బీపీసీఎల్‌కు 90 ఎకరాల కేటాయింపుపై గ్రామస్థుల వినతి.. పేదలకు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో మాట్లాడతా: సర్పంచ్ సంపత్
The ‘Pancharayi’ land in Dandepalli should be allocated to the poor హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 439లో ఉన్న పంచరాయి భూమిని పేద ప్రజలకు న్యాయం చేసిన తర్వాతే ఇతర అవసరాలకు కేటాయించాలని గ్రామస్థులు కోరారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ గోలిపెల్లి సంపత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంపత్ మాట్లాడుతూ.. సర్వే నంబర్ 439లో 1991 నాటి సర్వే ప్రకారం సుమారు 240 ఎకరాల పంచరాయి భూమి ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఆక్రమణల కారణంగా సుమారు 170 ఎకరాలు మాత్రమే మిగిలిందని తెలిపారు. ఇందులో 90 ఎకరాలను బీపీసీఎల్‌కు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గ్రామంలో కనీసం ఒక్క గుంట భూమి కూడా లేని పేద కుటుంబాలు అనేకం ఉన్నాయని, ఈ నేపథ్యంలో పంచరాయి భూమిని ఇతర అవసరాలకు కేటాయిస్తే పేదల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. భూమి కేటాయింపు విషయంలో గ్రామంలోని నిరుపేదల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పేద ప్రజల పక్షాన నిలబడి, ప్రభుత్వంతో మాట్లాడి గ్రామస్థులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భూ సంస్కరణలు, పేదలకు భూ పంపిణీలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని సర్పంచ్ గుర్తుచేశారు. ప్రస్తుతం కూడా పేదల భూమి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు జన్ను ప్రసన్న, కట్కూరి రాజేందర్, జన్ను మహేష్, జాజాల మొగిలి తదితరులు పాల్గొన్నారు.
