- వైద్యం నుంచి చట్టసభ వరకు.. ఒక అజేయ ప్రస్థానం!
Orugallu Dhruvathara’s ‘Kadiam Kavya’
తెలంగాణ రాజకీయాల్లో మేధావిగా, నిష్కళంక రాజకీయ నాయకుడిగా పేరున్న కడియం శ్రీహరి వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ, డాక్టర్ కావ్య తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. తండ్రి అందించిన రాజకీయ విలువలను పుణికిపుచ్చుకుంటూనే, యువతరం ఆలోచనలకు అనుగుణంగా ఆమె ముందుకు సాగుతున్నారు. కేవలం పదవి కోసం కాకుండా, ప్రజా సేవ కోసం వైద్య వృత్తిని వదిలి రాజకీయ రణక్షేత్రంలోకి రావడం ఆమె నిబద్ధతకు నిదర్శనం. ఒక వైద్యురాలిగా కావ్యకు సమాజంలోని అట్టడుగు వర్గాల కష్టాలు తెలుసు. ఆసుపత్రిలో రోగుల బాధలను చూసిన కళ్లతో, ఇప్పుడు ప్రజల సామాజిక, ఆర్థిక ఇబ్బందులను ఆమె విశ్లేషిస్తున్నారు. “వైద్యం ప్రాణాన్ని కాపాడితే.. రాజకీయం జీవితాలను మారుస్తుంది” అనే నమ్మకంతో ఆమె ముందుకు సాగుతున్నారు. పార్లమెంటులో ఆమె ప్రసంగాలు కేవలం గణాంకాలతో కాకుండా, క్షేత్రస్థాయి వాస్తవాలతో నిండి ఉండి అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
Orugallu Dhruvathara’s ‘Kadiam Kavya’
వరంగల్ అంటే కేవలం ఒక నగరం కాదు, అది తెలంగాణ సంస్కృతికి గుండెకాయ. అటువంటి చారిత్రక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ప్రధానమైన అంశాలపై దృష్టి సారిస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తనదైన ముద్ర వేసేందుకు ఆమె ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. తన వృత్తిపరమైన అనుభవంతో వైద్య సదుపాయాల మెరుగుదల. వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి పెండింగ్ అంశాలపై పట్టు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ప్రత్యేక పథకాల రూపకల్పన చేస్తున్నారు. వరంగల్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, టెక్స్టైల్ పార్క్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం, కాకతీయ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థల అభివృద్ధికి కేంద్ర నిధులను రాబట్టడంపై ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు జరుగుతున్న కృషిలో ఆమె భాగస్వామ్యం ముందువరుసలో ఉంటున్నది.
Orugallu Dhruvathara’s ‘Kadiam Kavya’
కావ్య కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, ఆధునిక ఆలోచనలు గల విద్యావంతురాలు. ప్రజా క్షేత్రంలో గల్లీ గల్లీ తిరిగి ప్రజల సమస్యలను వినడం. చట్టసభలో వరంగల్ అభివృద్ధి కోసం కేంద్ర నిధులను రాబట్టేలా తార్కిక పోరాటం చేయడం. ఆమె శైలిలో అణకువ ఉంది, అంతకు మించి అన్యాయాన్ని ఎదిరించే తత్వం ఉంది. ‘కావ్య’ ప్రత్యేకత ఆమె మాట తీరు. ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు కూడా ఎంతో హుందాగా, సంస్కారవంతంగా వ్యవహరిస్తూనే.. సమస్యలపై మాత్రం సింహంలా గర్జిస్తారు. రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక మెట్టు మాత్రమే కావచ్చు, కానీ గమ్యాన్ని చేరుకోవడానికి కావాల్సింది సొంత ప్రతిభ. కడియం కావ్య ఎన్నికల ప్రచారంలో చూపిన తెగువ, విమర్శలను తిప్పికొట్టిన తీరు ఆమెను ఒక ‘పవర్ హౌస్’ గా నిలబెట్టాయి. ఆమె మాటల్లో స్పష్టత ఉంటుంది, చేతల్లో నిజాయితీ ఉంటుంది. వరంగల్ ప్రజలకు ఆమెను మరింత దగ్గర చేశాయి. ఒక గృహిణిగా, వైద్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. ఒక పార్లమెంటు సభ్యురాలిగా నిరంతరం ప్రజా సేనలో నిమగ్నమై ఉండటం ఆమెలోని కార్యదక్షతకు అద్దం పడుతోంది.
Orugallu Dhruvathara’s ‘Kadiam Kavya’
ఓరుగల్లు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్లమెంటు సాక్షిగా కావ్య తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. తెలంగాణ హక్కుల కోసం, వరంగల్ ఆత్మగౌరవం కోసం ఆమె చేస్తున్న పోరాటం అభినందనీయం. మహిళా లోకానికి ఆమె ఒక స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు. ఓరుగల్లు కోట బురుజులంత దృఢమైన సంకల్పంతో, రామప్ప శిల్పాలంతటి స్పష్టమైన విజన్‌తో కడియం కావ్య తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
(దారా)
‘జన నిర్ణయం’ ప్రత్యేక కథనం
