- బీఆర్ఎస్ నేత నక్క చిరంజీవి
NEET Leak: Union Minister’s Resignation is a Victory for the People : నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థ సాధించిన విజయమని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా నాయకుడు నక్క చిరంజీవి అన్నారు. శనివారం పరకాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పరీక్షలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాస్వామ్యవాదుల పోరాటాలు, తీవ్ర నిరసనల ఫలితంగానే కేంద్ర మంత్రి దిగిరాక తప్పలేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం రాజీనామాతోనే ఈ వ్యవహారం ముగిసిపోలేదని, లీకేజీకి బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో సంపూర్ణ జవాబుదారీతనం, పారదర్శకత తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
