- చనిపోయింది శరీరమే… గద్దర్ కాదు
Gaddar has not yet set : ఒక మనిషి చనిపోవచ్చు. ఒక నాయకుడు చరిత్రలో కలిసిపోవచ్చు. ఒక కళాకారుడు కాలగర్భంలో మరుగునపడిపోవచ్చు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం కాలాన్ని దాటి ప్రజల జ్ఞాపకాలలో, వారి గొంతుల్లో, వారి పోరాటాల్లో సజీవంగా నిలిచిపోతారు. గద్దర్ అలాంటి అరుదైన వ్యక్తి. ఆయన మరణించి మూడేళ్లు కావొస్తున్నా, గద్దర్ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పటికీ “ఉండేవాడు” అనే భాష కంటే “ఉన్నాడు” అనే భాషే సహజంగా నోటి మీదకు వస్తుంది. ఎందుకంటే గద్దర్ అనేది ఒక వ్యక్తి కాదు; ఒక ప్రజా చైతన్యం. ఒక గానం. ఒక ప్రతిఘటన. ఒక సాంస్కృతిక శక్తి. గద్దర్ మరణించిన రోజు నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. ఆ వార్త వినగానే చుట్టూ ఒక విచిత్రమైన నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దం నాదొక్కదే కాదు; లక్షలాది మంది మనసుల్లో అదే మౌనం దిగివచ్చింది. ఆ రోజు మా మండల కేంద్రంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పటికీ నా మనసులో చెరగని ముద్రగా నిలిచింది. గద్దర్‌కు నివాళి అర్పించేందుకు ఒక యువకుడు ఒక్కరే ఫొటోతో చౌరస్తాలో నిలబడ్డాడు. కాసేపటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు, దళిత సంఘాల కార్యకర్తలు, సాధారణ ప్రజలు రాజకీయాలకు అతీతంగా అక్కడికి చేరుకుని గద్దర్‌కు నివాళులర్పించారు. అప్పుడు నాకు అర్థమైంది…
గద్దర్‌ను రాజకీయ పార్టీలతో కొలవలేం. ఆయనను సిద్ధాంతాల గోడల మధ్య బంధించలేం. ఆయనను ప్రజలు తమ మనిషిగా స్వీకరించారు. నా బాల్య జ్ఞాపకాలలో కూడా గద్దర్ ఉన్నాడు. మా ఇంట్లో తెల్లవారుజామున టేప్ రికార్డర్లో వినిపించేది ఆయన గొంతే. “సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో…”, “నిండూ అమాసనాడు…”, “తల్లి లాగెను నాకుతుంటే…” వంటి పాటలే నా బాల్యానికి జోలపాటలు. ఆ పాటల అర్థం అప్పుడు తెలియదు. కానీ ఆ గొంతు మాత్రం హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అదే గద్దర్ అసలు శక్తి. పాటను కేవలం వినోదంగా కాకుండా, ప్రజల జీవిత భాషగా మార్చిన కళాకారుడు ఆయన. తెలంగాణ గ్రామాల్లో రైతుకూలీల గుడిసెల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఒకే గొంతు మార్మోగిందంటే అది గద్దర్‌దే. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రను రాస్తే గద్దర్‌ను దాటేసి ఒక్క అధ్యాయమూ పూర్తికాదు. ఉద్యమాలకు రాజకీయ నాయకత్వం ఎంత అవసరమో, సాంస్కృతిక నాయకత్వం కూడా అంతే అవసరమని చరిత్ర చెబుతుంది. ఆ సాంస్కృతిక నాయకత్వానికి గద్దర్ చిరునామా. ఆయన జీవితంలో రాజకీయ మలుపులు వచ్చాయి. విప్లవ రాజకీయాల నుంచి పార్లమెంటరీ రాజకీయాల వైపు నడిచారు. ఆ మార్పును కొందరు విమర్శించారు. మరికొందరు సమర్థించారు. కానీ చరిత్ర ఒక మనిషిని అతని చివరి రాజకీయ నిర్ణయంతో తీర్పు చెప్పదు.
అతను సమాజంపై వేసిన చెరగని ముద్రతో తీర్పు చెబుతుంది. ఆ కొలమానంలో చూస్తే గద్దర్ ఒక మహోన్నత ప్రజా కళాకారుడు.
ఒక తరం చేతిలో డప్పు పెట్టాడు. మరో తరం గొంతులో పాట పెట్టాడు. ఇంకో తరం గుండెల్లో ఆత్మగౌరవాన్ని నాటాడు. అదే ఆయన అసలైన వారసత్వం. ఈరోజు పాటలు కోట్ల వ్యూస్ కోసం పుడుతున్న కాలం. రెండు రోజుల ట్రెండ్ కోసం తయారవుతున్న కాలం. అలాంటి సమయంలో ఐదు దశాబ్దాల తర్వాత కూడా ఒక పాట ప్రజల గొంతులో బతికుంటే, అది కళాకారుడి విజయానికి కాదు, అతని చారిత్రక అవసరానికి నిదర్శనం. గద్దర్ అదే సాధించాడు. ఆయన పాటలో బాధ ఉంది. ఆయన గానంలో ఆవేదన ఉంది. ఆయన పద్యంలో తిరుగుబాటు ఉంది. ఆయన స్వరంలో తల్లి ఉంది. ఆయన ఊపిరిలో మట్టి ఉంది. ఆయన ఆలోచనలో అణగారిన మనిషి ఆత్మగౌరవం ఉంది. అందుకే గద్దర్‌ను కేవలం విప్లవ గాయకుడిగా చెప్పడం ఆయనను చిన్నచూపు చూడడమే అవుతుంది.
ఆయన ఒక ప్రజా సాంస్కృతిక విశ్వవిద్యాలయం. ఈరోజు ప్రజా సాంస్కృతిక ఉద్యమం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. మార్కెట్ సంస్కృతి, సోషల్ మీడియా వేగం, రాజకీయ ధ్రువీకరణల మధ్య ప్రజా కళ తన అసలు లక్ష్యాన్ని కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో గద్దర్‌ను కేవలం జయంతి, వర్ధంతి సభలకు పరిమితం చేయడం ఆయనకు చేసే అతిపెద్ద అన్యాయం. ఆయన పాటను అధ్యయనం చేయాలి. ఆయన భాషను పరిశోధించాలి. ఆయన ప్రజలతో ఏర్పరచుకున్న బంధాన్ని కొత్త తరం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గద్దర్ అసలు వారసత్వం విగ్రహాల్లో లేదు. పాటల్లో ఉంది. ప్రజల్లో ఉంది. ప్రతిఘటనలో ఉంది. సామాజిక న్యాయం కోసం వినిపించే ప్రతి గొంతులో ఉంది. ప్రహ్లాదుడి కథ ఉన్నంతకాలం విశ్వాసం బతికినట్టే… స్పార్టకస్ కథ ఉన్నంతకాలం తిరుగుబాటు బతికినట్టే… ఈ నేలపై దోపిడీ ఉన్నంతకాలం…ఈ సమాజంలో అన్యాయం ఉన్నంతకాలం…ఈ ప్రపంచంలో పాట ఉన్నంతకాలం…గద్దర్ ఇంకా అస్తమించడు. ఎందుకంటే…చనిపోయింది శరీరమే… గద్దర్ కాదు.
– రాజేందర్ దామెర (దారా)
rajenderdamera@gmail.com
