“Koonamneni” strategy a symbol of the communists’ self respect : తెలంగాణ రాజకీయాల్లో కమ్యూనిస్టులకు ఇదో కొత్త ఊరట. దశాబ్దాల కాలంగా పొత్తుల చుట్టూ తిరుగుతున్న కమ్యూనిస్ట్ రాజకీయాలకు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఒక కొత్త దిశను చూపాయి. ఏ ప్రధాన పార్టీతోనూ పొత్తు లేకుండా, సొంత బలంతో బరిలోకి దిగి, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లను దీటుగా ఎదుర్కొని అతిపెద్ద పార్టీగా అవతరించడం సీపీఐ సాధించిన విజయంగా చెప్పక తప్పదు. ఈ విజయం వెనుక ఉన్న రాజకీయ చదరంగం, నాయకత్వ పటిమ 1977 నాటి బెంగాల్ రాజకీయాల ఛాయలను గుర్తు చేస్తున్నాయి.
“Koonamneni” strategy – a symbol of the communists’ self-respect
గత కొన్ని ఎన్నికలుగా సీపీఐ లేదా సీపీఎం పార్టీలు ఉనికి కోసం కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం పరిపాటిగా మారింది. కానీ, ఈసారి కొత్తగూడెంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనదిగానే చెప్పాలి. ఒక రకంగా ఇది సాహసోపేత నిర్ణయం మాత్రమే కాదు ఈ ఒంటరి పోరు ఒక వ్యూహాత్మక రిస్క్ కూడా. ఈ రిస్క్ చేసి ఆ పార్టీ విజయం సాధించింది. ఇక పొత్తుల వల్ల పార్టీ క్యాడర్ నిర్వీర్యం అవుతోందని గుర్తించిన కూనంనేని, “మన బలం ఎంతో మనమే నిరూపించుకుందాం” అనే నినాదంతో ముందుకు వెళ్లారు. ఒకరకంగా ఇదో అత్యున్నతమైన ఆత్మగౌరవ పోరాటంగా చూడాలి. మరోవైపు సింగరేణి గనుల చుట్టూ అల్లుకున్న కొత్తగూడెం రాజకీయాల్లో కార్మిక సంఘం బలాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు. 1977లో పశ్చిమ బెంగాల్లో జ్యోతిబసు నాయకత్వంలో కమ్యూనిస్టులు ఎలాగైతే కాంగ్రెస్ను ఓడించి, తమ సొంత ముద్ర వేసి దశాబ్దాల పాలనకు పునాది వేశారో, ఇప్పుడు కొత్తగూడెంలో సీపీఐ గెలుపు అలాంటి ఆశలనే చిగురింపజేస్తోంది. అప్పుడు బెంగాల్లో ప్రజలు కాంగ్రెస్ పట్ల విసిగిపోయి కమ్యూనిస్టులను ఎలా ఆదరించారో, ఇక్కడ కూడా ప్రస్తుతం అధికార కాంగ్రెస్ వైఫల్యాలను, బీఆర్ఎస్ అంతర్గత విభేదాలను సీపీఐ తమకు అనుకూలంగా మార్చుకుంది. ఎన్నికలంటే కేవలం డబ్బు, మద్యం మాత్రమే కాదు, బలమైన కార్యకర్తల వ్యవస్థ ఉంటే విజయం సాధ్యమని ఈ ఫలితాలు నిరూపించాయని చెప్పక తప్పదు. ఈ విజయానికి ప్రధాన శిల్పి కూనంనేని సాంబశివరావు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై ఆయన స్పందించే తీరు ఓటర్లలో నమ్మకాన్ని కలిగించింది. పార్టీలో సీనియర్లకు, యువతకు మధ్య సమన్వయం కుదుర్చుతూ, టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలను పక్కాగా అమలు చేసినట్లుగా పరిశీస్తే అర్థం అవుతోంది. రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూనే తన సొంత నియోజకవర్గ గడ్డపై పార్టీ జెండాను రెపరెపలాడించడం ద్వారా తన నాయకత్వాన్ని అధిష్టానం వద్ద మరింత సుస్థిరం చేసుకున్నారు.
“Koonamneni” strategy – a symbol of the communists’ self-respect
ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నామనే ధీమాతో, స్థానిక నాయకత్వంలోని విభేదాలను పరిష్కరించుకోలేకపోయింది. సీపీఐతో పొత్తు లేకపోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం కాకుండా, నేరుగా సీపీఐ ఖాతాలోకి వెళ్ళిందనేది ఫలితాలు చూస్తే అర్థం అవుతున్నది. మరోవైపు గత ఎన్నికల్లో బలమైన ఉనికి చాటిన బీఆర్ఎస్, ఈసారి కేవలం 8 సీట్లకే పరిమితం కావడం ఆ పార్టీ పతనానికి సంకేతంగా కనిపిస్తోంది. క్యాడర్ చెల్లాచెదురు కావడం, స్థానిక నాయకత్వం సీపీఐ వైపు మొగ్గు చూపడం బీఆర్ఎస్ను దెబ్బతీసింది.
బీజేపీ, సీపీఎం పార్టీలు జాతీయ స్థాయిలో ప్రభావం ఉన్నా… కొత్తగూడెం గడ్డపై ఈ పార్టీలు కనీస ప్రభావాన్ని కూడా చూపలేకపోయాయి. కేవలం ఒక్కో సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ కొత్తగూడెం మున్సిపల్ ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అయితే సీపీఐ సాధించిన ఈ విజయంతో వామపక్షాలు మళ్ళీ ఉమ్మడి కార్యాచరణ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే విశ్లేషణల్లో నిజం లేకపోలేదు. హంగ్ ఏర్పడిన ఈ కార్పొరేషన్లో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే, అది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కూటములకు దారితీయవచ్చు కూడా.
“Koonamneni” strategy – a symbol of the communists’ self-respect
ఏదిఏమైనప్పటికీ కొత్తగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఐ సాధించిన విజయం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు. ఇది కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక సంజీవని లాంటిది. “పొత్తులు లేకపోయినా.. ప్రజా సమస్యలపై పోరాడితే విజయం వరిస్తుంది” అనే నమ్మకాన్ని ఈ ఫలితం కలిగించింది. ఈ గెలుపు తెలంగాణ రాజకీయాల్లో కూనంనేని సాంబశివరావును ఒక శక్తివంతమైన నాయకుడిగా నిలబెట్టిందనటంలో సందేహం లేదు. ఈ ఫలితంతోనైనా భవిష్యత్తులో కమ్యూనిస్టులు ఐక్యత దిశగా ఆలోచిస్తారని ఆశీద్దాం.
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
