నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ వాహనాల రవాణా…
Breaking the rules SRSP canal shake : సాగునీరు అందించే ప్రాణాధారమైన SRSP కాలువ ఇప్పుడు క్రషర్ నిర్వాహకుల గుప్పిట్లో చిక్కుకుంది. హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలం కొత్తగట్టు, మల్కపేట గ్రామాల పరిధిలో స్టోన్ క్రషర్ల నిర్వాహణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నిబంధనలను బేఖాతరు చేస్తూ స్టోన్ క్రషర్ల భారీ వాహనాలు కాలువ గట్టును తమ సొంత రహదారిగా వాడుకుంటుండటంతో కాలువ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని పలువురు వాపోతున్నారు.
Breaking the rules.. SRSP canal shake
సాగునీటి పారుదల శాఖ నిబంధనల ప్రకారం కాలువ గట్లపై భారీ యంత్రాలు లేదా లోడు వాహనాలు నడపడూడదు. కానీ, కొత్తగట్టు, మల్కపేట గ్రామాల్లోని క్రషర్ల నుంచి వెళ్లే భారీ టిప్పర్లు ప్రతిరోజూ కాలువ గట్టుపైనే రాకపోకలు సాగిస్తున్నాయి. టన్నుల కొద్దీ బరువుతో వెళ్లే ఈ వాహనాల వల్ల కాలువ గట్లు కుంగిపోతున్నాయి. భవిష్యత్తులో నీరు విడుదల చేసినప్పుడు గట్లు తెగి పొలాలు మునిగిపోయే ప్రమాదం పొంచి ఉందని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Breaking the rules.. SRSP canal shake
పథకం ప్రకారం పూడ్చివేత..
కేవలం రవాణా కోసమే కాకుండా, తమ సౌకర్యం కోసం క్రషర్ల నిర్వాహకులు కాలువను మెల్లమెల్లగా పూడ్చివేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మట్టిని పోసి కాలువ వెడల్పును తగ్గిస్తూ, తమ వాహనాలు తిరగడానికి వీలుగా దారిని వెడల్పు చేసుకుంటున్నారు. దీనివల్ల కాలువలో నీటి ప్రవాహం తగ్గి, చివరి ఆయకట్టు రైతులకు చుక్క నీరు కూడా అందని పరిస్థితి ఏర్పడుతోంది.
Breaking the rules.. SRSP canal shake
కళ్ల ముందే కాలువ కరిగిపోతున్నా, భారీ వాహనాలు తిరుగుతూ కాలువ గట్లను ధ్వంసం చేస్తున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ”మేము పంటలు పండించుకోవడానికి నీళ్లు రావాల్సిన కాలువ ఇది. కానీ క్రషర్ల వాళ్లు దీన్ని రోడ్డుగా మార్చేశారు. కాలువను పూడ్చేస్తుంటే మా పొలాలకు నీళ్లు ఎలా వస్తాయి..? అధికారులు తక్షణమే స్పందించి కాలువను కాపాడాలి.” అని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి కాలువ గట్టుపై రవాణాను అరికట్టడంతో పాటు, ఆక్రమణలను తొలగించి రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు భావిస్తున్నారు. కొత్తగట్టు, మల్కపేట గ్రామాల పాలకవర్గం నఇబంధనలకు విరుద్దంగా సాగుతున్న క్రషర్ల చర్యలను కట్టడిచేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
