A revolution born from ridicule ‘Cockroach’ Janata Garjana : సమకాలీన ప్రజాస్వామ్యంలో పాలకుల అనాలోచిత వ్యాఖ్యలు, వ్యవస్థల ఉదాసీనత ఏ స్థాయిలో తిరుగుబాటుకు దారితీస్తాయో చెప్పడానికి తాజా ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’ ఒక సజీవ ఉదాహరణ. హేళన నుంచి పుట్టిన ఒక వ్యంగ్య చలనం.. కేవలం ఐదు రోజుల్లోనే వ్యవస్థాగత రాజకీయ పార్టీల ఇన్స్టాగ్రామ్ సామ్రాజ్యాలను కుదిపేయడం సాధారణ విషయం కాదు. ఇది కేవలం ఒక సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే కాదు; సాంప్రదాయ రాజకీయాల పునాదులను ప్రశ్నిస్తున్న సరికొత్త ‘జెన్-జీ’ (Gen-Z) ఆక్రోశం.
A revolution born from ridicule ‘Cockroach’ Janata Garjana..!
వ్యవస్థను ప్రశ్నించే నిరుద్యోగులను, హక్కుల కార్యకర్తలను ‘బొద్దింకలు’గా అభివర్ణించడం పాలకుల, ఉన్నత పీఠాలపై ఉన్నవారి అహంకారానికి నిదర్శనం. అయితే, ఆ అవమానాన్నే ఒక ఆయుధంగా మార్చుకుని యువత సృష్టించిన వేదికే ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’. పురాణాల్లో వామనుడు మూడడుగులతో విశ్వరూపం ప్రదర్శించినట్లు.. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ‘డిజిటల్ కీటకాలు’ సృష్టించిన ప్రభంజనం దేశంలోని శతాబ్దాల చరిత్ర గల పార్టీలకు, దశాబ్దాలుగా అధికారాన్ని వెలగబెడుతున్న శక్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఐదు రోజుల్లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకోవడం అనేది.. యువతలో పేరుకుపోయిన అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతోంది. సీజేపీ సోషల్ మీడియా దూకుడును తట్టుకోలేక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాను నిలిపివేయడం, హ్యాకింగ్ ప్రయత్నాలు జరగడం చూస్తుంటే.. ప్రజాస్వామ్య దేశంలో భిన్నాభిప్రాయాలను, వ్యంగ్య శరాన్ని తట్టుకునే ఓపిక కూడా పాలకులకు లేదని స్పష్టమవుతోంది. సాంకేతికతను వాడుకుని గొంతు నొక్కేయాలని చూడటం ప్రభుత్వాల బలహీనతను చూపిస్తుందే తప్ప బలాన్ని కాదు. ఒక ఖాతాను మూసివేస్తే ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ అంటూ మరో రూపంలో దూసుకురావడం డిజిటల్ యుగంలో ఆంక్షలు ఎంత అసంబద్ధమైనవో నిరూపిస్తోంది.
A revolution born from ridicule ‘Cockroach’ Janata Garjana..!
అధికారంలో ఉన్న పార్టీలు కోట్ల రూపాయల బడ్జెట్, వేలాది మంది ఐటీ సెల్ సైన్యంతో సాధించలేని ప్రజాదరణను.. అమెరికాలో చదువుకుంటున్న ఒక సాధారణ భారతీయ విద్యార్థి (అభిజీత్ దీప్కే) కేవలం ఐదు రోజుల్లో కేవలం ఒకే ఒక్క ఐడియాతో సాధించి చూపించారు. ఈ ఉద్యమం ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పడానికి.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరు మీద హక్కుల కోసం ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీలో దరఖాస్తులు వెల్లువెత్తడమే నిదర్శనం. ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు కూడా ఆ పేరును సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారంటే, ఈ ‘వ్యంగ్య రాజకీయం’ భవిష్యత్తులో ఎంతటి పెద్ద బ్రాండ్‌గా మారబోతుందో ఊహించవచ్చు.
A revolution born from ridicule ‘Cockroach’ Janata Garjana..!
సీజేపీ సభ్యత్వానికి ఉన్న అర్హతలు ఏంటో తెలుసా? నిరుద్యోగం, సోమరితనం, ఆన్లైన్లో ఉండటం, వ్యవస్థపై ఆగ్రహాన్ని వెళ్లగక్కడం! వినడానికి ఇది హాస్యాస్పదంగా అనిపించినా.. దీని వెనుక ఉన్న సామాజిక సత్యం భయంకరమైనది. దేశంలో ఉద్యోగాలు లేక, భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తున్న తరుణంలో యువత రోడ్లెక్కి పోరాడలేక ఆన్లైన్ వేదికలను యుద్ధభూమిగా మార్చుకుంది. ప్రజాధనం ఎటు పోతుందో నిలదీయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ప్రభంజనం.. ఇప్పటికైనా సాంప్రదాయ రాజకీయ పార్టీల కళ్లు తెరిపించాలి. యువతను తక్కువ అంచనా వేసి, వారి సమస్యలను హేళన చేస్తే.. ఆ హేళన నుంచే వ్యవస్థలను కూకటివేళ్లతో కదిలించే సరికొత్త విప్లవాలు పుడతాయని ఈ ‘బొద్దింకల సైన్యం’ నిరూపించింది. ఇది కేవలం ఒక ఆన్లైన్ పేజీ కాదు, దేశ యువత ఆత్మగౌరవ ప్రకటన..!
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
