A tribute to the epic poem of motherhood ‘Kancharla Lakshmamma’ : నిద్రలేవగానే ఫోన్ డిస్ప్లేపై ప్రత్యక్షమైన ఆ చేదు వార్త గుండెను ఒక్కసారిగా పిండేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలంలోని ఒక చిట్టచివరి సరిహద్దు గ్రామం గిద్దెముత్తారం నుండి వచ్చిన ఒక నిశ్శబ్ద రోదన అది. మిత్రుడు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమనేత ‘కంచర్ల బద్రి’ మాతృమూర్తి ‘కంచర్ల లక్ష్మమ్మ’ మే 16, 2026 తెల్లవారుజామున 3 గంటలకు శ్వాస విడిచారనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మరణం కేవలం ఒక సామాన్య గృహిణి నిష్క్రమణ కాదు. అణచివేతను, అసమానతలను నిరసిస్తూ ప్రశ్నించే కొడుకును కని, వ్యవస్థల నిర్బంధాల ఎదుట కొండంత అండగా నిలిచిన ఒక అసాధారణ మాతృత్వపు మహాకావ్యానికి ముగింపు.
A tribute to the epic poem of motherhood, ‘Kancharla Lakshmamma’..!
పుట్టుక, మరణం అనేవి ఈ సృష్టి క్రమంలో రెండు అనివార్యమైన సత్యాలు. పుట్టడం ఎంత సహజమో, మరణం అంతకంటే నిశ్చయమైన ముగింపు. కాలం ఎవరి కోసమూ ఆగదు, ప్రకృతి తన నియమాన్ని ఎవరి కోసమూ మార్చుకోదు. కానీ, ఈ జనన మరణాల మధ్య నడిచే జీవితం ఉందే… అది కొందరి విషయంలో ఒక నిరంతర యుద్ధంగా, మరికొందరి విషయంలో ఒక త్యాగ నిరతిగా మారుతుంది. లక్ష్మమ్మ జీవితం కూడా అలాంటిదే. ఆమె ఏనాడూ సిద్ధాంత గ్రంథాలు చదవలేదు, వేదికలెక్కి ఉపన్యసించలేదు. ఆమె వెనుకబడిన తరగతుల (BC) నిరుపేద కుటుంబానికి చెందిన ఒక సాదాసీదా పల్లెటూరి ఇల్లాలు. కానీ, సమాజంలోని అసమానతలపై తిరగబడే ఒక కొడుకుని కని, అతనికి వెన్నుదన్నుగా నిలిచిన ఆమె నిశ్శబ్ద పోరాటం ఏ సిద్ధాంతానికీ తీసిపోనిది. మరణం ఆమె భౌతిక కాయాన్ని మనకు దూరం చేసినా, ఆమె విత్తిన ఆదర్శం బద్రి రూపంలో సజీవంగానే ఉంటుంది.
A tribute to the epic poem of motherhood, ‘Kancharla Lakshmamma’..!
తెలంగాణ పటంలో ఒక మూలన ఉండే గిద్దెముత్తారం లాంటి మారుమూల గ్రామం నుండి, విద్యాకురుక్షేత్రమైన ఉస్మానియా యూనివర్సిటీ వరకు ‘కంచర్ల బద్రి’ అడుగుపెట్టారంటే, ఆ ప్రయాణం వెనుక లక్ష్మమ్మ చెమట, కష్టార్జితం, ఓపిక, ప్రేమ లేవని అనడానికి లేదు. రూపాయి రూపాయి పోగేస్తూ, ఆర్థిక ఇబ్బందుల సుడిగుండంలో ఈదుతూనే కొడుకు చదువు కోసం, అతని భవిష్యత్తు కోసం ఆ తల్లి అనుక్షణం తపించిందనేది ఏమాత్రం ఆ కుటుంబాన్ని పరిశీలించినా అర్థం అవుతుంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ లీడర్‌గా బద్రి గర్జిస్తున్నప్పుడు, విద్యార్థి లోకం అతన్ని జేజేలతో ముంచెత్తి ఉండవచ్చు. కానీ, ఒక ఉద్యమకారుడి తల్లిగా లక్ష్మమ్మ లోలోపల అనుభవించిన ఆందోళన వర్ణనాతీతంగానే ఉంటుంది. పోలీసులు, కేసులు, అర్ధరాత్రి నిర్బంధాలు ఈ సమస్యలన్నీ పల్లెటూరి ఇంట సృష్టించిన కలకలం సామాన్యమైనది కాదు. కొడుకు క్షేమం గురించి లోపల కుంగిపోతూనే, కుమిలిపోతూనే, కొడుకు కళ్లల్లోకి చూసేసరికి మాత్రం ఎక్కడా ఆత్మవిశ్వాసం సడలనివ్వకుండా కొండంత భరోసాను, అమితమైన ప్రేమను అందించిన ధీర వనిత ఆమె.
A tribute to the epic poem of motherhood, ‘Kancharla Lakshmamma’..!
ఒకానొక సందర్భంలో చేతులకు సంకేళ్లు చూట్టూ నిఘాతో నిస్సాయంగా ఉన్న కొడుకును చూసి లోలోపల కుంగిపోతున్న ఛాయలు అనిచిపెట్టుకొని ధైర్యంగా ఉండు బిడ్డా అని కంచర్ల బద్రికి ధైర్యం చెప్పిన ఘటనను నేను చూశాను. సమకాలీన సమాజంలో ‘ఉపా’ లాంటి కఠినమైన నల్లచట్టాలు ఒక సాధారణ గృహిణిని, ఒక నిరుపేద కుటుంబాన్ని ఎంత మానసిక క్షోభకు గురిచేస్తాయో నేరుగా అనుభవించిన బాధితుల్లో నేను, బద్రి ఉన్నాం. ఆ కేసు నీడన మేమిద్దరం కలిసి జైలు జీవితం గడిపాం. ఐదేళ్ల పాటు న్యాయపోరాటం సాగింది. ఈ కాలంలో అటు కోర్టు వాయిదాల చుట్టూ తిరుగుతూ, ఇటు ఆసుపత్రి కారిడార్లలో మృత్యువుతో పోరాడుతున్న అమ్మను కాపాడుకోవడానికి బద్రి పడ్డ వేదనను చూశాను. ఒకవైపు కోర్టు బోను, మరోవైపు అమ్మ ఆసుపత్రి బెడ్డు. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ కూడా బద్రి సమతూకం పాటించిన తీరు నాకు తెలుసు. ఈ పరిస్థితుల్లోనూ మేము బాధలను, సమస్యలను ఎగతాళి చేస్తూ నవ్వుకోవటం తెలుసు. ఈనెల 5వ తేదీన న్యాయస్థానం మాపై ఉన్న ఉపా కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చినప్పుడు, తన కొడుకు ఆ కేసులో ఉపశమనం పొందాడని ఆ తల్లి గుండె ఎంతగా మురిసిపోయి ఉంటుందో..! ఆ కోర్టు తీర్పు కళ్లారా చూసిన కొద్దిరోజులకే ఆమె శ్వాస విడవడం బద్రికి తీరని లోటుగానే ఉంటుంది. కొడుకుపై ఉన్న నిందలన్నీంటిలో ఒక నింద తొలిగిపోయిందని నిర్ధారించుకున్నాకే, ఆ మాతృమూర్తి తన శ్వాసను ఆపేసిందేమో అనిపిస్తుంది.
A tribute to the epic poem of motherhood, ‘Kancharla Lakshmamma’..!
బద్రీ… దుఃఖాన్ని తట్టుకొని నిలబడు..!
మిత్రుడు బద్రీ, నువ్వు తెలంగాణ ఉద్యమకారుడివి, ఉస్మానియా గడ్డపై కష్టాల సుడిగుండాలను ఎదుర్కొని నిలబడిన నాయకుడివి. మరణం ఒక మనిషి భౌతిక కాయాన్ని మాత్రమే తీసుకెళ్లగలదు, కానీ ఆ తల్లి నీలో విత్తిన నిబద్ధతను, పోరాట స్ఫూర్తిని, ప్రశ్నించే తత్వాన్ని ఏ శక్తీ తుడిచిపెట్టలేదు. మరణం అనివార్యమనే సత్యాన్ని జీర్ణించుకుని, అమ్మ జ్ఞాపకాలను గుండెల్లో భద్రపరుచుకుని, ఈ సుదీర్ఘ దుఃఖాన్ని తట్టుకొని నిలబడాల్సిన సమయమిది. తల దించుకోకు, ఎందుకంటే నువ్వు సాధించే ప్రతి విజయంలోనూ లక్ష్మమ్మ ఆశీస్సులు ఒక అదృశ్య శక్తిగా నీకు తోడుంటాయని అనుకోవాలి. గిద్దెముత్తారం మట్టిలో కలిసిపోతున్న లక్ష్మమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా, అట్టడుగు వర్గాల నుండి ఒక ఉద్యమకారుడిని సమాజానికి అందించిన ఒక ‘మహాకావ్యం’గా ఆమె ఎల్లప్పుడూ స్మరణీయురాలు.
మాతృమూర్తి ‘కంచర్ల లక్ష్మమ్మ’కి ప్రగాఢ శ్రద్ధాంజలి.!
రాజేందర్ దామెర (దారా)
