“కాకతీయ రిపోర్టర్”పై అక్రమ కేసును ఖండించాలి
“Cannot stop the letter with irregular cases” : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘కాకతీయ’ ప్రతినిధిపై అక్రమ కేసులు బనాయించిన ఉదంతం కేవలం ఒక జర్నలిస్టుపై జరిగిన వ్యక్తిగత దాడి కాదు. ఇది యావత్ జర్నలిస్టు లోకంపై, భావప్రకటనా స్వేచ్ఛపై జరిగిన వ్యవస్థీకృత దాడిగా చూడాలి. అక్రమాలను ఎండగడితే అక్కున చేర్చుకోవాల్సిన రక్షక భటులే, భక్షకులుగా మారి కుట్రలు పన్నడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఒక డాక్టరును బెదిరించి, ఒత్తిడి చేసి, తనకు తెలియని వ్యక్తిపైనే ఫిర్యాదు చేయించారంటే.. ఇక్కడ వ్యవస్థ ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవాలి.
“Cannot stop the letter with irregular cases”
ప్రభుత్వాలు, అధికారులు, జర్నలిస్టుల్లోనూ కొందరు అనుసరిస్తున్న అత్యంత ప్రమాదకరమైన ధోరణి ‘జర్నలిస్టులను విభజించడం’. పెద్ద పత్రికలు, చిన్న పత్రికలు, సీనియర్లు, జూనియర్లు అంటూ వర్గీకరించి.. చిన్న పత్రికల ప్రతినిధులను వేధించడం ద్వారా సమాచారాన్ని నొక్కేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. గుర్తుంచుకోండి.. వార్తకు పరిమాణం ఉండదు, వాస్తవం మాత్రమే ఉంటుంది. పత్రిక ఏదైనా, విలేకరి ఎవరైనా.. వారు రాసే అక్షరం సమాజ హితం కోసమే. క్షేత్రస్థాయిలో పనిచేసే చిన్న పత్రికల విలేకరులే ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని తక్కువ చేసి చూడటం అంటే ప్రజల గొంతును నొక్కడమే. ఇక్కడ మరో విషయం అర్ధం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు చిన్నపత్రికలు, డిజిటల్ మీడియా నిర్వహించుకునే వారిలో ఎక్కువ శాతం గతంలో పెద్దపత్రికల్లో పని చేసిన అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారనేది మరువొద్దు. దురదృష్టం ఏంటంటే సీనియర్లు, రాయగలిగిన జర్నలిస్టులను సైతం తక్కువ చేసే దొరణి, అసలు జర్నలిస్టులే కాదనే దొరణి పెరుగటమే.
“Cannot stop the letter with irregular cases”
ఇక కాకతీయ రిపోర్టర్ పై జరిగిన ఈ ఘటనలో అత్యంత బాధాకరమైన విషయం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి పాత్ర ఉందనే ఆరోపణల్లో నిజం ఉన్నట్లు అయితే ఇది క్షమించరాని నేరంగా చూడక తప్పదు. ఖాకీల ప్రాపకం కోసం, సొంత వృత్తి ధర్మాన్ని విస్మరించి తోటి జర్నలిస్టుపై కుట్రకు సహకరించడం జర్నలిజం చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. పదవులు అలంకారం కోసం కాదు, తోటి జర్నలిస్టులకు ఆపద వస్తే అండగా నిలబడటం కోసం. అధికారుల కళ్లల్లో ఆనందం చూడటం కోసం సహచరుల గొంతు కోసే ‘కోవర్టు’ జర్నలిస్టుల వల్ల వృత్తికే మచ్చ వస్తోంది. ఇలాంటి వారిని సమాజం ఛీత్కరించుకోవాలి. ఇలాంటి ఘటనలు వరంగల్ జిల్లాలోనూ లేకపోలేదు. అలాంటి ఘటనలకు స్వతహాగా నేనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన ఘటనను ఈ ప్రాంత జర్నలిస్టులకు, సమాజానికి మరోసారి గుర్తుచేస్తున్న.
“Cannot stop the letter with irregular cases”
ఇక నిజాలు రాసే జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టడంలో, చీకటి ఒప్పందాల్లో భాగంగా కొందరికి సహాకరించెందుకు జర్నలిస్టులను బలిచేస్తూ అధికారులు చట్టాన్ని తమ జేబులో ఉంచుకోవాలని చూడటం హాస్యాస్పదం. కాకతీయ రిపోర్టర్ పై అక్రమ కేసు ఘటనలో డాక్టర్ స్వయంగా “నాకు జర్నలిస్ట్ ఎవరో తెలియదు.. పోలీసుల ఒత్తిడి వల్లే ఫిర్యాదు చేశాను” అని వెల్లడించడంతో పోలీసుల నగ్న స్వరూపం బయటపడింది. డిజిపి తక్షణమే జోక్యం చేసుకుని ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో పోలీసు శాఖపై ప్రజలకున్న నమ్మకం సడలిపోతుంది. తక్షణమే “కతీయ రిపోర్టర్”పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. జర్నలిస్టులను వేధించే అధికారులను విధులనుంచి తప్పించాలి. గతంలో కూడా అనేక సందర్భాల్లో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరిగాయి. అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు కొత్తేమీ కాదు. కానీ, సత్యం ఎప్పుడూ ఓడిపోదు. వార్త రాస్తే జైలుకు పంపిస్తామంటే.. ప్రతి విలేకరి ఒక అగ్నిపర్వతంలా మారుతాడు. వేధింపులు ఎక్కువైతే కలం మరింత పదునెక్కుతుంది. ఈ స్పృహతో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు యూనియన్లు గుర్తించి ఇలాంటి ఘటనలను ఖండించాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
రాజేందర్ దామెర (దారా) సీనియర్ జర్నలిస్ట్ TWJF హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు
rajenderdamera@mail.com
