- హాజరు మాత్రం 100శాతం పక్కా..!
- నడికూడ మండలం రాయపర్తి పిహెచ్సీలో లోపించిన పర్యవేక్షణ…
- విధులు నిర్వహించకుండా వేతనం పొందుతున్న వైనం…
- తక్షణమే విచారణ జరిపి చర్యలు చేపట్టాలి : ఎమ్మార్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ డిమాండ్
A “medical” officer who is not seen in Rayaparthi “PHC” ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేదవాడికి ప్రాణదానం చేసే దేవాలయం. కానీ హనుమకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్సీ)లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ ఒక మెడికల్ ఆఫీసర్ తీరు స్థానికంగా చర్చానీయాంశంగా మారుతోంది. సదరు అధికారి ఆసుపత్రికి వస్తున్నారో లేదో తెలియని పరిస్థితి ఉందని పలువురు వాపోతున్నారు. హాజరు పట్టికలో మాత్రం సంతకాలు పడిపోతున్నాయనేది గమనార్హం.
A “medical” officer who is not seen in Rayaparthi “PHC”..!?
గత కొన్ని నెలలుగా నడికూడ మండలం రాయపర్తి పీహెచ్సీలో ఇదే తంతు కొనసాగుతోందనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. రోగులు ఆసుపత్రికి వచ్చి “డాక్టర్ గారు ఎక్కడ..?” అని అడిగితే, సిబ్బంది నుంచి నీళ్లు నమిలే సమాధానాలే వస్తున్నట్లు తెలుస్తోంది. రికార్డుల ప్రకారం సదరు మెడికల్ ఆఫీసర్ ప్రతిరోజూ విధులకు హాజరవుతున్నట్లు చూపుతున్నారని, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ డాక్టర్ ముఖం చూసి నెలలు గడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విధులు నిర్వహించకుండానే వేతనం మాత్రం దర్జాగా పొందుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ జ్వరం వచ్చినా, అత్యవసర వైద్యం కావాలన్నా నడికూడ ప్రాంత ప్రజలకు రాయపర్తి పిహెచ్సీ ఆసుపత్రే దిక్కు. తీరా అక్కడికి వెళ్తే డాక్టర్ లేకపోవడంతో, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వేల రూపాయలు కుమ్మరించుకోవాల్సి వస్తోందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “వైద్యాధికారి వస్తారని గంటల కొద్దీ వేచి చూస్తున్నాం, కానీ ఆ అధికారి దర్శనం మాత్రం నెలల తరబడి కలుగని పరిస్థితి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ”విధులు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తూ 100శాతం హాజరు వేసుకుంటూ వేతనం పొందటం అంటే ప్రజల సొమ్మును దోచుకోవడమే అవుతుందని పలు ప్రజాసంఘాల ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రభుత్వ వైద్యంపై నమ్మకం సడలిపోతోందని” పలువురు భావిస్తున్నారు.
A “medical” officer who is not seen in Rayaparthi “PHC”..!?
- తక్షణమే విచారణ జరుపాలి : ఏకు శంకర్ ఎమ్మార్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి
ఉన్నతాధికారుల కళ్లుగప్పి ఈ అక్రమ హాజరు వ్యవహారం ఎలా సాగుతోందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది..? బయోమెట్రిక్ లేదా మాన్యువల్ రిజిస్టర్లలో సంతకాలు ఎలా పడుతున్నాయి..? అసలు ఆ పిహెచ్సీలో బయోమగట్రీక్ విధానం ఉందా లేదా..? లేకపోతే ఎందుకు లేదు..? రిజిస్టర్ లో హాజరు ఎలా పడుతుంది..? అనే కోణంలో విచారణ జరపాలి. తక్షణమే జిల్లా ఆరోగ్య శాఖాధికారులు స్పందించి, ఆ మెడికల్ ఆఫీసర్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలి.
