- అధికారులు మారినా… పేర్లు మాత్రం మారవా.!?
Lethargy regarding ‘boards’ at the Tahsildar’s office : ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంచాల్సిన పాలకులు, అధికారులు కనీస బాధ్యతను కూడా మరుస్తున్నారు. హనుమకొండ జిల్లా దామెర మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు మారుతున్నా… కుర్చీల్లో కొత్త ముఖాలు కొలువుదీరుతున్నా… గోడలపై ఉన్న నేమ్బోర్డులు, సమాచార ఫలకాలు మాత్రం పాత చరిత్రనే నెమరువేస్తున్నాయి!
- గుర్తించడంలో ప్రజల అవస్థలు
బదిలీలపై పాత అధికారులు వెళ్ళిపోవడం, వారి స్థానంలో కొత్తవారు బాధ్యతలు స్వీకరించడం సహజం. కానీ, నెలలు గడుస్తున్నా కార్యాలయంలోని నేమ్బోర్డులు, ప్రదర్శనా ఫలకాలపై పాత అధికారుల పేర్లే దర్శనమివ్వడం పట్ల ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే సామాన్య ప్రజలు, రైతులకు అసలు ఏ బాధ్యతలో ఎవరు ఉన్నారో తెలియక అయోమయానికి గురవుతున్నారు. సరైన అధికారిని గుర్తించలేక కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- పారదర్శకతకు పెద్ద పీట ఏది..?
ప్రభుత్వ సర్వీసులు, పారదర్శకత, జవాబుదారీతనం గురించి గొప్పలు చెప్పే పాలనలో… కనీసం పేరు బోర్డులు మార్చకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి, నిర్లక్ష్యానికి అద్దం పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైకి ఇది చిన్న విషయంగా కనిపించినప్పటికీ, ప్రజలకు సేవలు అందించడంలో మరియు సమాచార సేకరణలో పెద్ద ఆటంకంగా మారుతోంది.
- తక్షణమే నవీకరించాలి
ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, తహసీల్దార్ కార్యాలయంలోని అన్ని నేమ్బోర్డులు, సమాచార ఫలకాలను ప్రస్తుత అధికారుల వివరాలతో నవీకరించాలని (అప్డేట్ చేయాలని) దామెర మండల ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
