- ఫైర్ సేఫ్టీ, సెట్ బ్యాక్ నిబంధనలు గాలికి... బహుళ అంతస్తుల భవనం నిర్మాణం
- పట్టింపులేని మున్సిపల్ అధికారులు
Illegal construction on the vegetable market street హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని కూరగాయల మార్కెట్ వీధి, అమరవీరుల భవనం ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఒక బహుళ అంతస్తుల భవన నిర్మాణం ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ నిబంధనలను బేఖాతరు చేస్తూ, అధికారుల కళ్లముందే ఈ అక్రమ కట్టడం వెలుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.
- నిబంధనలన్నీ తుంగలోకి..
సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణం చేపట్టాలంటే మున్సిపల్ అనుమతులు తప్పనిసరి. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనం నిర్మించేటప్పుడు చుట్టూ కొంత ఖాళీ స్థలం (సెట్ బ్యాక్) వదలాలి. కానీ, అమరవీరుల భవనం ఎదురుగా నిర్మిస్తున్న ఈ భవనం నిర్మణం అవేమీ పట్టించుకోకుండా, రోడ్డును ఆనుకొని భారీ ఎత్తున నిర్మాణం చేపడుతుండటం బహిరంగ రహస్యమే. ఇప్పటికే రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ వీధి కావడంతో, సరైన సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న ఈ భవనం వల్ల భవిష్యత్తులో వాహనాల రాకపోకలకు, పార్కింగ్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. పట్టణంలోని అత్యంత కీలకమైన ప్రాంతంలో, అందరికీ కనిపించేలా ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్నా.. సంబంధిత మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, తక్షణమే సదరు భవన నిర్మాణాన్ని పరిశీలించాలని, నిబంధనల ఉల్లంఘన జరిగి ఉంటే తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
