ఆయుధ నక్సలిజం క్షీణించిన తర్వాత ‘ఆలోచనపరులను’ శత్రువుగా చూపడం వెనుక రాజకీయ, సామాజిక అర్థాలేమిటి..?
‘Brain’ Naxalites…A war on ideas…? ఆయుధం మౌనమైతే ఆలోచన కూడా చనిపోతుందా..? అడవుల్లో తుపాకులు తగ్గిపోతే ప్రశ్నించే గొంతులూ తగ్గిపోవాలా..? ప్రభుత్వ విధానాలను విమర్శించడం, ప్రజల హక్కుల కోసం మాట్లాడటం, అసమానతలను ప్రశ్నించడం ఇవన్నీ ‘నక్సలిజం’గా ముద్రించగలమా..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సాయుధ నక్సలిజం బలహీనపడిందని పేర్కొంటూనే, ఇంకా ‘దిమాగీ నక్సల్స్’ ఉన్నారని, వారిని గుర్తించి ఒంటరిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క పదబంధం రాజకీయ చర్చను దాటి ఒక లోతైన ప్రశ్నను మన ముందుంచింది. ప్రజాస్వామ్యంలో భావజాలానికి సరిహద్దులు ఎవరు నిర్ణయిస్తారు..? అని.
మొదట ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి.
భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను హింసాత్మకంగా కూల్చివేయాలనే లక్ష్యంతో ఆయుధాలు పట్టడం ఒక విషయం. ప్రభుత్వాన్ని విమర్శించడం, పాలకులను ప్రశ్నించడం, భూమి, అడవి, పర్యావరణం, సమానత్వం, హక్కుల కోసం పోరాడటం మరో విషయం. ఈ రెండింటినీ ఒకే కొలమానంతో చూడటం సరైనది కాదు, శాస్త్రీయమైన వాదన కానేకాదు. ఆయుధ నక్సలిజం వేరు… అసమ్మతి వేరు అనేది గమనంలో ఉంచుకోవాలి.
ఒకవైపు సాయుధ నక్సల్స్ ను పూర్తిగా నిర్మూలించే ఆఫరేషన్ చేపట్టి సక్సెస్ అయినట్లు ప్రకటించిన ప్రభుత్వం అదే సమయంలో ‘దిమాగీ నక్సల్స్’ అనే విస్తృత పదాన్ని ఉపయోగించడం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఏ భావనకైనా స్పష్టమైన నిర్వచనం ఉండాలి. ఒక వ్యక్తి నక్సలిజాన్ని సమర్థిస్తున్నాడా..? అతను హింసను సమర్థిస్తున్నాడా..? రాజ్యాన్ని కూల్చివేయాలని పిలుపునిస్తున్నాడా..? లేదా కేవలం ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తున్నాడా..?
ఈ తేడాలను గుర్తించకుండా ‘దిమాగీ నక్సల్’ అనే ఒకే పదంతో విభిన్న వ్యక్తులు, సంస్థలు, మేధావులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, విద్యార్థులు, రాజకీయ ప్రత్యర్థులను ఒకే వర్గంలో పెట్టడం మొదలైతే…అది భద్రతా నిర్వచనం కాదు, అది రాజకీయ లేబులింగ్గా మారే ప్రమాదం ఉంది. ఇక్కడే ప్రజాస్వామ్యానికి అసలు పరీక్ష మొదలవుతుంది. ఆలోచనను ఓడించాలంటే… ఆలోచనతోనే ఓడించాలి. ఒక భావజాలం తప్పు అని ప్రభుత్వం భావిస్తే, దాన్ని నిషేధించడం కంటే ముందుగా దానికి శాస్త్రీయమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలి. ఒక ఆలోచనను ఓడించాలంటే మరో బలమైన ఆలోచన అవసరం. ఇదే ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య ఉన్న మౌలిక తేడా.
రాజకీయ శాస్త్రంలో ఒక ఆసక్తికరమైన ప్రక్రియ ఉంది. శత్రు ప్రతిమ నిర్మాణం ఉంటుంది. ఒక సమాజాన్ని ‘మనం – వాళ్లు’గా విభజించినప్పుడు రాజకీయ సమీకరణ సులభమవుతుంది. ‘దేశభక్తులు – దేశద్రోహులు’, ‘జాతీయవాదులు – వ్యతిరేకులు’, ‘ప్రజలు – అర్బన్ నక్సల్స్’ వంటి ద్వంద్వ విభజనలు సంక్లిష్టమైన సామాజిక సమస్యలను సులభమైన రాజకీయ కథనాలుగా మార్చగలవు. ‘అర్బన్ నక్సల్’ అనే పదాన్ని ప్రధానమంత్రి గతంలో కూడా ఉపయోగించిన విషయం తెలిసిందే. ఒక సందర్భంలో ఆయన ‘అర్బన్ నక్సలిజం’ అంతర్జాతీయ పరిధిని సంతరించుకుంటోందని కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ‘అర్బన్’ నుంచి ‘దిమాగీ’కి పరిధి విస్తరించడం గమనించాల్సిన పరిణామం. భౌగోళిక శత్రువు నుంచి భావజాల శత్రువు వైపు చర్చ మారుతోంది. ఇది కేవలం పద ప్రయోగం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో అసమ్మతి స్థలాన్ని ఎంతవరకు అనుమతిస్తామనే ప్రశ్నను ముందుకు తెస్తుంది. అయితే ప్రశ్నించే మనిషి… శత్రువు కదనేది మర్చిపోవద్దు. ఒక జర్నలిస్టు ప్రభుత్వ వైఫల్యాన్ని రాస్తే అతను నక్సలా..? ఒక విద్యార్థి ఫీజుల పెంపును వ్యతిరేకిస్తే..? ఒక గిరిజనుడు తన భూమి హక్కు కోసం పోరాడితే..? ఒక పర్యావరణ ఉద్యమకారుడు గుట్టను తవ్వడాన్ని ప్రశ్నిస్తే..? ఒక ఆలోచనపరుడు ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తే..? ఒక పౌరుడు రాజ్యాంగంలోని హక్కులను గుర్తుచేస్తే..? దేశవిరుద్దకులుగా భావిస్తే ప్రజాస్వామ్య దేశం ఎలా అవుతుంది..? విమర్శను హింసతో, అసమ్మతిని తిరుగుబాటుతో, ప్రశ్నను కుట్రతో సమానం చేయడం మాత్రం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది.
పలానా వారినే ‘దిమాగీ నక్సల్స్’ గా విభజించి అన్నట్లుగా స్పష్టత ఇచ్చే ప్రయత్నం బయటకు చెప్పినప్పటికీ ‘దిమాగీ నక్సల్స్’ పదబంధం అన్ని రకాల రాజ్యాంగ హక్కులను అదిమిపట్టేందుకు ప్రయోగించబోయే ప్రక్రియ హెచ్చరికగానే చూడాలి. ఇది పెను ప్రమాదకరమైన హెచ్చరిక. అయితే అదే సమయంలో రాజ్యాంగం ఇచ్చిన మాట స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, సంఘటితమయ్యే హక్కు వంటి ప్రజాస్వామ్య స్థలాలను కూడా కాపాడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం తనను విమర్శించే స్వరాలను ఎంతవరకు సహిస్తుంది అన్నదే దాని అసలు బలం. తనను ప్రశంసించే వారితో ప్రభుత్వం బలపడదు. తనను ప్రశ్నించే వారిని కూడా చట్టబద్ధమైన పరిమితుల్లో సహించగలిగినప్పుడే ప్రభుత్వం బలంగా కనిపిస్తుంది.
ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యను విమర్శించడం అంటే నక్సలిజాన్ని సమర్థించడం కాదు. అదేవిధంగా నక్సలిజాన్ని వ్యతిరేకించడం అంటే ప్రభుత్వంలోని ప్రతి నిర్ణయాన్ని సమర్థించాల్సిన అవసరం కూడా లేదు. ఈ రెండు విషయాల మధ్య ఉన్న ప్రజాస్వామ్య స్థలమే భారత రాజ్యాంగం ఇచ్చిన అసలు బలం. ‘దిమాగీ నక్సల్స్’ అనే పదం నిజంగా హింసాత్మక మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే నిర్దిష్ట వ్యక్తులను సూచిస్తే ఆ వ్యక్తులపై ఆధారాలతో, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ అది ప్రతి ప్రశ్నించే మెదడుకూ, ప్రతి విమర్శించే కలానికీ, ప్రతి అసమ్మతి గొంతుకూ అంటించే రాజకీయ ముద్రగా మారితే మాత్రం అది ప్రజాస్వామ్యాన్నే బలహీనపరిచే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే…దేశానికి తుపాకీ పట్టిన చేతులకంటే ప్రమాదకరమైనది ప్రశ్నించలేని సమాజం. ఆలోచనకు సమాధానం అరెస్టు కాదు…ఆలోచనే. విమర్శకు సమాధానం ముద్ర కాదు…వాస్తవం. అసమ్మతికి సమాధానం శత్రుత్వం కాదు…ప్రజాస్వామ్య సంభాషణ.
అందుకే అసలు ప్రశ్న ఏంటంటే..’దిమాగీ నక్సల్స్’ ఎవరు..? అన్నది కాదు. ‘ప్రశ్నించే మెదళ్లను మన ప్రజాస్వామ్యం ఎంతవరకు భరించగలదు..?’ అన్నదే.
– రాజేందర్ దామెర (దారా)
జర్నలిస్ట్
rajenderdamera@gmail.com
