‘బొజ్జ బిక్షమయ్య’ జీవితం ఆధారంగా డాక్టర్ కాలువ మల్లయ్య రాసిన ‘అస్పృశ్య యోధుడు’ నవలపై విశ్లేషణ
As a witness to the coal seams A warrior’s ‘blood letter’ poem : సాహిత్యం అంటే కేవలం అక్షరాల కూర్పు కాదు, అది ఒక సామాజిక ఆయుధం. డాక్టర్ కాలువ మల్లయ్య మలిచిన ‘అస్పృశ్య యోధుడు’ నవల చదువుతుంటే ఆ అక్షరాలు మంటలై మనల్ని తాకుతాయి. ప్రముఖ ట్రేడ్ యూనియనిస్ట్, లాల్ నీల్ వాది కామ్రేడ్ ‘బొజ్జ బిక్షమయ్య’ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకున్న ఈ నవల, ఒక తరం పోరాటాలకు సజీవ సాక్ష్యం. ఒక జర్నలిస్టుగా, ట్రేడ్ యూనియన్ లో పని చేసిన అనుభవం కలిగిన నాకు ‘అస్పృశ్య యోధుడు’ నవల చదువుతుంటే, అది కేవలం కామ్రేడ్ బొజ్జ బిక్షమయ్య జీవితంలా అనిపించలేదు. అది అంటరాని వసంతపుకాలం, సమ్మెల హోరు, సైరన్ల మోత, జైలు కటకటాల వెనుక వినిపించే స్వేచ్ఛా గీతంలా అనిపించింది. బిక్షమయ్య జీవిత ప్రయాణాన్ని డాక్టర్ కాలువ మల్లయ్య ఒక కావ్యంగా మలచడం సాహిత్య చరిత్రలో ఒక అరుదైన సందర్భంగా చెప్పాలి. సింగరేణి గనుల్లో బొగ్గును వెలికి తీయడం ఎంత కష్టమో, అణచివేతకు గురైన సామాజిక వర్గాల నుంచి ఒక నాయకుడిని వెలికి తీయడం అంతకంటే కష్టం. వృత్తిరీత్యా కార్మికుడిగా, ప్రవృత్తిరీత్యా కార్మిక నాయకుడిగా బిక్షమయ్య చేసిన పోరాటం, ఆయన అంతర్మథన పోరాటం నా కళ్ళముందు కదలాడింది. ఒకప్పుడు వరంగల్ వీధుల్లో ట్రేడ్ యూనియన్ కార్యకర్తగా నేను చూసిన ఎర్రజెండా నీడ, ఈ నవలలోని ప్రతి పేజీలోనూ కనిపిస్తోంది. గని కార్మికుడు అంటే కేవలం ఉత్పత్తి చేసే యంత్రం కాదు, అతడొక మనిషి అని, అతడికి హక్కులు ఉంటాయని చాటిన బిక్షమయ్య ప్రయాణం సింగరేణి కార్మిక చరిత్రలో ఒక మైలురాయి. ‘బొగ్గుల పొయ్యిలా భగభగలాడటం’ అనే రచయిత ప్రయోగం, నిప్పుల మీద నడిచిన ఒక తరానికి నివాళిగా చెప్పక తప్పదు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు తమ పరిధి దాటి వెళ్లడానికి జంకుతారు. కానీ బిక్షమయ్య భిన్నమైన వ్యక్తి. ఆయన FCI లో విధులు నిర్వహిస్తూనే, సింగరేణి బొగ్గు గని కార్మికుల కడగండ్లను తన భుజాలకెత్తుకున్నారు. బొగ్గు బావుల్లో ప్రాణాలకు తెగించి పని చేసే కార్మికుల హక్కుల కోసం ఆయన ఎగురవేసిన ఎర్రజెండా, నాటి నిరంకుశ యాజమాన్యాలకు నిద్ర లేకుండా చేసింది. ఒక రంగానికి పరిమితం కాకుండా, పీడిత వర్గాల గొంతుకగా మారడమే అసలైన నాయకత్వ లక్షణమని ఈ నవల చాటిచెబుతోంది.
As a witness to the coal seams A warrior’s ‘blood letter’ poem
ఈ నవలను కేవలం భావోద్వేగాలతో కాకుండా, చారిత్రక వాస్తవాలతో తీర్చిదిద్దారు. బొగ్గు గని కార్మికుల జీవితం, పల్లెల్లోని వెక్కిరింతలు, బడిలో ఎదురైన అవమానాలు ఇవన్నీ చదువుతుంటే మన కళ్లు చెమర్చుతాయి.రాజకీయ ఖైదీగా జైలు గోడల మధ్య గడిపిన క్షణాలను కాలువ మల్లయ్య ఈ నవలలో అద్భుతంగా చిత్రించారు. బయటి లోకంలో అడుగడుగునా ఎదురయ్యే కుల వివక్ష, అవమానాల కంటే, జైలులో సిద్ధాంతం కోసం శిక్ష అనుభవించడంలోనే ఒక రకమైన తృప్తి ఉంటుంది. బిక్షమయ్యకి ఇల్లు కన్నా జైలు ఎందుకు మేలనిపించిందంటే, అక్కడ ఆయన అస్పృశ్యుడు కాదు.. ఒక ‘రాజకీయ ఖైదీ’. గౌరవం కోసం పరితపించే ఒక ఆత్మకు జైలు కటకటాలు కూడా స్వేచ్ఛా గీతాలేనని రచయిత లోతుగా చాలా సున్నితంగా విశ్లేషించారు.
As a witness to the coal seams A warrior’s ‘blood letter’ poem
ఒక ‘ఉపా’ బఆధితుడిగా ఉపా కేసు అభియోగంతో అరెస్ట్ చేయబడి 100 రోజులు అండర్ ట్రాయల్ ఖైదీగా జైలు జీవితం గడిపిన ఒక జర్నలిస్టుగా
బిక్షమయ్య అంతరంగాన్ని ఈ నవలను చదువుతూ నేను మరింత లోతుగా అర్థం చేసుకోగాను. సమాజంలో ‘అస్పృశ్యత’ పేరుతో అనుభవించే పరాయికరణ కంటే, జైలు గోడల మధ్య సిద్ధాంతం కోసం గడిపే సమయమే గౌరవప్రదమని ఆయన భావించడం విప్లవకారుడికే సాధ్యమయ్యే అత్యున్నత సంస్కారం. “ఊరికో జైలు, వాడకో జైలు లేకపోవడమే మంచిదైంది” అన్న ఆయన మాటల వెనుక ఉన్న సామాజిక వ్యంగ్యం నన్ను ఆలోచింపజేసింది. బయటి ప్రపంచం ఒక పెద్ద జైలుగా మారినప్పుడు, స్వేచ్ఛా భావజాలమే అసలైన విముక్తి అని ఈ నవల గుర్తుచేస్తుంది. ఈ నవలలోని అత్యంత కీలకమైన ఘట్టం బిక్షమయ్య ఆలోచనా సరళిలో వచ్చిన మార్పు. ‘లాల్’ ఉద్యమ పోరాట పటిమను పుణికిపుచ్చుకున్న ఆయన, కాలక్రమేణా సామాజిక విముక్తికి అంబేద్కర్ ఆత్మగౌరవ భావజాలమే అసలైన మార్గమని గుర్తించినట్లుగా ఆయన ప్రయాణం పరిశీలిస్తే అర్థమవుతోంది. కుల నిర్మూలన జరగనిదే శ్రమకు విముక్తి లేదన్న నిజాన్ని ఆయన గుర్తించిన తీరు నేటి తరానికి దిక్సూచి. “శత్రువు లేనివాడు నంగి” అని ఆయన చెప్పే పచ్చి నిజాన్ని ఒక జర్నలిస్టుగా నేను మనస్పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్టుకు, సమాజం కోసం పోరాడే యోధుడికి శత్రువులు ఉండటం సహజం. ఇంకా సూటిగా చెప్పాలంటే శత్రువు లేకపోతే సజీవంగా లేనట్లే. ‘అస్పృశ్య యోధుడు’ నవల కేవలం ఒక వ్యక్తి బయోపిక్ కాదు. అది ఒక అస్తిత్వ విస్ఫోటనం. అణచివేత ఎక్కడైతే ఉంటుందో, అక్కడ బిక్షమయ్య లాంటి యోధులు పుడుతూనే ఉంటారని ఈ నవల చెబుతుంది. ఒక జర్నలిస్టుగా, ముందు చెప్పినట్లు విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమంలో, యువకునిగా యువజన సంఘంలో ఆ తరువాత ట్రేడ్ యూనియన్ లో దశాబ్థంన్నర కాలం పాటు వాపక్ష ఉద్యమంలో ఉన్న నేను జర్నలిస్ట్ వృత్తిలో కూడా దశబ్థంన్నర కాలంగా కొనసాగుతున్న నేను సమాజంలోని కుల ఆదిపత్యమో, కక్షసాధింపు చర్యలో ఒక రకంగా కలం గొంతును నొక్కాలని చూసే కుట్రలో భాగమో ఎలా అనుకున్నా సరే రెండోసారి నన్ను టార్గట్ చేసి మా తమ్ముడిని కూడా టార్గెట్ చేసి కుట్రపూరితమైన కేసు నమోదై ఒకరోజు జైలుకు గడుపతొక్కిన మానసిక స్థితిలో ఈ నవన చదివాను. ఈ నవలను చదివిన తర్వాత నాలో అనేక రేట్లు ఆత్మస్తైర్యాన్ని నింపంది. ఒకరకంగా ఈ నవల చదివాక నా స్థితి చాలా చిన్నదిగా అనిపించింది. ఇలాంటి కుట్రలు, కక్షసాధింపు చర్యలు ఒకలెక్కే కాదన్నట్లుగా కొట్టిపారేశాను.
As a witness to the coal seams A warrior’s ‘blood letter’ poem
ఇక ఈ నవలలో బాల్యంలో చిరిగిన నిక్కరు చూసి నవ్విన వెకిలి చూపుల నుంచే, వ్యవస్థను ప్రశ్నించే చూపు పుడుతుందని రచయిత కాలువ మల్లయ్య చాలా సహజంగా చిత్రించారు. మార్క్సిజం నుంచి అంబేద్కరిజం వైపు సాగిన, సాగుతున్న లాల్ నీల్ ఐక్యత కోసం సాగుతున్న బిక్షమయ్య ప్రయాణం కేవలం సిద్ధాంత మార్పు కాదు, అది ఆత్మగౌరవ అన్వేషణ. కులం అనే కంచెను విప్లవం అనే గొడ్డలితో ఎలా నరకాలో బిక్షమయ్య జీవితం చూపిస్తుంది. బిక్షమయ్య ‘అజాతశత్రువు’ కాదు.. ఆయనో ‘అజాత యుద్ధవీరుడు’. ముందే చెప్పినట్లుగా శత్రువు లేనివాడు బతకనేర్చినవాడు మాత్రమే అనే ఆయన సిద్ధాంతం, సమాజంలో తిరుగుబాటు జెండాను ఎప్పుడూ రెపరెపలాడిస్తూనే ఉంటుంది. సమాజం కోసం, సామాజిక న్యాయం, హక్కుల కోసం, సమానత్వం కోసం, ఐక్యత కోసం కోసం తపించే ప్రతి ఒక్కరూ తమ గుండెల్లో దాచుకోవాల్సిన పుస్తకం ఇది.
– దామెర రాజేందర్ (దారా)
సీనియర్ జర్నలిస్ట్
rajenderdamera@mail.com
