- ఆశయాల వారధి.. యువతకు స్ఫూర్తి..
- మహిళా శక్తికి నిలువెత్తు రూపంగా ముందుకు సాగుతున్న యూత్ లీడర్ ‘సుజాత’…
Youth leader “Bandu Sujatha” is inspiring ‘DYFI’ సాధారణంగా రాజకీయాల్లో లేదా సామాజిక సేవా రంగంలో మహిళలు రాణించడం సవాలుతో కూడుకున్న పని. కానీ, తనదైన శైలితో, అంకితభావం, యువతను ఏకం చేసే నాయకత్వ లక్షణాలతో దూసుకుపోతున్నారు మహిళా వింగ్ యూత్ నాయకురాలు బందు సుజాత. నేటి తరం యువతకు ఆమె ఒక రోల్ మోడల్ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ముందుకు సాగుతూ యూవతకు, ముఖ్యంగా మహిళా వింగ్ యూత్ లో స్పూర్తి నింపుతున్నారు. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూ తన భాధ్యతలు నిర్వర్తిస్తూనే తన భర్త బందు క్రాంతి సఫోర్ట్ తో dyfi మహిళా వింగ్ యూత్ లీడర్ గా తమదైన ముద్రతో ప్రభావవంతమైన పాత్రపోషిస్తున్నారు. పలు కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కు అనుబంధంగా చెప్పుకునే dyfi యూత్ వింగ్ వాయిస్ ను వినిపిస్తున్న ‘బందు సుజాత’ తో ‘జన నిర్ణయం’ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
Youth leader “Bandu Sujatha” is inspiring ‘DYFI’!
జన నిర్ణయం : నమస్తే సుజాత గారు. యూత్ లీడర్‌గా తక్కువ సమయంలోనే ఇంత మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తోంది..?
బందు సుజాత : నమస్తే. గుర్తింపు కంటే బాధ్యత పెరిగిందనే భావన నాకు ఎక్కువగా ఉంది. యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం, ముఖ్యంగా మహిళా యువతను స్వయంశక్తితో ఎదిగేలా ప్రోత్సహించడంలో, సమస్యలపై స్పందించడంలో నావంతు బాధ్యతగా భావిస్తున్నాను.
జన నిర్ణయం : మహిళా వింగ్ యూత్ నాయకురాలిగా మీరు ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లు ఏమిటి..?
సుజాత : క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు మహిళలకు ఉన్న సంకోచాలను తొలగించడం మొదటి సవాలు. “మనం చేయగలమా?” అనే సందేహం నుంచి “మనం మాత్రమే చేయగలం..!” అనే నమ్మకం వారిలో కలిగించడానికి నిరంతరం శ్రమిస్తున్నాను. భవిష్యత్తులోనూ కొనసాగిస్తూనే ఉంటాను.
జన నిర్ణయం : నేటి యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి..?
సుజాత : యువత కేవలం అవకాశాల కోసం వేచి చూడకూడదు, అవకాశాలను సృష్టించుకోవాలి. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. యువత బాధ్యత తీసుకోవాలి. బాధ్యతతో ముందుకు సాగాలి. రాజకీయాలకు కూడా దూరం ఉండకూడదని గుర్తించాలి.
జన నిర్ణయం : సుజాత గారు, సాధారణంగా మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే కుటుంబ మద్దతు చాలా ముఖ్యం. మీ విషయంలో అది ఎలా ఉంది..?
సుజాత : నిజానికి కుటుంబం ప్రోత్సాహం లేనిదే ఏ మహిళా బయటకు రాలేదు. నా విషయంలో మా కుటుంబం ఒక పెద్ద కొండంత అండగా నిలిచింది. ముఖ్యంగా నేను ప్రజల మధ్యకు వెళ్తున్నప్పుడు, నా పిల్లల బాధ్యతను, ఇంటి బాధ్యతను నా జీవిత భాగస్వామి క్రాంతి పంచుకోవడం వల్లే నేను పూర్తి సమయాన్ని సామాజిక సేవకు కేటాయించగలుగుతున్నాను.
జన నిర్ణయం : యువత సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. దీనిని మీరు ఎలా చూస్తారు..?
సుజాత: సోషల్ మీడియా అనేది ఒక పదునైన ఆయుధం. దానిని కేవలం వినోదం కోసమే కాకుండా, సమాచార సేకరణకు మరియు సమస్యలపై గళం విప్పడానికి వాడాలి. మా మహిళా వింగ్ ద్వారా మేము సోషల్ మీడియాను ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరియు బాధితులకు తక్షణ సహాయం అందించడానికి వేదికగా వాడుతున్నాం. ఇక సామాజిక మాధ్యమాలలో నిరంతరం కాలయాపన చేయడమే కాకుండా సమాజంలో యువతల పట్ల సామాజిక ఆర్థిక రాజకీయంగా జరుగుతున్నటువంటి అసమానతులను ఎదుర్కోవడం కోసం అధ్యయనం అనే ప్రధాన ఆయుధాన్ని ఉపయోగించి రాజకీయ రంగంలో కూడా ముందుకు వెళ్లేందుకు అధ్యయనం చేసే విధంగా వారు ముందుకు పోవాలని కోరుకుంటున్నా. మా సంఘం ఆశయం కూడా అదే. మహనీయులు చెప్పినట్టు ఈ దేశం కులమత సామరస్యాన్ని వదిలి విచ్చిన్నతకు దారితీస్తున్నప్పుడు మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వము అని ఎజెండాను బలంగా ఈ సమాజానికి వినిపించడంలో భాగస్వామ్యం అవుతున్నాం.
జన నిర్ణయం : మీ నాయకత్వంలో చేపట్టిన ఏదైనా ఒక మర్చిపోలేని సంఘటన గురించి చెబుతారా..?
సుజాత : మా ప్రయత్నం మేము సిన్సియర్ గా చేస్తున్నాం. ప్రతి చిన్నప్రోగ్రాంకు కూడా దాని ప్రధాన్యత దానికి ఉంటుంది. దేనిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ప్రధానంగా సంఘం నిర్ణయాలకు కట్టుబడే చేస్తాం. దాంట్లో భాగంగానే నేను మర్చిపోలేని కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా గంజాయి డ్రగ్స్ పెరుగుతున్నప్పుడు మేము గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా యువకులను అవేర్నెస్ చేసే కార్యక్రమంలో భాగంగా ఏడు రోజులపాటు 120 కిలోమీటర్ల పాదయాత్రలో పాదాలకు చెప్పులు లేకుండా చేసాము. చాలా స్ఫూర్తినిచ్చిన కార్యక్రమం అది. ఓపక్క యువకులు ఆ మహమ్మారికి బానిసలు అవుతున్న సందర్భంలో యువతి వింగ్‌లో ప్రధాన బాధ్యురాలుగా ఉన్న నేను అందులో పాల్గొనడం జరిగింది. కాళ్లకు బొబ్బలు వచ్చిన ఆ మహమ్మారికి బానిసలు అవుతున్న యువకులను కాపాడుకునే ఒక దృఢ సంకల్పం కలిగిన ఆశయంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్లి కలుస్తూ దాని యొక్క నష్టాన్ని తెలియజేశాం. యువకులు రాజకీయ ఆర్థిక సామాజిక అంశాల మీద దేశ పురోగతి మీద అధ్యయనం చేయాలి అంటూ ఏడు రోజులు పాటు నిర్విరామంగా ఆ కార్యక్రమం చేయడం జరిగింది. నాకు బాగా గుర్తు గణపురం మండలం మైలారం గ్రామం నుంచి గణపురం మండల కేంద్రం వెళ్లే వరకు మా ఆరోగ్య పరిస్థితి కొంత క్షీణించింది. అయినా మా సంకల్ప బలాన్ని మర్చిపోకుండా నడిచి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. దానివలన దాదాపు 13 నుంచి 20 కిలోల గంజాయి ప్రభుత్వ అధికారులు దొరకబట్టే విధంగా మా కార్యక్రమం ప్రభావం చూపింది. దీంట్లో మా వారు తన డ్యూటీని నిర్వర్తించుకుంటూనే నాకు వెన్నుముకగా వారి రక్షణ సహాయాన్ని మా నాయకులతో కలిసి నడిచే విధంగా నాకు ప్రోత్సాహాన్ని అందించారు. అది అధికారుల్లో ప్రజల్లో మా కమిటీ రాష్ట్రస్థాయిలో కూడా మంచి గుర్తింపునించిన కార్యక్రమంగా నాకు ఒక బలమైన నాయకత్వం బాధ్యతలను అలవర్చుకోవడానికి ఉపయోగపడింది.
జన నిర్ణయం : రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. మీరు వాటిని ఎలా స్వీకరిస్తున్నారు..?
సుజాత : నిర్మాణాత్మకమైన విమర్శలను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. అవి నన్ను నేను సరిదిద్దుకోవడానికి సహాయపడతాయి. కానీ వ్యక్తిగత విమర్శలను లేదా నిరాధారమైన ఆరోపణలను నేను పట్టించుకోను. నా పనితీరు మాత్రమే వారికి సమాధానం చెబుతుందని నేను నమ్ముతాను.
ప్రశ్న: చివరగా, మీలాగే లీడర్ కావాలనుకునే యువతులకు మీరు ఇచ్చే ఒకే ఒక ‘సక్సెస్ మంత్రం’ ఏమిటి..?
సుజాత : “ఓటమిని చూసి భయపడకండి.. విమర్శలను చూసి వెనకడుగు వేయకండి.” నిబద్ధతతో పని చేస్తే, ఆటోమేటిక్‌గా నాయకత్వ లక్షణాలు మీలో భాగమవుతాయి. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడమే నిజమైన గెలుపు. ఆ దిశగా యువత స్పూర్తిదాయకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
జన నిర్ణయం : ఓకే ఆల్ ది బెస్ట్….
సుజాత : థాంక్యూ, ధన్యవాదాలు…
