Welcome to the new party.. but don’t repeat the old mistakes..! : తెలంగాణ రాష్ట్ర సేన (TRS) ఆవిర్భావాన్ని విసికె స్వాగతిస్తున్నది. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకొనే హక్కును రాజ్యాంగం ఇచ్చింది. కల్వకుంట్ల కవిత గారికి ఆ హక్కు వుంది. దానిని ఆమె వినియోగించుకున్నది. తెలంగాణ అనే పేరుతో ఒక రాజకీయ పార్టీ వుండాలని ఆవిడ ఆలోచించడం అభినందించాల్సిన విషయం. అది తెలంగాణ రాష్ట్ర సమితిని గుర్తు చేసేలా వుండటం ఆమె ఉద్దేశపూర్వకంగా చేసిందనే భావించాలి. కానీ టిఆర్ఎస్ నడిచిన బాటలో కల్వకుంట్ల కవిత గారు నడవకూడదు. కొద్ది మంది సంపన్నుల ప్రయోజనాలను తెలంగాణ ప్రయోజనాలుగా చూపి, చివరికి తెలంగాణను ఉత్తరాది సంపన్న పెట్టుబడిదారులకు అప్పగించాడు కెసిఆర్. కల్వకుంట్ల కవిత గారు ఉత్తరాది సంపన్న కార్పోరేట్ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడితేనే తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఒక రాజకీయ పార్టీగా ప్రజలు గుర్తిస్తారు. అలాగే పార్టీని పెట్టడం సులువు. దానిని నిలబెట్టడం, కొనసాగించడం చాలా కష్టం. ప్రభావాలకు, ప్రలోభాలకు లోనుకాకుండా ఒక పార్టీని నడపడం అంత సులువు కాదు. కవిత గారు చాలా సహనం, సంయమనం చూపాలి. అలాగే సొంత అన్న మీద కోపంతో, బావ మీద ఆగ్రహంతో పెట్టిన పార్టీ అనే అపవాదు రాకుండా, విధానపరమైన నిర్ణయాలు, ఒక తాత్విక చింతన ఆధారంగా ఆ పార్టీ ఎదగాలి. ఇప్పటికైతే, ఆ పార్టీకి ఒక స్థిరమైన, కచ్చితమైన సిద్ధాంతం, తాత్వికత, భావజాలం వున్నట్టు కనిపించడం లేదు. భవిష్యత్తులో వాటిని సమకూర్చుకుంటారో లేదో వేచి చూడాలి. పుట్టగానే పరుగు పందెంలో గెలవాలని ఆశించడం సరైనది కాదు. కాబట్టి, కొత్త రాజకీయ పార్టీలను ఆహ్వనిద్దాం. కల్వకుంట్ల కవిత గారికి అభినందనలు.
డాక్టర్ జిలుకర శ్రీనివాస్
అధ్యక్షులు
విసికె తెలంగాణ రాష్ట్ర కమిటీ
