- “రొట్టె సురేష్”కు శ్రద్దాంజలి
Tribute to an untouchable lover Tribute to “Rotte Suresh” “ఒకే ఊరిలోనే పుట్టాం. ఈ ఊరి శివారు మట్టిలోనే కలిసిపోయాం. ప్రియతమా… నన్ను ఈ మట్టిలో పూడ్చిపెడుతుంటే నువ్వు నన్ను వాటేసుకున్నట్లే ఉంది. బహుశా తమ్ముడు రొట్టె సురేష్ ను సమాధి చేస్తుంటే తన నుంచి తనకంటే ముందుగానే ఆ మట్టిలో కలిసిపోయిన తన జీవితభాగస్వామి గుంచి తమ్ముడు సురేష్ ఆత్మ అనుకుందేమో…
*************
నేను ఆత్మలను, పరలోకాలను అంతగా నమ్మను కానీ, తమ్ముడు “రొట్టె సురేష్” అకాలమరణం చెంది ఆ మట్టిలో కలిసిపోతుంటే నా మదిలో ఆ భావన కలిగింది. ఒక్కసారిగా తన మూలల్లోకి కాస్త తొంగిచూసేలా చేసింది. డిసెంబర్ 13, 2025న రోడ్డు యాక్సిడెంట్ లో మృతిచెందిన సురేష్ మరణవార్త కలిచివేసింది నన్ను. జీవించినకాలంలో తన ఆచరణ కొందరికి నచ్చొచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు. ఇది సహజమైన అంశం. అయితే చనిపోయిన మనిషి గురించి మనం కాస్త స్మరించుకోవడం నైతికత. సురేష్ అంతిమయాత్రలో పాల్గొన్నప్పటి నుంచి తనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నాలుగు మాటలు రాయాలని అనుకున్నప్పటికి పని ఒత్తిడివల్ల సాధ్యం కాలేదు. ఈనెల 24న తన దశదినకర్మ ఉన్న నేపథ్యంలో ఈ నాలుగు మాటలు తనగురించి చెప్పాలని అనుకుంటున్న. నా మాటలు తనను ఎరిగినవారికి ఏకీభావం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ మన నుంచి దూరమైన మనిషిని మనం మంచిచెడులను బేరీజుచేస్తూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం.
Tribute to an untouchable lover Tribute to “Rotte Suresh”
నేను ముందే చెప్పినట్లుగా తమ్ముడు రొట్టె సురేష్ జీవిత ప్రయాణాన్ని కాస్తయినా అర్థం చేసుకోవాలంటే తన మూలాల్లోకి ఒకసారి తొంగిచూడాలి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం అర్షనపెల్లి ఆ ఊరు. అదో చిన్న ఊరు. జనాభాతక్కువే అయినా ఆ తక్కువ జనాభాలోనూ మాలమాదిగల కలయిక ఎక్కువభాగం కలిగిన ఊరు. ఒకరకంగా ఆ ఊరికి సామాజిక చైతన్యం ఎక్కువే. అభ్యూదయ ఆలోచనలు కలిగిన మనుషులు పుట్టిన ఊరు అది. చరిత్రలో ఆ ఊరికి అంతగా గుర్తింపు లేకపోయినా భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా ఆ ఊరి చరిత్ర ఉంటుంది అనే ఊరు అది. అనేక తరాలు పుట్టి పెరిగి కనుమరుగైన తరువాత ఓ తరంలో (సుమారు 30 ఏండ్ల క్రితం) మాదిగ కులంలో పుట్టాడు రొట్టె సురేష్. అర్శనపల్లి అనే ఆ ఊరి నుంచి వివిధ రంగాల్లో రానిస్తున్నవారూ లేకపోలేదు. వివిధ వృత్తుల్లోనూ ఉన్నారు. ఆ ఊరి నుంచి న్యాయవాద వృత్తిలోనూ, పాత్రికేయ వృత్తలోనూ, ఇతరాత్రా వృత్తుల్లోనూ, స్వయం వృత్తుల్లోనూ తమతమ వృత్తుల్లో కొనసాగుతున్న వారూ ఉన్నారు. ఎవరు ఎలాంటి వృత్తుల్లో, వివిధ రంగాల్లో రానిస్తున్నప్పటికీ అంతిమంగా ఎంతోకొంత ఒక తరం మాత్రం అభ్యూదయ భావజాలం, చైతన్యవంతమైన ఆలోచన కలిగిన మనుషులను కన్న ఊరు అర్షనపల్లి అనేది నా భావన. అలాంటి ఊరిలో ఎదుగొచ్చిచ్చే తరంలో అనుకోకుండా యాక్సిడెంట్ లో మృతి చెంది మన నుంచి దూరం అయిన వ్యక్తి రొట్టె సురేష్.
సమాజంలోని రుగ్మతలను ఎండగట్టే కలం ఒకవైపు.. సామాజిక కట్టుబాట్లను ఎదిరించిన సాహసం మరొకవైపు..ఈ వైరుధ్యం అర్శనపల్లిలోనూ అతీతం కాదు కదా..? అది అనివార్యంగానే కుల అసమానతలు, కట్టుబాట్లు కూడా అర్శనపల్లి ఊరిలోనూ లేదంటే పొరపాటే అవుతుంది. ఆ ఊరిలో కులాంతర వివాహం సంరేష్ చేసున్నాడు. మల కులానికి చెందిన అమ్మాయిని మాదిగ కులానికి చెందిన సురేష్ వివాహం చేసుకున్నాడు. దీనికి ప్రతిఫలంగా బహిష్కరణకు గురయ్యింది ఆ జంట. ఆ జంటే కాదు ఆ కుటుంబం కూడా. ఊరి నుంచి వలస జీవితం కూడా తప్పలేదు. ముందే చెప్పినట్లుగా అభ్యుదయ కాముకులు ఎక్కువగా ఉన్న గ్రామం కదా… ఓ ఆలోచనపరుడు ఆలోచించకుండా ఉంటాడా..? వారి చొరవతో ఊరి చెంతకు చేరింది ఆ కుటుంబం. ఈ నేపథ్యంలో కాలక్రమేణా కొంత బెటర్ లైఫ్ ను లీడ్ చేస్తున్న సురేష్ కుటుంబంలో కరోనా కాలంలో తన జీవిత భాగస్వామి అనారోగ్యంతో ఈలోకాన్ని వీడింది. బహుశా నాలుగైదు ఏండ్లలో సురేష్ ప్రమాదవశత్తు యాక్సిడెంట్ లో మృతి చెందాడు. ( ఈ మరణం పట్ల కూడా తమ కుటుంబ సభ్యులకు, మరి కొంయమందికి అనుమానాలు లేకపోలేదు ) ఇది ఆ కుటుంబానికి తీరని లోటు, ఆ పిల్లలకు పూడ్చలేని భరోసా ఇవ్వల్లేని అంశం. ఈ మధ్యకాలంలోనే తను జర్నలిస్ట్ గా తమదైన శైలిలో గుర్తింపు పొందాడు. ఇతరుల స్పూర్తితో న్యాయవాది వృత్తిని చేపట్టాలని అనుకున్నాడో ఏమో “లా” చదువు కూడా చదివాడు. ఊహించని విధంగా అందిరికి దూరమైనాడు. ఈ ఘటన తనను దగ్గరగా చుసిన, తనను దగ్గరగా ఎరిగిన వారికి జీర్ణం కాని అంశంగా మారింది. ఒకరకంగా నిరంతర పోరాటం సురేష్ చేశారనేది తన జీవిత ప్రయానాన్ని దగ్గరగా చూసేవారికి అర్థం అవుతుంది. ఆయన అకాల మరణం ఆయనను భౌతికంగా మనకు దూరం చేసినా, ఆయన ఆ ఊరిలో చేసిన సామాజిక యుద్ధం చిరస్మరణీయం.
ఎందుకంటే కులాంతర వివాహం చేసుకున్నందుకు సమాజం నుండి, సొంత మనుషుల నుండి ఒకరకంగా బహిష్కరణకు గురైనా ఆయన వెరవలేదు. మాలమాదిగల మధ్యలోనే ఈ అంతరాన్ని ఫూడ్చలేని మాల, మాదిగల ఐక్యత ఏపాటిదో మాలమాదిగల మహానేతలను ప్రశ్నిస్తోంది..? “ప్రేమకు కులం లేదు, మనిషికి మతం లేదు” అని చాటిచెప్పేలా నిజమైన ‘అంటరాని ప్రేమికుడిగా’ ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా తనను ఎరిగి తన జీవితంలోకి తొంగిచూసే వారికి అర్థం అవుతాడాయన. సురేష్ పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, సామాజిక శిక్షను అనుభవిస్తూనే, ఆత్మాభిమానంతో బతికిన వ్యక్తి సురేష్ అనేది గుర్తించకుంటే సామాజిక స్పృహ కలిగిన మనుషుల అభిప్రాయం తప్పే అవుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
Tribute to an untouchable lover Tribute to “Rotte Suresh”
ఐదేళ్ల క్రితం తన జీవిత భాగస్వామిని అనారోగ్యంతో కోల్పోవడం ఆయనను తీవ్రంగా కలచివేసింమో…తోడు నీడగా నిలిచిన సతీమణి మరణం ఆయన జీవితంలో తీరని లోటును మిగిల్చిందేమో…తన మానసిక స్థితిని అర్థం చేసుకునే పరిస్థితి తన మూలాల్లోకి తొంగి చూస్తేనే కాస్తంత అర్థం అవుతుంది. ”బహిష్కరణకు భయపడలేదు.. ఒంటరితనానికి లొంగలేదు.. కానీ మృత్యువు రూపంలో వచ్చిన ప్రమాదం ఆయనను అందరికీ దూరం చేసింది. ముఖ్యంగా తమ పిల్లలకు తీరని లోటును మిగిల్చింది. ఆ ఊరిలో మాలమాదిగ వివాహబంధాన్ని ఎలా పరిగనించారో… తమ మరణాలప్పుడు ఎలా ఆ ఊరు వ్యవహరించిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్న. అది తనను ఎరిగిన ఆ ఊరికి, తనను ఎరిగిన అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే. ఇతరాత్ర అంశాలు పక్కనపెడితే ”కులాంతర వివాహం చేసుకొని వివక్షను ఎదిరించి, ఒంటరి పోరాటం చేసిన సురేష్ నా దృష్టిలో ‘అంటరాని ప్రేమికుడే’. మనం ఇచ్చే నిజమైన నివాళి.. ఆయన బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే”. ఆ ఊరి నుంచి సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ రొట్టె సురేష్ కుటుంబానికి అండగా, సంఘీభావగా ఉండాల్సిన వససరం ఉంది. తమ్ముడు రొట్టె సురేష్ అనుమానాలు ఉన్నప్పటికీ యాక్సిడెంట్ లో మృతిచెందటం విషాదకరం, ఆయనకు శ్రద్ధాంజలి. ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం.
- రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
సెల్ : 94930 87222
