అభివృద్ధి పథంలో నల్లబెల్లి ఖానా…
ఎస్ఐ గోవర్ధన్ ‘స్వయం’ కృషితో స్టేషన్ సుందరీకరణ
The new look of the Nallabelli Police Station : సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు అంటే వెలవెలబోయే గోడలు, అస్తవ్యస్తంగా పడి ఉండే ఫైళ్లు, వర్షాకాలం వస్తే బురదమయమయ్యే ప్రాంగణాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ అంటే అనాసక్తి సామాన్యుడికి ఒక రకమైన భయం ఉంటుంది. కానీ, నల్లబెల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను చూస్తే ఆ అభిప్రాయం మారుతుంది. ఒక అధికారి తలచుకుంటే వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చో నల్లబెల్లి ఎస్ఐ వి. గోవర్ధన్ నిరూపిస్తున్నారని ఆ మండలంలో పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్యున్నారు.
The new look of the Nallabelli Police Station
నిధుల కోసం ఎదురుచూడకుండా ‘నిజాయితీ’తో ముందడుగు సాగుతున్నారు. చాలామంది అధికారులు ప్రభుత్వ నిధులు మంజూరైతేనే పనులు చేస్తామని కాలయాపన చేస్తారనేది ఒక వాదన ఉంటుంది. అయితే, బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఎస్ఐ గోవర్ధన్ భిన్నమైన పంథాను అనుసరిస్తూ వస్తున్నారు. ”మనం పని చేసే చోటు మనకు దేవాలయం వంటిది” అనే సిద్ధాంతాన్ని నమ్మి, ఆయన కేవలం ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా, తన శక్తిమేరకు తన పరిధిలో తన స్వంతంగా తనకు ఉన్న శక్తిమేరకు స్టేషన్ అభివృద్ధికి పూనుకోవడం విశేషం. ఇది కేవలం బాధ్యత మాత్రమే కాదు, వృత్తి పట్ల ఆయనకున్న అపారమైన మమకారానికి నిదర్శనం.
The new look of the Nallabelli Police Station
సిఐ సాయి రమణ పర్యవేక్షణలో ఎస్ఐ గోవర్థన్ చేసిన మార్పులు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. గతంలో వర్షం వస్తే మోకాళ్ల లోతు బురదతో నీట మునిగే పరిస్థితిలో స్టేషన్కు రావాలంటేనే ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు స్టేషన్ చుట్టూ నాణ్యమైన సీసీ రోడ్లు నిర్మించి, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా చేశారు. స్టేషన్ లోపల, బయట ఖాళీ స్థలంలో రకరకాల మొక్కలు నాటించి, వాటిని క్రమ పద్ధతిలో పెంచుతున్నారు. దీనివల్ల స్టేషన్ ఒక పార్కును తలపిస్తూ బాధితులకు మానసిక ప్రశాంతతను ఇస్తోంది. పాత భవనానికి కొత్త రంగులు అద్ది, పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. స్టేషన్ లోపలికి వెళ్లగానే ఒక సానుకూల వాతావరణం కనిపించేలా తీర్చిదిద్దారు. పోలీస్ స్టేషన్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే, అక్కడికి వచ్చే బాధితులకు భయం పోయి భరోసా కలుగుతుంది. ఎస్ఐ గోవర్ధన్ చేపట్టిన ఈ పనులు కేవలం భౌతిక మార్పులే కావు, ప్రజలకు, పోలీసులకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే సామాజిక మార్పులుగా కూడా చూడాలి. నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఇప్పుడు జిల్లాలోనే ఒక మోడల్ స్టేషన్గా నిలుస్తోంది. విధి నిర్వహణలో కఠినంగా ఉంటూనే, సామాజిక బాధ్యతలో మెత్తని మనసు చాటుకుంటున్న ఎస్ఐ గోవర్ధన్ తీరును చూసి ఉన్నతాధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతను సాకుగా చూపకుండా, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన ఎస్ఐ గోవర్ధన్ చొరవ ఆదర్శనీయం.
