‘Mayday’, a story of struggle written in blood : మేడే అంటే కేవలం ఒక సాధారణ దినోత్సవం కాదు; అది ప్రపంచ కార్మిక వర్గ ఐక్యతకు, హక్కుల సాధనకు గుర్తుగా నిలిచిన ఒక చారిత్రక విప్లవం. 19వ శతాబ్దపు పారిశ్రామిక విప్లవం నుండి నేటి డిజిటల్ యుగం వరకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే అసలు శక్తి కార్మికుడే. ఒక దేశం బలంగా ఉండాలంటే ఆ దేశ కార్మికుడు బలంగా ఉండాలి. అభివృద్ధి అంటే కేవలం జీడీపీ అంకెలు పెరగడం కాదు, మనుషుల జీవన ప్రమాణాలు మెరుగుపడటం. కానీ నేటి సమాజంలో సంపద సృష్టిస్తున్న వర్గానికి ఆ సంపదపై హక్కు లేకుండా పోతోంది. “శ్రమ సామాజికం – ఫలితం సామాజికం” కావాలన్న లక్ష్యం కోసం సాగిన పోరాటాల సారమే ఈ వ్యాసం.
‘Mayday’, a story of struggle written in blood
రక్తంతో రాసిన చరిత్ర చికాగో వీధుల సాక్షిగా ప్రతి ఏటా మే 1ని మనం కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీని వెనుక 1886లో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన భీకర పోరాటం ఉంది. ఆ కాలంలో కార్మికులు రోజుకు 14 నుండి 16 గంటల పాటు దుర్భరమైన పరిస్థితుల్లో పనిచేసేవారు. “8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వ్యక్తిగత జీవితం” అనే నినాదంతో మే 1న సమ్మె ప్రారంభమైంది. మే 4న హే మార్కెట్ వద్ద శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనపై పోలీసులు బాంబులు విసిరి, కాల్పులు జరిపారు. ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోగా, నాయకులను అక్రమంగా అరెస్టు చేసి ఉరితీశారు. ఈ త్యాగాల ఫలితంగానే 1889 నుండి మేడే ప్రపంచ కార్మిక దినోత్సవంగా మారింది. కార్మిక చట్టాలకు ఇదే పునాది వేసింది.
‘Mayday’, a story of struggle written in blood
భారతదేశంలో నేడు కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ (Labour Codes). దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో ఈ కోడ్లను తీసుకురావడం కార్మికులను మళ్లీ ‘ఆధునిక బానిసత్వం’లోకి నెట్టడమే. గత కొన్నేండ్లుగా పరిణామాలను పరిలీలిస్తే కనీస వేతనం, బోనస్, సమాన వేతన చట్టాలను నీరుగార్చింది. ట్రేడ్ యూనియన్ హక్కులను, కార్మికుల నిరసన గళాన్ని అణచివేసేలా ఉంది. ఈఎస్ఐ, పీఎఫ్, ప్రసూతి ప్రయోజనాలు వంటి కీలక భద్రతా చట్టాలను నామమాత్రం చేసింది. ఫ్యాక్టరీలు, మైన్స్ ఇతర ప్రమాదకర రంగాల్లో పని చేసే కార్మికుల భద్రతను గాలికి వదిలేసింది. ఈ చట్టాల మార్పు వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడమే. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.5 బిలియన్ల కార్మిక శక్తి ఉంటే, అందులో 60 శాతం పైగా అసంఘటిత రంగంలోనే ఉన్నారు. భారతదేశంలో ఈ సంఖ్య దాదాపు 90 శాతానికి దగ్గరగా ఉంది. వ్యవసాయ కూలీలు, గిగ్ వర్కర్స్ (డెలివరీ బాయ్స్), క్యాబ్ డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులకు కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు. వీరు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్నప్పటికీ, వీరికి సామాజిక భద్రత కరువవ్వడం విషాదకరం. నేటి సమాజంలో వేతన అసమానతలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక కంపెనీ సీఈఓ వేతనానికి, ఒక సాధారణ వర్కర్ వేతనానికి పొంతన లేదు. మరోవైపు, కృత్రిమ మేధ (ఏఐ) యాంత్రీకరణ కారణంగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. కేవలం ఒక శాతం శ్రీమంతుల వద్దే 60 శాతం సంపద పోగుపడటం వల్ల ప్రజాస్వామ్యం కుంటుబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన మేడే స్ఫూర్తి అంటే కేవలం వేడుకలు చేసుకోవడం కాదు. కార్పొరేట్ శక్తులకు, కార్మిక వ్యతిరేక పాలకులకు వ్యతిరేకంగా పిడికిలి బిగించడం. కార్మిక సంఘాలు బలపడాలి, నయా ఉదారవాద విధానాలపై పోరాటం ఉధృతం కావాలి. 140 ఏళ్ల కిందట చికాగో కార్మికులు చూపిన ధైర్యంతో, హక్కుల రక్షణ కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించడమే నేటి కర్తవ్యం.
మాలోతు సాగర్
MCPI(U) వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
cell: 7013805411
