“శతాబ్దపు నిశ్శబ్ద గళం – మానవత్వపు మహాకావ్యం “చార్లీ చాప్లిన్”
Behind the laughter lies the witness of tears : మానవ చరిత్రలో యుద్ధాలు జరిగినప్పుడు ఆయుధాలు శబ్దం చేశాయి. కానీ, ఒక మౌన యోధుడు మాత్రం కేవలం తన సైగలతో, నవ్వుతో ప్రపంచాధిపత్య కాంక్షను, నియంతృత్వాన్ని గడగడలాడించాడు. ఆయనే చార్లీ చాప్లిన్. ఏప్రిల్ 16న ఆయన పుట్టినరోజు. ప్రపంచం దుఃఖంలో ఉన్నప్పుడు నవ్వించడం ఒక ఎత్తైతే, ఆ నవ్వు ద్వారా ఆలోచింపజేయడం చాప్లిన్ ప్రత్యేకత. ఒక నల్లని టోపీ, చేతిలో కర్ర, వింతైన నడక.. ఇవి కేవలం ఒక వేషధారణకు సంబంధించిన గుర్తులు కావు. అవి ఒక నిరుపేద ఆర్తికి, ఒక సామాన్యుడి ధిక్కారానికి చిహ్నాలు. శతాబ్దపు నిశ్శబ్ద గళం చార్లీ చాప్లిన్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన నవ్వుల వెనుక దాగిన సామాజిక సత్యాలను ఎంతోకొంత తరిమిచూడాల్సిన అవసరం ఉంది”.
Behind the laughter lies the witness of tears
చాప్లిన్ జీవితం ఒక తెరిచిన పుస్తకం, కానీ అది కన్నీళ్లతో తడిసిన పుటలు కలిగినది. లండన్లోని మురికివాడల్లో కటిక పేదరికం, మానసిక స్థితి సరిగా లేని తల్లి, ఇవన్నీ ఆయనను కుంగదీయలేదు. బదులుగా, సమాజంలోని అట్టడుగు వర్గాల కష్టాలను అర్థం చేసుకునేలా చేశాయి. ఆయన సృష్టించిన ‘ది ట్రాంప్’ పాత్ర కేవలం ఒక బఫూన్ కాదు. అది ఆకలికి, ఆశకు, ఆత్మాభిమానానికి నిలువుటద్దం. చాప్లిన్ సృష్టించిన ” ది ట్రాంప్’ పాత్రలో ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తుంది. అతను కోటు వేసుకుంటాడు కానీ అది చిరిగిపోయి ఉంటుంది. చేతిలో కర్ర పట్టుకుంటాడు. అది ఒక హోదాకు సంకేతం, కానీ అతను ఒక యాచకుడు. సమాజం ఎంతగా తృణీకరించినా, తన ఆత్మాభిమానాన్ని వదులుకోని ఒక మధ్యతరగతి లేదా పేదవాడి మనస్తత్వానికి ఆ పాత్ర ప్రతిబింబం. నడకలో తడబాటు ఉన్నా, మనసులో దృఢత్వం కలిగిన ఈ పాత్ర ద్వారా, “గౌరవం అనేది ధనంలో లేదు, వ్యక్తిత్వంలో ఉంది” అని చాప్లిన్ నిరూపించారు.
Behind the laughter lies the witness of tears
చాప్లిన్ కేవలం హాస్యనటుడు మాత్రమే కాదు, గొప్ప రాజకీయ విమర్శకుడు కూడా. ది గ్రేట్ డిక్టేటర్ తో హిట్లర్ రాక్షస పాలనను ఎండగడుతూ ఆయన తీసిన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. అడాల్ఫ్ హిట్లర్ ఎదుగుతున్న సమయంలో, ప్రపంచ దేశాలు మౌనంగా ఉన్నప్పుడు, చాప్లిన్ తన సొంత ఖర్చుతో ఈ సీనిమా తీశారు. హిట్లర్, చాప్లిన్ ఇద్దరూ ఒకే నెల, ఒకే ఏడాది (ఏప్రిల్ 1889) పుట్టారు. హిట్లర్ తన మీసాలను భయం పలకడానికి ఉపయోగిస్తే, చాప్లిన్ అవే మీసాలను హాస్యం ద్వారా నియంతృత్వాన్ని ఎండగట్టడానికి ఉపయోగించారు. మోడరన్ టైమ్స్ లో పారిశ్రామిక విప్లవం మనిషిని ఒక యంత్రంలా ఎలా మార్చేస్తుందో ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషి తన అస్తిత్వాన్ని ఎలా కోల్పోతున్నాడో చాప్లిన్ ముందే హెచ్చరించారు. “అద్దం నా ఉత్తమ స్నేహితుడు, ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది ఎప్పుడూ నవ్వదు”. “ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన కష్టాలతో సహా”. “నువ్వు కిందికి చూస్తూ ఉంటే, ఎప్పటికీ ఇంద్రధనస్సును చూడలేవు”. “నేను వర్షంలో నడవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే నా కన్నీళ్లు ఎవరికీ కనిపించవు”. అన్న చార్లీ చాప్లీన్ మాటలు నేటి సమాజానికి సందేశంగానే చూడాలి. నేడు ద్వేషం, యుద్ధం, అసహనం రాజ్యమేలుతున్న కాలంలో చాప్లిన్ ‘మార్గం’ అత్యంత అవసరం. ఆయన మార్గం కేవలం నవ్వించడం కాదు. మనిషిని ప్రేమించడం. కన్నీళ్లను తుడుస్తూనే, అన్యాయంపై మౌనంగానే గొంతెత్తడం.
Behind the laughter lies the witness of tears
ఆయన దృష్టిలో నవ్వు అంటే కేవలం సరదా కాదు. “నిజమైన హాస్యం అనేది తీవ్రమైన బాధ నుండి పుడుతుంది” అని ఆయన నమ్మేవారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న పేదరికాన్ని, తల్లి అనారోగ్యాన్ని ఆయన తెరపై హాస్యంగా మార్చారు. అంటే, సమస్యలను చూసి కుంగిపోవడం కంటే, వాటిని చూసి నవ్వగలిగే శక్తిని సంపాదించుకోవడమే చాప్లిన్ మనకు చూపిన మార్గం. కమ్యూనిజం ఆరోపణలతో అమెరికా ఆయనను దేశం నుండి వెళ్లగొట్టినప్పుడు కూడా ఆయన తన సిద్ధాంతాలను వదులుకోలేదు. తన పుస్తకంలో “నేను ఏ వర్గానికీ చెందినవాడిని కాను, నేను కేవలం మానవత్వానికి మద్దతుదారుడిని” అని స్పష్టం చేశారు.
టాకీ సినిమాలు (మాటలు వినిపించే సినిమాలు) వచ్చాక కూడా చాప్లిన్ చాలా కాలం మూకీ సినిమాలకే మొగ్గు చూపారు. భాష అనేది మనుషులను విడదీస్తుందని, కానీ భావం ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒకటేనని ఆయన నమ్మారు. అందుకే ఆయన సినిమాలు అమెరికా నుంచి ఆసియా లోని పల్లెల వరకు అందరికీ అర్థమయ్యాయి. మాటలు లేని చోట ఆయన కళ్లు, చేతులు సామాజిక అన్యాయాలపై గొంతెత్తాయి. ఇది ఒక అంతర్జాతీయ భాషను సృష్టించిన గొప్ప ప్రయోగం. బ్లాక్ అండ్ వైట్ తెరపై రంగుల కలలను పండించిన ఆ మహానుభావుడికి నివాళి అర్పించడమంటే.. మన చుట్టూ ఉన్న వారి కళ్లల్లో ఆనందాన్ని నింపడమే. చార్లీ చాప్లిన్ భౌతికంగా లేకపోయినా, ఒక సామాన్యుడు వ్యవస్థను ప్రశ్నించిన ప్రతిసారీ ‘ ది ట్రాంప్’ రూపంలో ఆయన జీవించే ఉంటారు. నేటి ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాంత్రిక జీవనం వైపు వేగంగా వెళ్తోంది. సరిగ్గా వందేళ్ల క్రితమే చాప్లిన్ ‘మోడరన్ టైమ్స్’ ద్వారా హెచ్చరించారు “మనుషులు యంత్రాలు కాకూడదు.
ఏప్రిల్ 16న మనం చాప్లిన్ను గుర్తుచేసుకోవడమంటే.. మనలోని మనిషిని, సాటి మనిషి పట్ల ఉండే కరుణను గుర్తుచేసుకోవడమే. ఆయన చిరునవ్వు వెనుక ఉన్న కన్నీటిని అర్థం చేసుకున్నప్పుడే, ఆయన కళకు మనం ఇచ్చే అసలైన గౌరవం.
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
