What if data protection comes at the cost of protecting the news itself!..? ప్రభుత్వాలు, అధికారుల అవినీతి లేదా అక్రమాలను బయటపెట్టేందుకు జర్నలిస్టులు సమాచారాన్ని సేకరిస్తారు. ఇందుకోసం పత్రాలు, అధికారిక రికార్డులతో పాటు తమకు తెలిసిన సమాచారాన్ని రహస్యంగా అందించే వ్యక్తుల సహకారం కూడా తీసుకుంటారు. అయితే ఈ సమాచార సేకరణకు అడ్డంకులు ఏర్పడితే ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అనేక వాస్తవాలు వెలుగులోకి రాకుండానే మిగిలిపోతాయి. ఇప్పుడు డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టంలోని కొన్ని నిబంధనలు ఇలాంటి ఆందోళనలకు కారణమవుతున్నాయి.
వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని అనుమతి లేకుండా సేకరించడం, ఉపయోగించడం నుంచి రక్షించడమే డేటా రక్షణ చట్టం ప్రధాన ఉద్దేశం. కానీ అవినీతి, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై పరిశోధన చేసే జర్నలిస్టులకు తగిన మినహాయింపులు లేకపోతే సమస్యలు తలెత్తుతాయి. ఉదాహరణకు, ఒక అధికారి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆధారాలు సేకరించి వార్త ప్రచురిస్తే, తన వ్యక్తిగత సమాచారం అనుమతి లేకుండా ఉపయోగించారంటూ ఆ వార్తను తొలగించాలని సంబంధిత వ్యక్తి కోరే పరిస్థితి ఏర్పడవచ్చు. చట్టపరమైన చర్యలు, భారీ జరిమానాల భయం కూడా మీడియా సంస్థలను వెనక్కి తగ్గించే ప్రమాదం ఉంది. మరోవైపు, సమాచార హక్కు చట్టానికి చేసిన సవరణల వల్ల ప్రభుత్వ అధికారుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రజా ప్రయోజనాలతో సంబంధం ఉన్నప్పటికీ పొందడం కష్టమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాచార హక్కు ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కల్పిస్తే, పరిశోధనాత్మక జర్నలిజం ఆ సమాచారంలోని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తుంది. ఈ రెండు మార్గాలూ బలహీనపడితే ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనం దెబ్బతినవచ్చు.
అయితే వ్యక్తిగత గోప్యతను విస్మరించలేం. ప్రజా ప్రయోజనం లేని వ్యక్తిగత వివరాలను ప్రచురించడాన్ని సమర్థించలేం. అదే సమయంలో గోప్యత పేరుతో అవినీతి, అక్రమాలను దాచిపెట్టే అవకాశం కూడా ఉండకూడదు. అందుకే ప్రజా ప్రయోజనాల కోసం జర్నలిస్టులు సమాచారాన్ని సేకరించడం, రహస్య సమాచార వనరులను రక్షించడం, ఆధారాలతో వార్తలను ప్రచురించడం వంటి అంశాలకు చట్టంలో స్పష్టమైన మినహాయింపులు అవసరం. వ్యక్తిగత గోప్యతను కాపాడటం ఎంత అవసరమో, ప్రజల సొమ్ము ఎలా ఖర్చవుతోంది, అధికారాలు ఎలా దుర్వినియోగమవుతున్నాయో తెలుసుకునే హక్కును కాపాడటం కూడా అంతే అవసరం. డేటా రక్షణ చట్టాలు ప్రజలను రక్షించాలి కానీ ప్రజల తరఫున ప్రశ్నించే మీడియా చేతులను కట్టేయకూడదు. గోప్యతకు రక్షణ, జర్నలిజానికి స్వేచ్ఛ, ప్రభుత్వానికి జవాబుదారీతనం ఈ మూడింటి మధ్య సమతుల్యత ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది.
దారా
rajenderdamera@gmail.com
