- తైక్వాండోలో సత్తా చాటిన టేకులగూడెం యువ క్రీడాకారుడు
- 500 మందికి పైగా క్రీడాకారులతో ప్రతిష్టాత్మక రికార్డు ప్రయత్నం
Matangi Praveen on the Guinness World Record stage తైక్వాండో క్రీడలో హనుమకొండ జిల్లాకు చెందిన మాతంగి ప్రవీణ్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన ప్రవీణ్ బ్లాక్ బెల్ట్ 3వ డాన్‌గా తైక్వాండోలో తన ప్రతిభను చాటుతూ ప్రతిష్టాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రదర్శనలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన భారీ తైక్వాండో లెసన్‌లో ప్రవీణ్ ఉత్సాహంగా పాల్గొని తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచ స్థాయిలో తైక్వాండో క్రీడకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు, క్రీడాకారుల్లో క్రమశిక్షణ, ఐక్యత, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఎం.జే.ఆర్. 9 ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, సుమన్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా తైక్వాండో క్రీడాకారులు ఒకే వేదికపైకి చేరి భారీ స్థాయిలో ప్రదర్శన నిర్వహించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Matangi Praveen on the Guinness World Record stage!
ఇప్పటికే 30 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రికార్డు ప్రయత్నాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. తైక్వాండోలోని క్రమశిక్షణ, సమిష్టి భావన, మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయి వేదికపైకి ఎదుగుతూ గిన్నిస్ రికార్డు ప్రయత్నంలో భాగస్వామిగా నిలిచిన మాతంగి ప్రవీణ్‌ను టేకులగూడెం గ్రామస్థులు, క్రీడాభిమానులు అభినందిస్తున్నారు. ప్రవీణ్ సాధించిన ఈ అవకాశం జిల్లాలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.
