- బతుకమ్మ – దసరా ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
- ప్రత్యేక సంచికను వెలువరించడం అభినందనీయం
- ఆవిష్కరించిన సీనియర్ న్యాయవాది అంబరీష్, వీసీకే రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్
- కార్యక్రమంలో పాల్గొన్న పలువురు న్యాయవాదులు
A literary celebration of ‘Jana Nirnayam’ during the festive season..! తెలంగాణ సంస్కృతి, ప్రజల జీవన వైవిధ్యం, సామాజిక చైతన్యానికి అక్షరరూపమిస్తూ ‘జన నిర్ణయం’ పత్రిక ప్రచురించిన ‘బతుకమ్మ – దసరా’ ప్రత్యేక సంచికను బుధవారం న్యాయవాదుల సమక్షంలో అవిష్కరించారు. ఈ సందర్బంగా సీనియర్ న్యాయవాది అంబరీష్, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ పండుగల వెనుక ఉన్న సాంస్కృతిక వైభవంతోపాటు సమాజంలోని ప్రజాస్వామిక విలువలను అక్షరాల్లో ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రత్యేక సంచిక తీసుకురావటం అభినందనీయమన్నారు. బతుకమ్మ, దసరా పండుగలు కేవలం వేడుకలకే పరిమితం కావు. తెలంగాణ అస్తిత్వం, ప్రజల జీవనశైలి, ప్రకృతితో మనిషికున్న అనుబంధం, సామూహిక జీవన స్ఫూర్తికి ప్రతీకలు. ఈ నేపథ్యంలో పండుగల సాంస్కృతిక ప్రాధాన్యంతోపాటు సామాజిక, పర్యావరణ, ప్రజాజీవన అంశాలకు చోటు కల్పిస్తూ ప్రత్యేక సంచికను రూపొందించడం విశేషం. మీడియా రంగంలో వార్తల ప్రచురణకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, సామాజిక పరిణామాలపై చర్చకు వేదిక కల్పించడం ప్రజాస్వామిక పత్రికల బాధ్యత. ఆ దిశగా ‘జన నిర్ణయం’ ప్రత్యేక సంచిక ఒక ప్రయత్నంగా నిలుస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను సమకాలీన సామాజిక దృక్పథంతో అనుసంధానిస్తూ పాఠకులకు విభిన్న అంశాలను అందించే ప్రయత్నం చేయటం మంచి పరిణామం అని పేర్కొన్నారు. పండుగల స్ఫూర్తి సమాజంలో ఐక్యతను, మానవీయ సంబంధాలను బలోపేతం చేయాలని, పత్రికలు ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలవాలని వారు ఆకాంక్షించారు. ఈ అవిష్కరణ కార్యక్రమంలో న్యాయవాదులు కె. మురళీధర్ (పిపి), బార్ ఆసోషియేషన్ మాజీ సభ్యులు వెంకటేష్, గందం శివ, జి. బిక్షపతి, ఆశీర్వాదం, సాంబశివరావు, అన్వర్, బిక్షపతి, పోరిక సమ్మయ్య, ఎర్రం శివశంకర్, జన నిర్ణయం ఎడిటర్ దామెర రాజేందర్, చీఫ్ బ్యూరో మరుపట్ల శంకర్, జన నిర్ణయం ప్రతినిధి స్పిలెక్స్ తదితరులు పాల్గొన్నారు.


