Dear telangana cm revanth ready : ప్రతీ విద్యార్థి ఏదో ఒక కులం, ఒక మతంలో పుడతాడు. వివక్షను తను పుట్టిన వూరిలో, తన పట్టణంలో అనుభవిస్తాడు. తను చేరిన స్కూలులో తోటి విద్యార్థుల వల్ల, కులగజ్జి గల టీచర్ల వల్ల కులపరమైన వివక్షతో గాయపడుతాడు.
అన్ని వర్గాల విద్యార్థులు కలిసి ఒకే చోట చదవడం ఒక ఆదర్శం. గురుకులాల పేరుతో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే చదువు చెప్పే ఒక విద్యా వ్యవస్థ వేలయేండ్లు కొనసాగింది. అందువల్ల మిగతా కులాలన్నీ చదువుకు దూరమయ్యాయి. నిజాం రాజు హైదరాబాదులో స్కూళ్లు పెట్టాడు. వాటిలో కూడా వివక్ష అమలైంది. సూదరోళ్లను లోపల,అంటరానివాళ్లను బయట కూచుండ బెట్టారు. బ్రిటిష్ వాళ్లూ పెట్టారు. అందులో కూడా అంతే. అంబేద్కర్ క్లాసు బయట కూర్చొని పాఠాలు విన్నాడు.
నాకు ఒకటో తరగతి యింకా గుర్తుంది. నన్ను, మా అన్నలను క్లాసు బయటే కూర్చే బెట్టారు. నీళ్ల బెల్ కొడితే దూప తీర్చుకోవడానికి నేను, మా అన్న వెంకటే్, మా తమ్ముడు శంకరు అర కిలోమీటరు దూరం ఉరికి నీళ్లు తాగి మళ్లీ క్లాసుకు వురుకొచ్చేవాళ్లం. లేటయితే టీచరు బాగా కొట్టేవాడు. నా తోటి దళిత విద్యార్థులనయ చదువు చెప్పకుండానే, పంతుళ్లు దారుణంగా బెత్తం పేరుతో జువ్వాడే బరిగెలతో కొట్టేవారు. ఆ దెబ్బలకు భయడి దాదాపు అంతా బడి మానేసి కాపోళ్లకు, ఆసాములకు జీతం పోయారు. పైగా సదరు పంతుళ్లు ఏమనేవాళ్లో తెలుసా? మీరు గొడ్డుకూర తింటారు. మీ నాలుక మందం. నోరు తిరగదు. మీకు సదువు అబ్బదు. మీకు బడి ఎందుకురా అని హేళన చేసేవాళ్లు. రెండు యేండ్లు మా బడిలో వున్న నీళ్ల కుండలో మేము నీళ్లగ్లాసుతో మా దాహం తీర్చుకోలేక పోయాం. మా బాధచూసి అటెండరు మల్లయ్య గ్లాసు ఎత్తి మా దోసిళ్లలో పోస్తే అవి తాగినం. అది కూడా ఒకటి రెండు సార్లే.
ఒకరోజు మా బాపు నీళ్లు తాగడానికి యింటికొచ్చిన మమ్మల్ని ఏమైందని అడిగాడు. మమ్మల్ని నీళ్లు తాగనివ్వడం లేదని చెప్పినం. మా బాపు ఆ కుండ పగలగొట్టే పనిని మా పెద్దబాపు సెంద్రెయ్యకు అప్పగించాడు. ఆయన వొచ్చి మా హెడ్మాస్టరును బాగా తిట్టి, కుండ పగలగొట్టాడు.
Dear telangana cm revanth ready
రేవంత్ రెడ్డి గారూ, మీకు సామాజిక వాస్తవమే కాదు, విద్యా వాస్తవికత కూడా తెలియదు. హంటర్ కమీషన్ కు ఫూలే ఒక వినతిపత్రం సమర్పించాడు. మా శూద్ర, అతిశూద్ర పిల్లల పట్ల సవర్ణ పంతుళ్లు వివక్ష చూపుతున్నారనీ, మా పిల్లలకు మా వాళ్లే సరిగా చదువు చెప్పగలరని, ప్రత్యేకంగా బిసి, ఎస్సీలకు, ఆడపిల్లలకు విడిగా బడులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశాడు.
ఐఐటీ, సెంట్రల్ యూనివర్శిటీ, ఐఐఎం వంటి వాటితో పాటు, మీరు ప్రమోట్ చేసే ప్రయివేటు విద్యాసంస్థలలో ఇప్పటికీ ఫూలే చెప్పిన వివక్ష కొనసాగుతూనే వుంది. ఈ వివక్షను తాళలేక విద్యార్థులు చాలామంది మధ్యలో చదువు మానేశారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పార్లమెంటరీ కమిటీ ఈ విషయం మీద కాంగ్రెస్ హయాంలో ఒక రిపోర్ట్ కూడా ప్రకటించింది.
కులం ఒక వాస్తవం. విద్యార్థులకూ, పంతుళ్లకూ ఆ స్వభావం వుంటుంది. ఎస్టీ ఎస్సీ బిసీ హాస్టల్స్ ఒకప్పుడు బంగారు బాతులు. వాటి వార్డెన్లు మెజారిటీగా పై వర్గాల వారే వుండేవాళ్లు. నేనూ వాటిలోనే చదువుకున్నాను. మాకు ఏనాడూ నాణ్యమైన తిండి పెట్టలేదు. మా పేరు మీద వచ్చే డబ్బులు తిని వార్డెన్లు సంపన్నులు అయ్యారు. వారి పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. మేము ఇంకా పేదరికంతో పోరాడుతున్నాము.
Dear telangana cm revanth ready
మా వర్గాలకు అప్పటి ఎపిఆర్జేసీలో గానీ జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో గానీ సీటు ఇచ్చేవారు కాదు. రిజర్వేషన్ సరిగా అమలు చేసేవారు కాదు. ఒకవేళ రిజర్వేషన్ అమలు చేసినా కూడా వందలో మాకు పదిహేను సీట్లు మాత్రమే ఇచ్చేవాళ్లు. అన్ని రకాల వివక్ష, దోపిడీకి గురై వెనకబడేయబడిన మా వర్గాలను ముందుకు తీసుకు రావడానికి ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ హాస్టళ్లు పెట్టారు. వాటిలోనే కడియం శ్రీహరి, ఘంటా చక్రపాణి కూడా చదివారు. అలా ప్రత్యేక హాస్టల్, రెసిడెన్సీ స్కూల్స్లో అగ్రకుల విద్యార్థులకు కొన్ని సీట్లు ఇచ్చి, మీరనే సమ్మిళిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఫలితంగా మా వర్గాల పిల్లలు విద్యాపరంగా ఎదుగారు. కొన్ని ఉద్యోగాలు పొందారు. పైగా మా సాంఘిక సంక్షేమ, బిసి సంక్షేమ, గిరిజన సంక్షేమ నిధులతో మాకు కేటాయించిన స్కూళ్లు, కాలేజీలు నడిచాయి. జనరల్ ఫండ్సు మాకోసం ఖర్చు చేశారని అనుకోను.
మా మీద వివక్షతో మా రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రతిభలేని పిల్లల కొట్టాలుగా మీ సవర్ణ పంతుళ్లు, లెక్చరర్లు, సవర్ణ ప్రిన్సిపాల్స్, స్వార్థపరులైన మా వర్గ పంతుళ్లు కొంతమంది మార్చేశారు. అదిగో ఆ సమయంలో ఒక మేధో రక్షకుడు వచ్చాడు. ఆయన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. ఆయన నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు గొప్ప విజయాలను సాధించాయి. ఆయన మార్గంలో నడిచి బిసి రెసిడెన్షియల్ స్కూల్స్ యింకా ఎక్కువ విజయాలను నమోదు చేశాయి. మా నిధులు మాకొరకు కొద్ది మేరకైనా ఖర్చయ్యాయి. ఒక గొప్ప మార్పు మా వాళ్ల జీవితాలలో రాబోతుంది అనుకున్నాం. ఆయన రాజకీయ ప్రవేశంతో, అణగారిన వర్గాల పిల్లలకు మళ్లీ దురవస్థ మొదలైంది. ఆయన తర్వాత సెక్రెటరీ బాధ్యతలు తీసుకున్న ఐఏఎస్ అధికారులు అంతా రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థను నాశనం చేశారు. ఇప్పటికీ చేస్తూనే వున్నారు. ఆ కోవలో మీరూ చేరారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనే భావన ఒక ఆదర్శంగా బావుంటుంది. కానీ, మా వర్గాలకు అది పెద్ద నష్టం. మా అవసరాలు, మా మానసిక స్థితి, మా సాంస్కృతిక నేపథ్యం మీకు తెలియదు అనుకోను. మీరు కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల కొరకే ఈ కొత్త రాగం ఎత్తుకున్నారు. మా పిల్లలను చదువుకు దూరం చేసే యోచన మీది. ఒకేచోట చదివితే కులం పోతుందని మీకు ఎవరు చెప్పారోగానీ, వారికి కనీస అవగాహన గానీ కాలానికి సంబంధించిన పరిజ్ఞానం గానీ లేకపోయి వుండవచ్చు. స్నేహం వల్ల కుల వ్యవస్థ సమసిపోదు. స్నేహం ఒక మానవీయ సంబంధం. కులం ఒక సామాజిక నియమం. అదొక నేర వ్యవస్థ. అది చదువుకున్న వాళ్లనూ, చదువురానివాళ్లనూ ఎప్పుడూ ఒక కుటుంబంగా, ఒక సంఘంగా కలిసి బతకనీయదు.
సిఎం గారూ,
మీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కాలేజేస్ అనే చెత్త ఆలోచనకు మతిలేని మా వర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు వత్తాసు పలక వచ్చు. కానీ మా వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సత్యాన్ని మీరు దయచేసి గమనించాలి.
- డాక్టర్ జిలుకర శ్రీనివాస్ విసికె తెలంగాణ అధ్యక్షుడు
