సంతాప సభ : ఆగస్టు 10 సోమవారం
సమయం : మధ్యాహ్నం
స్థలం : గోదావరిఖని
‘Samaraketan’… A life lesson conveyed without words : కొన్ని ప్రయాణాలు మనం నిర్ణయించుకుంటాం. మరికొన్ని ప్రయాణాలు జీవితం మనతో చేయిస్తుంది. ఇటీవల నాకు జరిగిన గోదావరిఖని ప్రయాణం అలాంటిదే. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి నేను ఆ ప్రయాణం చేయలేదు. పెద్దపల్లి జిల్లా సీపీఎం కార్యదర్శి వై. యాకయ్య, భూపాలపల్లి జిల్లా సీపీఎం కార్యదర్శి బందు సాయిలుతో నాకు పరిచయం ఉంది. గతంలో నేను కూడా సీపీఎం పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుబంధంతోనే వారి కుటుంబంలో జరిగిన తీవ్ర విషాద ఘటనలో పాల్గొనేందుకు బయలుదేరాను. అకాల మరణం ఎవరి జీవితాన్నైనా ఆపేస్తుంది. కానీ కొన్ని మరణాలు ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, మన ఆలోచనలను కూడా కదిలిస్తాయి. సమరకేతన్ మరణం కూడా అలాంటిదే.
ప్రయాణమంతా వర్షంతో తడిసిన నేల పరిమళం. పచ్చగా మెరిసే చెట్లు. కొండల నిశ్శబ్దం. గాలిలో తేలియాడుతున్న చల్లదనం. ప్రకృతి తన సహజ సౌందర్యంతో మనసుకు ప్రశాంతతను ఇచ్చింది. కానీ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఆ ప్రశాంతత ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఆ ఇంటి ముందు వందలాది మందితో సమరకేతన్అం తిమయాత్ర ప్రారంభమైంది. ఆ సమయంలో నేను నాతోపాటు తమ్ముడు శ్రీకాంత్, సాగర్ మామ, సది బాబాయ్ లు అక్కడికి చేరుకున్నాం. అక్కడ ప్రతి ముఖంలో ఒకే ప్రశ్న కనిపించింది. “ఇంత చిన్న వయసులో ఎందుకు..?” ఆ ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గరా లేదు. తండ్రి కళ్లలో కనిపించింది కేవలం కన్నీరు కాదు. తన గుండెల్లోని ఒక భాగాన్ని కోల్పోయిన నిశ్శబ్దం. తల్లి రోదనలో వినిపించింది కేవలం దుఃఖం కాదు. తొమ్మిది నెలలు మోసిన బిడ్డ జ్ఞాపకాలు, చిన్ననాటి అడుగులు, మొదటి పలుకులు, ఎన్నో ఆశలు ఒక్కసారిగా కూలిపోయిన వేదన. అల్లుడిని ఎంతో ప్రేమించిన మరో కుటుంబం కూడా అదే శోకంలో మునిగిపోయింది. బంధాలు రక్తంతోనే కాదు, ప్రేమతో కూడా ఏర్పడతాయని ఆ దృశ్యం చెబుతోంది.
సమరకేతన్తో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. కానీ ఆ రెండు కుటుంబాలు అనుభవిస్తున్న బాధను దగ్గరగా చూసిన తర్వాత ఒక విషయం మరింత స్పష్టంగా అర్థమైంది. మరణం ముందు పరిచయాలు, అపరిచయాలు అన్న భేదాలు చిన్నవైపోతాయి. మిగిలేది ఒక కుటుంబం కన్నీరు మాత్రమే. యాకయ్య, బందు సాయిలు ఉద్యమ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన నాయకులు. ప్రజా సమస్యలపై పోరాడిన మనుషులు. కానీ జీవితంలో కొన్ని దెబ్బల ముందు అనుభవం కూడా మౌనమైపోతుంది. కన్నకొడుకును, ఆప్యాయంగా చూసుకున్న అల్లుడిని కోల్పోయిన బాధ ముందు మాటలు కూడా ఓదార్పు ఇవ్వలేని స్థితి కనిపించింది. అక్కడికి వచ్చిన బంధువులు, మిత్రులు, సహచరులు ఒక్కొక్కరు ఒక్కో జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ట్రేడ్ యూనియన్ సీనియర్ నాయకుడు బొజ్జ బిక్షమయ్యతో పాటు ప్రతి ఒక్కరి ముఖంలో అదే ఆవేదన కనిపించింది.
జర్నలిస్టుగా ఎన్నో మరణాలను చూశాను. ఎన్నో అంత్యక్రియలను కవర్ చేశాను. ఎన్నో శోకసంద్రాలను వార్తలుగా రాశాను. కానీ కొన్ని మరణాలు వార్తలుగా ముగియవు. అవి మనసులో చాలా కాలం మిగిలిపోయే ప్రశ్నలుగా మారిపోతాయి. అక్కడ నిలబడి ఉండగా నాకు మరో సత్యం అర్థమైంది. మనిషి చనిపోయినప్పుడు అతను సంపాదించిన డబ్బు కోసం ఎవరూ ఏడవరు. అతను కట్టిన ఇళ్ల కోసం ఎవరూ కన్నీరు కార్చరు. అతను సంపాదించిన పదవుల కోసం ఎవరూ విలపించరు. కానీ… అతను పంచిన ప్రేమ కోసం ఏడుస్తారు. అతనిపై పెంచుకున్న ప్రేమ ఆశలకోసం ఏడుస్తారు. అతను చూపిన ఆప్యాయతను గుర్తు చేసుకుంటారు. అతనితో గడిపిన జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుంటారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో కొద్దిసేపు ప్రకృతి ఒడిలో గడిపాను. నా ఎదుట ఒక పెద్ద వృక్షం నిలబడి ఉంది. ఎన్ని వర్షాలు చూసిందో… ఎన్ని ఎండలు భరించిందో… ఎన్ని తరాలను చూసిందో… అది ఏమీ మాట్లాడలేదు. కానీ దాని మౌనం చాలా చెప్పింది. ప్రకృతిలో ఏదీ శాశ్వతం కాదు. అదే సమయంలో ఏదీ పూర్తిగా నశించిపోదు కూడా. ఆకు రాలిపోతుంది. మట్టిగా మారుతుంది. మళ్లీ అదే మట్టిలో కొత్త జీవం పుడుతుంది. నది సముద్రంలో కలుస్తుంది. మేఘమై తిరిగి వర్షంగా వస్తుంది. ప్రకృతి మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది. మార్పు సహజం. జీవితం తాత్కాలికం. కానీ ప్రేమ, జ్ఞాపకాలు, అనుబంధాలు మాత్రం మనుషుల హృదయాల్లో చాలా కాలం నిలిచిపోతాయి. మనిషి ఎంత సంపాదించినా…ఎంత పేరు తెచ్చుకున్నా… ఎంత ఎత్తుకు ఎదిగినా…చివరికి మిగిలేది ఒక్కటే. మన వల్ల ఎవరికైనా కలిగిన సంతోషం. మన గురించి చెప్పుకునే మాట. మన కోసం కార్చిన కన్నీరు. మనం నడిచిన మార్గం.
సహజ వనరుల పరిరక్షణ వేదిక అధ్యక్షుడిగా నేను ప్రకృతిని కాపాడాలని ఎందుకు చెబుతుంటానంటే, ప్రకృతి కేవలం మనకు జీవనాధారం మాత్రమే కాదు. జీవితం ఎలా జీవించాలో నేర్పే గురువు కూడా. చెట్లు ఇవ్వడం నేర్పుతాయి. నదులు ముందుకు సాగడం నేర్పుతాయి. పర్వతాలు స్థైర్యం నేర్పుతాయి. మట్టి వినమ్రతను నేర్పుతుంది. మరణం మాత్రం ఒకే విషయాన్ని గుర్తు చేస్తుంది. మనకు లభించిన సమయం చాలా పరిమితం. అందుకే ప్రేమతో జీవిద్దాం. మనుషులను గౌరవిద్దాం. మన వల్ల నలుగురికి మంచి జరిగేలా ప్రయత్నిద్దాం. ప్రకృతిని కాపాడుదాం. బాధ్యతాయుతమైన స్వేచ్ఛతో జీవిద్దాం. ఈ ప్రయాణం నాకు ప్రకృతి అందాలను మాత్రమే చూపించలేదు. ఒక కుటుంబం కన్నీటి వెనుక దాగి ఉన్న ప్రేమను చూపించింది. తల్లిదండ్రులు సంతానాన్ని కోల్పోతే వారి గుండెల్లో ఏర్పడే శూన్యత ఎంత లోతైనదో అనుభవింపజేసింది. జీవితం ఎప్పుడు మొదలవుతుందో మనకు తెలియదు. ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. కానీ ఆ రెండు తేదీల మధ్య మనం ఎలా జీవించామనేదే మన అసలు పరిచయం. ప్రకృతి ఒడిలో కూర్చున్న ఆ క్షణంలో నా మనసులో ఒకే వాక్యం ప్రతిధ్వనించింది. “మనిషి ఈ ప్రపంచంలో శాశ్వత నివాసి కాదు… ఒక ప్రయాణికుడు మాత్రమే.” సమరకేతన్ ఇక లేరు. కానీ ఆయన జ్ఞాపకం తన కుటుంబ సభ్యుల ప్రేమలో, బంధువుల అనుబంధంలో, ఆయనను గుర్తు చేసుకుంటూ కార్చిన ప్రతి కన్నీటిలో నిలిచిపోతుంది. ఆ లోటును ఏ మాటా పూడ్చలేదు. ఏ ఓదార్పు పూర్తిగా తీర్చలేదు. అయినా ఈ తీవ్ర విషాదాన్ని ఎదుర్కొనే మనోధైర్యం ఆ కుటుంబ సభ్యులకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమరకేతన్ శ్రద్ధాంజలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
– రాజేందర్ దామెర (దారా)
jananirnayam2022@gmail.com
