- మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అశ్రునివాళి
Tearful tribute to former MLA Peddi Sudarshan Reddy
నేను తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని చూసినవాడిగా, పెద్ది సుదర్శన్ రెడ్డిని ఎరిగిన వాడిగా, నర్సంపేట ప్రాంతంతో మట్టిబంధం ఉన్నవాడిగా నర్సంపేట మట్టిలో కలిసిపోయిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర చూశాక ఈ నాలుగు మాటలతోనైనా అక్షర నివాళి రాయాలనిపించింది. మనిషిపై మనిషికి భిన్నభిప్రాయాలు, బేధాభిప్రాయాలు ఉండొచ్చు, రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ వాటన్నింటినీ కన్నీటితో కడిగేస్తున్నామనే విధంగా ఆయనకు విడ్కోలు పలికేందుకు కుల, మత, పార్టీలకతీతంగా తరలివచ్చిన జన సమూహాన్ని చూసి నాలో కలిగిన భావాలకు అక్షరరూపమే ఈ శ్రద్దాంజలి మాటలు.
మనిషి పుట్టిన క్షణమే మరణం కూడా అతని నీడగా ప్రయాణం మొదలుపెడుతుంది. మధ్యలో ఉండేది కేవలం జీవితం మాత్రమే. ఆ జీవితాన్ని ఎన్ని సంవత్సరాలు జీవించామనేది చరిత్ర అడగదు. ఎలా జీవించామనేదే కాలం గుర్తుంచుకుంటుంది. మనిషి చనిపోయినప్పుడు శ్మశానానికి వెళ్లే అడుగుల సంఖ్య అతని సంపదను చెప్పదు. అతను సంపాదించిన మనుషులను చెబుతుంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో కనిపించిన వేలాది అడుగులు ఒక రాజకీయ కార్యక్రమానికి హాజరైన జనసందోహం కాదు. ఒక మనిషి జీవితానికి ప్రజలు రాసిన చివరి వాక్యం. మాటలతో చెప్పలేని గౌరవానికి, మౌనంగా చెల్లించిన ఋణానికి అది సజీవ సాక్ష్యం. తెలంగాణ మలిదశ ఉద్యమం కేవలం రాజకీయ పోరాటం కాదు. అది అనేకమంది జీవితాలను అర్పించిన ఒక సామూహిక స్వప్నం. ఆ స్వప్నాన్ని తమ భుజాలపై మోసిన వారిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు. ఉద్యమం వీధుల్లో వినిపించిన నినాదాల వెనుక ఉన్న చెమటలో, ప్రజల ఆశల్లో, తెలంగాణ ఆకాంక్షల్లో ఆయన అడుగుల ముద్రలు ఉన్నాయి.
జీవితంలో పదవులు వస్తాయి… పోతాయి. అధికారం చేతులు మారుతుంది. కానీ మనిషి చనిపోయిన రోజు ప్రజలు తమ పనులను పక్కన పెట్టి స్వచ్ఛందంగా చివరి చూపు కోసం తరలి వస్తే, అది అధికారానికి వచ్చిన గౌరవం కాదు. వ్యక్తిత్వానికి వచ్చిన గౌరవం. మనిషి చివరి ప్రయాణం అతని జీవితానికి అద్దం పడుతుంది. ఆ అద్దంలో కొందరికి ఖాళీ కుర్చీలు కనిపిస్తాయి. కొందరికి అధికారపు జ్ఞాపకాలు కనిపిస్తాయి. మరికొందరికి మాత్రం వేలాది కన్నీటి చుక్కలు కనిపిస్తాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర ఆ మూడో చిత్రాన్ని చూపించింది. నర్సంపేట నేల ఆయనను నాయకుడిగా చూసి ఉండొచ్చు. కానీ ఆయన వెళ్లిపోయిన రోజు అదే నేల తన మనిషిని కోల్పోయిన బాధను వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు, సిద్ధాంతాలు, వర్గాలు అన్నీ ఆ క్షణంలో వెనక్కి వెళ్లిపోయాయి. మిగిలింది ఒక్కటే..ఒక మనిషిపై ప్రజలు చూపిన ప్రేమ. జీవితం చివరికి ఒక ప్రశ్న మాత్రమే అడుగుతుంది “నువ్వు ఎంతకాలం బతికావు..?” అని కాదు… “నీ కోసం ఎంతమంది కన్నీరు పెట్టుకున్నారు..?” అని. ఆ ప్రశ్నకు పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితం తన సమాధానాన్ని ఆయన అంతిమయాత్ర ద్వారానే చెప్పింది. మనిషి మరణిస్తాడు. అతని పేరు కూడా ఒకరోజు చరిత్ర పుస్తకాల పేజీల్లో కలిసిపోవచ్చు. కానీ అతని వల్ల మారిన జీవితాలు, అతని చేతిని పట్టుకున్న మనుషులు, అతన్ని గుర్తు చేసుకుంటూ తడిచే కళ్లు… అవి మరణించవు.
మరణం శరీరాన్ని మాత్రమే తీసుకుపోతుంది. మనిషి సంపాదించిన అభిమానాన్ని కాదు. కాలం అడుగులను చెరిపేయవచ్చు. కానీ మనసుల్లో పడిన ముద్రలను చెరపలేదు. అందుకే కొందరి అంతిమయాత్ర ముగింపు కాదు. అది వారు మనుషుల హృదయాల్లో ప్రారంభించిన మరో ప్రయాణం. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా, తెలంగాణ మలిదశ ఉద్యమ జ్ఞాపకాలలో, నర్సంపేట ప్రజల మనసుల్లో, ఆయనతో కలిసి నడిచిన వేలాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు.
———-
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి వినమ్ర అశ్రునివాళి.
– రాజేందర్ దామెర (దారా)
Editor – jananirnayam
