- రాజకీయాలకు అతీతంగా ఏకమవుతున్న గ్రామం..
- ‘మన గుట్టలను కాపాడుకుందాం’ కరపత్రం ఆవిష్కరణ
The battle of the ‘crushers’ in cotton farming : మా ఊరి గుట్టలు మాకు కావాలి.. మా ఊపిరిని పీల్చేస్తున్న క్రషర్లు వద్దు.. అంటూ హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామ ప్రజలు సమరశంఖం పూరిస్తున్నారు. పత్తిపాక శివారులో ప్రకృతి సంపదను కొల్లగొడుతూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న స్టోన్ క్రషర్ కు వ్యతిరేకంగా గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు చేపట్టిన పోరాటానికి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు.
గ్రామ సెంటర్లో “మన పత్తిపాక గుట్టలను కాపాడుకుందాం” అనే నినాదంతో రూపొందించిన కరపత్రాన్ని పార్టీలకు అతీతంగా గ్రామస్తులతో కలిసి ఆవిష్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్ కారణంగా ఇప్పటికే గ్రామంలోని ఒక గుట్ట పూర్తిగా కనుమరుగైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ బ్లాస్టింగ్స్ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, పొలాల్లోకి రాయి రప్పలు వచ్చి పడుతుండటంతో వ్యవసాయం గండంలో పడిందని రైతులు వాపోయారు. క్రషర్ల నుండి వచ్చే ధూళి తాటి చెట్లపై పేరుకుపోవడంతో కల్లు గీత వృత్తి దెబ్బతినే స్థితికి వస్తుందన్నారు. సమీపంలోని కుంటలు ధూళి, రసాయనాలతో నిండిపోవడంతో చేపల పెంపకం తగ్గుముఖం పడుతుందన్నారు.
The battle of the ‘crushers’ in cotton farming
కొత్త క్రషర్ ఏర్పాటు సన్నాహాలపై ఆగ్రహం
ఇప్పటికే ఉన్న క్రషర్, డాంబర్ ప్లాంట్ తో నరకం చూస్తున్నామని, ఇప్పుడు మళ్ళీ ‘పెద్దగుట్ట’పై కొత్త క్రషర్ ఏర్పాటు చేసేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఘంట శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ.. సహజ వనరుల పరిరక్షణ కోసం గ్రామ ప్రతినిధులు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని, రాష్ట్రస్థాయి పర్యావరణ వేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్రమాలను అడ్డుకోవాలని కోరారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందించామని, తక్షణమే క్షేత్రస్థాయి విచారణ చేపట్టి ప్లాంట్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతులు తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోయినా బలవంతంగా ప్రాజెక్టులు తీసుకురావడం సరికాదని నాయకులు ధ్వజమెత్తారు.
The battle of the ‘crushers’ in cotton farming
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుడుం రాజు, వార్డు మెంబర్ నాలికె వీరప్రతాప్, రైతులు పల్లెబోయిన రవి, పల్లెపోయిన సుధాకర్, భాస్కర్, అశోక్ , రవికుమార్, రఘుపతి, శ్రీనివాస్ , పెద్దమనిషి రాజయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ చిట్టి రెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ బగ్గిరవి, కాంగ్రెస్ నాయకులు బగ్గీ బిక్షపతి,అంకేశ్వరం కుమారస్వామి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గంట శ్యాంసుందర్ రెడ్డి, చల్ల సమ్మిరెడ్డి, బండ నారాయణరెడ్డి, వైద్యుల తిరుపతిరెడ్డి, కొడిమాల సంతోష్, పెండల కిరణ్,ఎర్ర తిరుపతిరెడ్డి , లక్కం బిక్షపతి, పోతుగంటి సాంబరాజు, గడ్డమీది కరుణాకర్ యూత్ నాయకులు, రైతులు గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
