Blue flag.. Red ambition.. Humane path..! నేడు దేశం ఒక క్లిష్టమైన సైద్ధాంతిక సంక్షోభంలో ఉంది. ఒకవైపు అధికార దాహంతో రాజ్యాంగ విలువలపై దాడులు జరుగుతుంటే, మరోవైపు పీడిత వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను కాషాయ శక్తులు తమ గుప్పిట్లోకి తీసుకునే కుట్రలు సాగుతున్నాయి. బాబాసాహెబ్‌ను కేవలం ఒక ‘హిందూ సంస్కర్త’ గా చిత్రించి, ఆయన విప్లవాత్మక బుద్ధ తత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని చంపేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ మతతత్వ చీకట్లను చీల్చాలంటే.. అంబేద్కర్ – మార్క్స్ – బాలగోపాల్ ఆలోచనల కలయికతో ఒక బలమైన సామాజిక ఫ్రంట్ నిర్మించాల్సిన చారిత్రక అవసరం ఉంది.
Blue flag.. Red ambition.. Humane path..!
భారతదేశంలో ‘కులం’ అనే సామాజిక వాస్తవాన్ని విస్మరించి వర్గ పోరాటం విజయం సాధించదని అంబేద్కర్ ఏనాడో హెచ్చరించారు. అదే సమయంలో, ఆర్థిక దోపిడీని విస్మరించి కేవలం అస్తిత్వ రాజకీయాలతో పూర్తి విముక్తి రాదని మార్క్సిజం స్పష్టం చేస్తోంది. మార్క్స్ చెప్పినట్లు సంపద కేంద్రీకరణ ఒక సమస్య అయితే, ఆ సంపద అనుభవించే హక్కు కొందరికే ఉండాలని శాసించే కుల వ్యవస్థ మరో ప్రాథమిక సమస్య. ఈ రెండింటినీ కలిపి చూసినప్పుడే మనకు ‘శ్రమ విభజన’ వెనుక ఉన్న ‘శ్రామికుల విభజన’ అర్థమవుతుంది. మతతత్వ శక్తులు సరిగ్గా ఈ విభజననే ఆయుధంగా చేసుకుంటున్నాయి. శ్రామిక వర్గాన్ని కులం పేరుతో, మతం పేరుతో చీల్చి తమ పబ్బం గడుపుకుంటున్నాయి. అందుకే, ఎర్ర జెండా, నీలి జెండా భుజం భుజం కలిపితేనే ఈ దేశంలో శ్రమకు గౌరవం, మనిషికి గుర్తింపు దక్కుతాయి.
Blue flag.. Red ambition.. Humane path..!
ఈ రెండు సిద్ధాంతాల మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చిన మేధావి కె. బాలగోపాల్. ఆయన దృష్టిలో సామాజిక విముక్తి అంటే కేవలం రాజ్య అధికారం చేపట్టడం కాదు, అది సమాజంలో ప్రతి వ్యక్తికి లభించాల్సిన ‘మానవ హక్కు’. మతతత్వం అనేది కేవలం రాజకీయ అధికారం కోసం చేసే పోరాటం కాదు, అది ఒక సంస్కృతిని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే ప్రక్రియ అని బాలగోపాల్ ఎప్పుడో హెచ్చరించారు. ఒకవైపు అంబేద్కర్‌కు పూలమాలలు వేస్తూనే, ఆయన రాసిన రాజ్యాంగంలోని ‘సెక్యులరిజం’, ‘సోషలిజం’ వంటి పదాలను తుడిచేసే ప్రయత్నం చేయడం పాలకుల లోపాయికారీ కుట్ర. వారు అంబేద్కర్‌కు కండువా కప్పుతున్నారు కానీ, ఆయన రాసిన చట్టాలను మాత్రం కాలరాస్తున్నారు. అంబేద్కర్ ఆశించిన ‘కుల నిర్మూలన’ను పక్కన పెట్టి, కేవలం ‘కులాల సమన్వయం’ పేరుతో ఎన్నికల రాజకీయం చేయడం నయా మనువాదం కాక మరేమిటి..? ఇలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ సంఘాలు కేవలం జయంతి ఉత్సవాలకే పరిమితం కాకూడదు. పాలకుల వద్ద ‘బ్రోకర్లుగా’ మారి పదవులు పొందే నాయకులను ఎండగట్టాలి. ’దళిత గృహాల్లో భోజనం’ వంటి ప్రదర్శనలు చేస్తూనే, వెనుక కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను ధారాదత్తం చేయడం అటు మార్క్స్‌కు, ఇటు అంబేద్కర్‌కు చేస్తున్న ద్రోహం. ఈ రెండింటినీ ప్రశ్నించే గొంతుకగా సామాజిక ఫ్రంట్ ఎదగాలి. అంబేద్కర్ కు నిజమైన నివాళి అంటే విగ్రహాల అలంకరణ కాదు.. మతతత్వానికి వ్యతిరేకంగా ఒకే వేదికపైకి రావడం. సంక్షేమ పథకాల కోసం చేయి చాపే యాచక స్థితి నుంచి, వనరుల పంపిణీలో భాగస్వామ్యం కోరే స్థాయికి సమాజం ఎదగాలి. బాలగోపాల్ ఆశించినట్లుగా.. కులం, వర్గం, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పనిచేసే అన్ని ప్రజాస్వామ్య శక్తులను ఒకే తాటిపైకి తీసుకురావాలి. అంబేద్కర్ వాదులు, మార్క్సిస్ట్ శిబిరాలు మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని జోడించుకొని ఆచరించాలి. అంబేద్కర్ అంటే కోటు వేసుకున్న విగ్రహం కాదు.. అన్యాయాన్ని చూసి తిరగబడే ఆలోచన. అంబేద్కర్ ఆశించిన సమానత్వం, మార్క్స్ కలగన్న దోపిడీ రహిత సమాజం, బాలగోపాల్ పోరాడిన మానవ హక్కులు.. ఈ మూడింటి కలయికే మతతత్వ చీకట్లను చీల్చే సూర్యోదయం. విగ్రహాల ముందు మోకరిల్లడం కంటే, ఆ మహనీయుల ఆలోచనల ఆయుధంతో రాజీ లేని పోరాటం చేయడమే నేటి అవసరం. నీలి – ఎరుపు జెండాల కలయిక యయఈ రెండింటికీ మనోవిశ్లేషణను జోడించుకోవడమే ఈ దేశపు ప్రజాస్వామ్యానికి అసలైన రక్షణ కవచం..!
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
