దెబ్బతింటున్న డిసిప్లిన్ – అనాలోచిత చర్యలతో బజారున పడుతున్న ఆర్టీసీ గౌరవం..!
‘Death’ of intelligence under the guise of RTC ‘strike’ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె సెగలు పుట్టిస్తోంది. కార్మికులు తమ డిమాండ్ల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ, ఆ పోరాట పంథా ఇప్పుడు పక్కదారి పట్టి, అసహనం, అనాలోచిత చర్యల వైపు మళ్లుతోంది. నర్సంపేటలో ఓ డ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం, అచ్చం ఇలాంటి ఘటనే నల్గొండలోనూ చోటుచేసుకోవడం చూస్తుంటే.. ఇది కార్మికుల ఆవేదన కంటే కూడా వారి ‘బలుపెక్కిన ప్రక్రియ’, ‘దుందుడుకు స్వభావాన్నే’ ప్రతిబింబిస్తోంది. సమ్మె ప్రారంభమై కేవలం రెండు రోజులు కూడా గడవకముందే ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన రావడం వెనుక ఉన్న మతలబు ఏమిటి..? ఏ చర్చలైనా, పరిష్కారాలైనా కొంత సమయం తీసుకుంటాయి. కానీ, గంటల వ్యవధిలోనే ఓర్పు నశించి, బస్టాండ్ల సాక్షిగా పెట్రోల్ డబ్బాలతో ప్రత్యక్షమవ్వడం వెనుక పక్కా రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ఒక రకమైన ‘ఎమోషనల్ బ్లాక్మెయిల్’. చస్తామని బెదిరించి కార్యసాధన చేయాలనుకోవడం పిరికిపందల చర్యే తప్ప, ఉద్యమకారుల లక్షణం కాదు. ఇటువంటి దద్దమ్మల వల్లే ఒక పవిత్రమైన కార్మిక పోరాటం కాస్తా అపహాస్యానికి గురవుతోంది.
‘Death’ of intelligence under the guise of RTC ‘strike’..!?
ఆర్టీసీ కార్మికులకు సమాజంలో ఒక గౌరవం ఉంది. కానీ, ఇలాంటి విపరీత ధోరణుల వల్ల ఆ గౌరవం కాస్తా గంగలో కలిసిపోతోంది. సమ్మెలో తమ శక్తిని చూపించాల్సింది పోయి, బలహీనతను ఆత్మహత్యాయత్నాల రూపంలో ప్రదర్శించడం వల్ల మొత్తం ఆర్టీసీ కార్మికుల పరువు పోతోంది. కేవలం రెండు రోజుల సమ్మెకే ఈ రేంజ్ లో అసహనం ప్రదర్శిస్తే, భవిష్యత్తులో వచ్చే క్లిష్ట పరిస్థితులను వీరు ఎలా ఎదుర్కొంటారు..? ఆవేశంతో ఊగిపోయి పెట్రోల్ పోసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు సదా.. సమ్మె తీవ్రత తగ్గి, అది అరాచకత్వంగా మారుతుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆర్టీసీ సమ్మెను కావాలనే రాజకీయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కార్మికుల భావోద్వేగాలను అడ్డం పెట్టుకుని, వారిని ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్న శక్తులు ఎవరో గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అనాలోచిత దుందుడుకు చర్యల వల్ల సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగడమే కాకుండా, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన ఉద్యోగులుగా ఉండాల్సిన వారు, రోడ్ల మీద ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటం వారి ఆలోచనా రాహిత్యానికి పరాకాష్ట.
ఆర్టీసీ కార్మికులు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలి. చావు అనేది దేనికీ పరిష్కారం కాదు. ఆత్మాహుతి ప్రయత్నాలు ఉద్యమ పటిమను పెంచవు, కేవలం పక్కదారి పట్టిస్తాయి. ఇలాంటి ‘దద్దమ్మ’ పనులు మానుకుని, చర్చల ద్వారా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేయాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి మరెన్నో మార్గాలు ఉన్నాయి. కానీ, చస్తామని చెప్పి సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయడం, సమ్మెను అరాచకంగా మార్చడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇకనైనా ఆవేశాన్ని పక్కనపెట్టి, వివేకంతో వ్యవహరించకపోతే ఆర్టీసీ కార్మికుల చరిత్రలో ఇదొక నల్లని అధ్యాయంగా మిగిలిపోతుంది.
రాజేందర్ దామెర (దారా)
editor in chief
jananirnayam.com
