథ్యం, దళితుడే తొలి ముఖ్యమంత్రి అన్న హామీ ఆచరణలోకి రాకపోవడం, మాటకు అధికారానికి మధ్య ఉన్న దూరాన్ని చూపించింది. ఈ నేపథ్యం నుంచి ఇప్పుడు సామాజిక న్యాయం, రాజకీయ పరివర్తన గురించి మాట్లాడడం ఒక కొత్త అధ్యాయానికి సంకేతం కావచ్చు. కానీ ఇక్కడే గత అనుభవం ఒక ప్రశ్నగా తిరిగి వస్తుంది. గతంలో ప్రజల ఆశ ఒక లక్ష్యం కోసం వాయిదా పడినట్టే ఇప్పుడు కూడా సామాజిక న్యాయం మరో రాజకీయ లక్ష్యానికి దారి తీసే భాషగా మాత్రమే మిగిలిపోదని హామీ ఏమిటి? కొత్త రాజకీయ నినాదాన్ని ముందుకు తేవడం మార్పు కావచ్చు. కానీ పాత అనుభవం నుంచి బయటకు వచ్చిన నాయకత్వం తన రాజకీయ దృష్టిని ఎంత లోతుగా మార్చుకుందన్నదే అసలు పరీక్ష. మాట కొత్తదా అన్నదానికంటే ఆ మాట వెనుక ఉన్న మనస్తత్వం కొత్తదా అన్నదే ముఖ్యం. ఇప్పటికే ఇలాంటి రాజకీయ అనుభవాలు ఉన్నప్పటికీ కొన్ని దళిత బహుజన రాజకీయ శక్తులు ఇప్పుడు కవిత నిర్మించిన ఈ కొత్త వేదిక వైపు ఎందుకు చూస్తున్నాయి అన్నది కూడా రాజకీయ ప్రయోగానికి ఒక పరీక్షే. ఆ కొత్తదనం రాజకీయ ఆచరణలో ఎలా కనిపిస్తుంది అన్నదే తర్వాత ప్రశ్న. దళితులను ఒకే వేదిక పైకి పిలిచి మాట్లాడించడం మాత్రమే ప్రతినిధిత్వం కాదు. ఒక పార్టీ నిర్ణయాల్లో వారికి ఎంత స్థానం ఉందన్నదే అసలు ప్రతినిధిత్వం. బీసీ జనాభాను ప్రస్తావించడం మాత్రమే సామాజిక న్యాయం కాదు. అభ్యర్థుల ఎంపిక నుంచి విధానాల రూపకల్పన వరకు వారి భాగస్వామ్యం ఎంత ఉందన్నదే దాని నిజమైన కొలమానం. ఇతర అనగారిన వర్గాల సమస్యలను ప్రస్తావించడం రాజకీయ ప్రకటన కావచ్చు. వారి స్వరాన్ని నిర్ణయ ప్రక్రియలో భాగం చేయడం రాజకీయ ఆచరణ. నినాదం ఒక తలుపు తెలవగలదు. కానీ తలుపు తెరిచిన తర్వాత కూడా అధికార నిర్మాణం మారకపోతే సామాజిక న్యాయం అసంపూర్ణంగానే మిగులుతుంది.అందుకే ప్రతినిధిత్వం అనేది వేదికపై కనిపించే సంఖ్య కాదు. అధికారం నిర్మించే ప్రక్రియలో ఏర్పడే భాగస్వామ్యం.
అయితే ఈ మార్పు మనిషి లోపలికి వెళ్ళినప్పుడు దాని అర్థం మరింత స్పష్టమవుతుంది. ఆ అంతర్గత మార్పును అర్థం చేసుకొనే ఒక దృష్టి బౌద్ధతత్వంలో కనిపిస్తుంది. మనిషి పరివర్తనను బయట ప్రపంచాన్ని మార్చడంలో కాదు. ముందుగా తన దృష్టిని మార్చుకోవడంలో చూస్తుంది. మనిషి ఎలా చూస్తాడో అలా కోరుకుంటాడు. ఎలా కోరుకుంటాడో అలా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు. కవిత కొత్త రాజకీయ ప్రయాణం కూడా ఈ ప్రశ్న దగ్గరే నిలుస్తుంది. తాను మార్చాలనుకుంటున్న సమాజంలో తనలోని పాతదానికి ఎంత స్థానం మిగిలి ఉంది? పరివర్తనకు అసలు కొలమానం అక్కడే ఉంటుంది. అలాకాకుండా పాత దృష్టితో కొత్త వ్యవస్థను నిర్మిస్తే కొత్త వ్యవస్థలో పాత మనిషే తిరిగి పుడతాడు.
అయిరబోయిన బిక్షపతి (అగల్ జోయా) 79932 48717
