Is the ‘Leaks’ in the Red Fort a virus theory..? Is it a fight over personal agendas..? : భారతదేశ రాజకీయ పటంలో కమ్యూనిస్టు పార్టీలకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అది ‘డెమోక్రటిక్ సెంట్రలిజం’ (ప్రజాస్వామ్య కేంద్రకృతం). పార్టీ లోపల ఎంత చర్చ అయినా జరగవచ్చు, కానీ ఒక్కసారి నిర్ణయం జరిగిన తర్వాత అది ఉక్కుకవచంలాంటి క్రమశిక్షణతో అమలు కావాలి. కానీ, తెలంగాణ సీపీఎంలో గత పదేళ్లుగా చోటుచేసుకున్న పరిణామాలు, తాజాగా మాజీ రాష్ట్ర కార్యదర్శి సహా మరో ఇద్దరు కీలక నేతలపై కేంద్ర కమిటీ తీసుకున్న ‘అభిశంసన’ నిర్ణయం ఆ పార్టీ పునాదులనే ప్రశ్నిస్తున్నాయి. సిద్ధాంతం ముసుగులో సాగిన వ్యక్తిగత ఆధిపత్యం, పార్టీ నిర్మాణాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసిందో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Is the ‘Leaks’ in the Red Fort a virus theory..? Is it a fight over personal agendas..?
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో సీపీఎం పటిష్టమైన శక్తిగా ఎదుగుతుందని ఆశించిన కార్యకర్తలకు నిరాశే మిగిలింది. గత పదేళ్లలో పార్టీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, ముఖ్యంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (BLF) ప్రయోగం, ఎన్నికల పొత్తుల విషయంలో అస్పష్టత, పార్టీని క్షేత్రస్థాయిలో దెబ్బతీశాయి. అయితే, ఇవన్నీ కేవలం రాజకీయ వ్యూహ కర్తలు చేసిన తప్పులే అనుకుంటే పొరపాటే. పార్టీ రాష్ట్ర మహాసభల్లో కార్యదర్శి ఎన్నిక సందర్భంగా జరిగిన పైరవీలు, గ్రూపు రాజకీయాలు కమ్యూనిస్టు నైతికతకే మచ్చ తెచ్చాయి. కేంద్ర కమిటీ తన అభిశంసన తీర్మానంలో ‘పదేళ్ల పెడధోరణుల’పై రెండు గ్రూపుల తగాదాల నేపధ్యంలో ఇలాంటి చర్యలకు సిద్దపడటం జరిగిందంటే, అది కేవలం ఒక వ్యక్తి తప్పు కాదు, ఆ నాయకత్వం అనుసరించిన అప్రజాస్వామిక పద్ధతులపై ఇచ్చిన ఛార్జ్‌షీట్ గా చూడక తప్పదు.
Is the ‘Leaks’ in the Red Fort a virus theory..? Is it a fight over personal agendas..?
అయితే అభిశంసనకు గురైన మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు కేంద్ర కమిటీ వేటు వేయడం వెనుక ఒక పెద్ద తార్కిక సందేహం కలుగుతుంది. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ప్రతి ప్రధాన నిర్ణయం, పొత్తులు కావచ్చు, సామాజిక ప్రయోగాల రిత్య ఏర్పాటు చేసిన BLF కావచ్చు, పై స్థాయి కమిటీల పర్యవేక్షణలోనే జరుగుతాయి. రాష్ట్ర కార్యదర్శి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేనప్పుడు, ఆయా సందర్భాల్లో అంగీకరించిన కేంద్ర నాయకత్వం, ఇప్పుడు వాటిని ‘పెడధోరణులు’గా ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం…? అనే ప్రశ్నలు ఉత్పన్నమవకుండా ఎలా ఉంటాయి..? ఒక నిర్ణయం విఫలమైనప్పుడు దానికి కేవలం రాష్ట్ర కార్యదర్శిని మాత్రమే బాధ్యుడిని చేయడం ‘సామూహిక బాధ్యత’ అనే పార్టీ సూత్రానికి విరుద్ధం కాదా..? అప్పుడు ఆమోద ముద్ర వేసిన వారు ఇప్పుడు న్యాయమూర్తులుగా మారి తీర్పు చెప్పడం కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టించడం కాక ఏమోతుందో ఆ పార్టీకే తెలియాలి.
Is the ‘Leaks’ in the Red Fort a virus theory..? Is it a fight over personal agendas..?
సమాచార లీకేజీ – చైతన్యమా..? దివాలాకోరుతనమా..?
ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత విచారకరమైన, ప్రమాదకరమైన అంశం ‘పార్టీ అంతర్గత చర్చల లీకేజీ’. పార్టీ కేంద్ర కమిటీ తీర్మానం అధికారికంగా కింది స్థాయికి చేరకముందే, ఉన్నత స్థాయి కమిటీలో ఎవరు ఏమన్నారు..? ఎవరిని ఎలా మందలించారు..? అనే వివరాలు మీడియాకు చేరడం వెనుక ఉన్న ‘అదృశ్య హస్తాలు’ ఎవరివి..? అనేది ఆ పార్టీ సమీక్షించుకోవాల్సిన అంశం ప్రశ్నించుకోవాల్సిన అంశం కూడా. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ రహస్యాలను శత్రువులు కూడా రాబట్టలేకపోయేవారు. కానీ నేడు స్వయంగా ఉన్నత స్థాయి నేతలే సమాచారాన్ని బయటకు పంపుతున్నారంటే, అక్కడ పార్టీ పట్ల విధేయత కంటే ప్రత్యర్థులను దెబ్బతీసే కుట్రలే ప్రధానమయ్యాయని అర్థమవుతోంది. పార్టీ పట్ల కనీస అవగాహన, బాధ్యత ఉన్న ఏ నాయకుడూ అంతర్గత విషయాలను బజారున పెట్టడు. అలా చేస్తున్నారంటే, వారి రాజకీయ చైతన్య స్థాయి అత్యంత దిగువకు పడిపోయిందని చెప్పక తప్పదు. ఇది కేవలం క్రమశిక్షణ ఉల్లంఘన మాత్రమే కాదు, పార్టీ ఉనికిని పణంగా పెట్టే ‘నమ్మక ద్రోహం’మే అవుతుంది.
Is the ‘Leaks’ in the Red Fort a virus theory..? Is it a fight over personal agendas..?
కేంద్ర కమిటీ చర్యలు కేవలం ముగ్గురు వ్యక్తులకు పరిమితమైతే ప్రయోజనం లేదు. ఇది మొత్తం రాష్ట్ర నాయకత్వానికి ఒక హెచ్చరిక కూడా కావాలి. గత తప్పిదాలను సమీక్షించిన పార్టీ అసలు ఆ సమీక్ష పత్రాలను, సమీక్ష వివరాలను అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొడుతూ లీకులకు కారకులైన వారి పట్ల కూడా సమీక్షించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాలి. పార్టీలో ‘నేను చెప్పిందే వేదం’ అనే ధోరణి పెరిగినప్పుడు ప్రశ్నించే గొంతులు నొక్కబడతాయి. అది చివరకు పార్టీ వినాశనానికి దారితీస్తుంది. నాయకులు తమ వ్యక్తిగత ఇమేజ్ కోసం పార్టీ వేదికలను వాడుకోవడం ఆపాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కింది స్థాయి కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. కేవలం పైస్థాయిలో నలుగురు కూర్చుని తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు కావు సదా విఫలమవుతూనే ఉంటాయి. అంతర్గత చర్చలను మీడియాకు చేరవేసే ‘కోవర్టు’ సంస్కృతిని తుడిచిపెట్టాలి. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే, పార్టీ భవిష్యత్తులో మరింత పతనం కావడం ఖాయం.తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన ఎర్రజెండా, సొంత గూటిలోని కుమ్ములాటలతో సతమతమవ్వడం విచారకరం. ఇప్పటికైనా నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. సమాచారాన్ని లీక్ చేసే స్థాయికి దిగజారిన ‘చైతన్యం’ లేని నాయకత్వం కంటే, సిద్ధాంతం పట్ల కట్టుబడి ఉండే సామాన్య కార్యకర్త నయం. ఈ ‘అభిశంసన’ కేవలం వ్యక్తులకు పరిమితం కాకుండా, పార్టీ నిర్మాణంలో పేరుకుపోయిన కుళ్లును కడిగేసే ‘ప్రక్షాళన’కు పునాది కావాలి. ముఖ్యంగా తెలంగాణలో సీపీఎం ఉనికి ప్రశ్నార్థకమవుతున్న వేళ, నాయకులు తమ ఈగోలను పక్కన పెట్టాలి. అభిశంసనకు గురైన వర్గం తమ తప్పిదాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలి, అలాగే ప్రత్యర్థి వర్గం కూడా ‘లీకుల’ రాజకీయాలు మాని పార్టీ ఐక్యత కోసం కృషి చేయాలి. ఈ రెండు గ్రూపుల మధ్య నలిగిపోతున్నది సామాన్య కార్యకర్త, పార్టీ సిద్ధాంతం మాత్రమే అని గుర్తించాలి. ఎర్రజెండా పరువు తీసేది బయటి శత్రువులు కాదు, లోపల ఉండి గ్రూపు రాజకీయాలు చేసే ‘నేతలే’ అన్నది నిష్ఠుర సత్యంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా కనువిప్పు కలగకపోతే, తెలంగాణ గడ్డపై దశాబ్దాల కమ్యూనిస్టు పార్టీ మరింత మసకబారే ప్రమాదం లేకపోలేదు.
రాజేందర్ దామెర (దారా) సీనియర్ జర్నలిస్ట్
