భీమారంలో బరితెగించిన ప్రైవేట్ కళాశాల..
‘స్పెషల్ రూము’ల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు..
‘Money’ scam in KU degree exams..!? అది ఒక విద్యా నిలయం.. సరస్వతీ పుత్రులను తీర్చిదిద్దాల్సిన పవిత్ర క్షేత్రం. కానీ, అక్కడ అక్షరాల కంటే నోట్ల కట్టలకే విలువ ఎక్కువ. కాకతీయ విశ్వవిద్యాలయం (KU) పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలు ఇప్పుడు అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ముఖ్యంగా భీమారం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కళాశాల వేదికగా సాగుతున్న ఈ ‘పరీక్షా దందా’ విద్యా వ్యవస్థ పరువును బజారున పడేస్తోందనే ప్రచారం సాగుతున్నది. హనుమకొండకు సమీపంలోని భీమారం ప్రాంతంలోని ఓ కళాశాల వ్యవహారం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. “అరుణోదయం” కావాల్సిన చోట అక్రమాల చీకట్లు ముసురుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘Money’ scam in KU degree exams..!?
రేటు ఫిక్స్.. పరీక్షా కేంద్రంలో ‘ప్రైవేట్’ రాజ్యం..!
పరీక్షా కేంద్రం అంటే క్రమశిక్షణకు మారుపేరు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. డబ్బు చెల్లించిన విద్యార్థులకు ‘రాచమర్యాదలు’ జరుగుతున్నట్లు సమాచారం. ఫెయిల్ అవుతామనే భయం ఉన్న విద్యార్థులను టార్గెట్ చేసి, సబ్జెక్టుకు ఇంత అని రేటు కడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. 2 వేల నుండి రూ. 5 వేల వరకు వసూలు చేస్తూ ‘పాస్ గ్యారెంటీ’ ఇస్తున్నట్లు పరీక్షా కేంద్రంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నగదు చెల్లించిన వారిని ప్రత్యేక గదుల్లో కూర్చోబెట్టి, వారికి ఇన్విజిలేటర్లే స్వయంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటం గమనార్హం. విశ్వవిద్యాలయ పరిపాలనా భవనానికి కేవలం రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇలాంటి పరిస్థితిలో పరీక్షల నిర్వహణ జరుగుతున్నా, కేయూ పరీక్షల విభాగం అంతగా పట్టించుకోకపోవటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరంతరం తనిఖీలు చేయాల్సిన స్క్వాడ్ బృందాలు ఈ కళాశాల వైపు కన్నెత్తి చూడకపోవడం, ఒక వేళ చూసినా అంతగా పట్టించుకోకపోవటం వెనుక ఉన్న మర్మమేంటో అర్థం కావడం లేదని పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
‘Money’ scam in KU degree exams..!?
కష్టపడి చదివే విద్యార్థులు ఒకవైపు గంటల తరబడి శ్రమిస్తుంటే, మరోవైపు డబ్బున్న వారు అడ్డదారిలో మార్కులు కొనుక్కోవడం విద్యా వ్యవస్థలో అసమానతలకు దారితీస్తోంది. ఇది కేవలం పరీక్షల నిర్వహణలో వైఫల్యం మాత్రమే కాదు, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడమే. ఇప్పటికైనా భీమారంలోని కళాశాలలో వెంటనే ఉన్నత స్థాయి అధికారులతో తనిఖీలు చేయించాల్సిన అవసరం ఉందని, పరీక్షలు జరిగిన రోజుల్లో కళాశాలలోని సీసీ కెమెరాల రికార్డింగ్‌లను స్వాధీనం చేసుకుని పరిశీలించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, అక్రమాలకు పాల్పడినట్లు తేలితే సదరు కళాశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్య అనేది వ్యాపారం కాదు, అది ఒక తరం భవిష్యత్తు. కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ ‘మాస్ కాపీయింగ్’ దందాను అరికట్టకపోతే, కేయూ డిగ్రీ పట్టా అంటే కేవలం ‘కాగితం ముక్క’ అనే స్థాయికి దిగజారిపోయే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు.
