RTC strike Sacrifices are not the solution Struggle is the way : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఇప్పుడు విషాద ఛాయల్లో చిక్కుకుంది. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి, చికిత్స పొందుతూ మరణించడం అత్యంత బాధాకరం. తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కిన ఒక సామాన్య కార్మికుడు, ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటు. అయితే, ఈ ఘటన సమ్మె దిశను మార్చడమే కాకుండా, కార్మిక లోకం తమ పోరాట పంథాను పునరాలోచించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
RTC strike – Sacrifices are not the solution.. Struggle is the way..!
సమ్మె ప్రారంభమై కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలోనే ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన రావడం వెనుక ఉన్న తీవ్ర అసహనం ఆందోళన కలిగిస్తోంది. ఏ పోరాటమైనా చర్చల ద్వారా లేదా సుదీర్ఘ నిరసనల ద్వారా గెలవాలి. కానీ, గంటల వ్యవధిలోనే ఓర్పు నశించి, బస్టాండ్ల సాక్షిగా ప్రాణాలు తీసుకోవడం అనేది అత్యంత అనాలోచిత చర్య. ఆత్మహత్య అనేది ఏ సమస్యకూ పరిష్కారం కాదు. అది కేవలం ఆ కుటుంబాలను వీధిన పడేసే బలహీనత మాత్రమే. ఈ రకమైన ‘చావు’ లేదా ఎమోషనల్ వల్ల ఉద్యమం పట్ల ఉన్న సామాన్య ప్రజల సానుభూతి, కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం పోరాడటం రాజ్యాంగబద్ధమైన హక్కు. సమ్మెకు ప్రజా మద్దతు, రాజకీయ పార్టీల సపోర్ట్ క్రమంగా పెరుగుతున్న తరుణంలో.. ఇలా బలవన్మరణాలకు పాల్పడటం ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. భావోద్వేగాలకు లోనై ప్రాణాలు తీసుకుంటే ప్రభుత్వాలు దిగివస్తాయని భావించడం భ్రమ. ఇటువంటి చర్యల వల్ల సమ్మె రాజకీయ రంగు పులుముకుంటుంది. అది అరాచకత్వంగా మారుతుంది. కార్మికులు తమ శక్తిని ఐక్యమత్యంలో చూపించాలే తప్ప, పెట్రోల్ డబ్బాలలో కాదు.
RTC strike – Sacrifices are not the solution.. Struggle is the way..!
మరోవైపు, ప్రభుత్వం కూడా ఈ మరణాలకు నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. వేల కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సమ్మెను పరిష్కరించడంలో జాప్యం చేయడం వల్ల కార్మికుల్లో అభద్రతా భావం పెరుగుతోంది. పాలకుల మొండివైఖరి, చర్చలకు సానుకూలత లోపించటం వంటి చర్యలు కార్మికులను తీవ్ర నిరాశలోకి నెడుతున్నాయి. ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళాడంటే, వ్యవస్థలో సంభాషణలు లోపించాయని అర్థం. ప్రభుత్వం తక్షణమే ఈగోలను పక్కనపెట్టి, మానవీయ కోణంలో స్పందించి చర్చలకు సానుకూలతవైపు అడుగులు వేయాలి. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలి. చావు దేనికీ పరిష్కారం కాదు. మీ ప్రాణం మీ కుటుంబానికి, ఆర్టీసీకి ఎంతో అవసరం. ఆవేశంతో ఊగిపోయి చేసే ఇటువంటి విపరీత ధోరణుల వల్ల ఉద్యమ లక్ష్యం పక్కదారి పట్టి, ముందే చెప్పినట్లుగా రాజకీయ రంగు పులుముకుంటుంది. నాయకత్వం వహిస్తున్న వారు కూడా కార్మికులకు ధైర్యం చెప్పాలే తప్ప, వారిని భావోద్వేగాల ఊబిలోకి నెట్టకూడదు.
RTC strike – Sacrifices are not the solution.. Struggle is the way..!
శంకర్ గౌడ్ మృతికి సంతాపం ప్రకటిస్తూనే, కార్మికులందరికీ ఒకటే విన్నపం.. మీ పోరాటం శాంతియుతంగా, పటిష్టంగా ఉండాలి. ఆత్మహత్యాయత్నాల వంటి చర్యలను వీడి, వివేకంతో అడుగువేయండి. సంకల్పం ఉన్నచోట విజయం లభిస్తుంది, ఆవేశం ఉన్నచోట వినాశనమే మిగులుతుంది. ప్రభుత్వం కళ్లు తెరిచేలా నిరసన తెలపండి కానీ, ఆత్మహత్యల వైపు ఆలోచించకండి.
ఐక్యమత్యమే మహాబలం – ఆత్మహత్య మహా బలహీనత..! అని గ్రహించండి.
రాజేందర్ దామెర (దారా)
Editor in chief
jananirnayam.com
